Vantalu: ముదిరిన పచ్చిమిరపకాయలకు చిల్లులు పెట్టి...
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:17 PM
పొగాకు, ఆలు, టమాటా, మిరపకాయల్ని స్పెయిన్ ద్వారా అందుకుని పోర్చు గీసులు మనకు తెచ్చి పరిచయం చేశారు. పాండురంగడి శక్తిమిరప ఘాటులా ఉంటుందంటాడు ఓ కీర్తనలో పురందరదాసు.
- మిర్చి పురాణం
భిక్షు చమన్‌లాల్ తన ‘హిందూ అమెరికా’ గ్రంథంలో మెక్సికోలోని ‘ఇంకా’, ‘మయా’ అనే రెడ్ ఇండియన్ ఆదివాసీల మూలాలు భారతీ యులకు దగ్గరగా ఉన్నాయన్నాడు. క్రీపూవేల నాటికే వారు మొక్కజొన్న, బీన్స్, టమాటా, అవకాడో, వెనిల్లా, మిరపకాయల్లాంటివి పండించారట. అప్పటికి భారతీయులకు తెలీని మొక్కలివి. అడవిలా పెరుగుతుందక్కడ మొక్కజొన్న! దాని పిండితో ‘టోర్టియా’లనే రోటీలు చేసుకుంటారు. మిరపకాయలు వారికి ఆహారం, ఔషధం, ప్రాణశక్తి కూడా!
1493లో స్పెయిన్, అమెరికాని ఆక్రమిం చటంతో రెడ్ ఇండియన్ల ప్రాచీన సంస్కృతి ధ్వంసం అయ్యింది. వాళ్ల శాకాహార సంప్రదా యాలు మరుగునపడ్డాయి. ‘చిలీ కాన్ కార్నే’ అనే మిరపకాయలకూరని గొడ్డుమాంసం కూరగా మార్చేశారు, 1977లో ‘బవుల్ ఆఫ్ రెడ్’ అంటూ టెక్సాస్ రాష్ట్రం దాన్ని రాష్ట్ర వంటకంగా ప్రకటించింది.
పొగాకు, ఆలు, టమాటా, మిరపకాయల్ని స్పెయిన్ ద్వారా అందుకుని పోర్చు గీసులు మనకు తెచ్చి పరిచయం చేశారు. పాండురంగడి శక్తిమిరప ఘాటులా ఉంటుందంటాడు ఓ కీర్తనలో పురందరదాసు.అంటే, 1564లో హంపీలో మరణించిన పురందరదాసు కాలానికే మిరపకాయలు దక్షిణాదికి ప్రవేశించాయన్న మాట. అయితే, రాయలవారి ఆముక్తమాల్యదలో సామాజిక అంశాలు అనేకం ఉన్నాయి కానీ, మిరప ప్రస్తావన లేకపోవటాన బహుశా కృష్ణదేవరా యల అనంతరం దక్షిణాదికి ఇవి చేరిఉండాలి!
1678లో తంజావూరుని పాలించిన ఏకోజీ ఆస్థాన పండితుడు రఘునాథ సూరి తన ‘భోజనకుతూహలం’ పాకశాస్త్ర గ్రంథంలో మిరప మొక్కని ‘మరీచం క్షుపజం- పొదలాగా పెరిగే మిరియాలమొక్క’ అన్నాడు. ‘‘రుచ్యం దోషలం సర్వరోగకృత్ విశేషతః ప్రమేహ అర్శో వికారేషు న శస్యతే’’ ఈ మిరపకాయలురుచిని కలిగిస్తాయని, మూడు దోషాలనూ పెంచుతా యనీ, సమస్త రోగాలకూ కారణంఅవుతాయనీ, ముఖ్యంగా మూత్రవ్యాధులు, మొలల వ్యాధు లున్నవారు తినకూడదన్నాడు. మిరపకాయల గురించిన శాస్త్రప్రస్తావన చేసిన మొదటి గ్రంథం ఇదే!
మిరియాలకు బదులుగా ఏర్పడ్డవి కాబట్టి మిరియపుకాయలు అన్నారని, అవే మిరపకాయలై నాయని చాటుపద్య మణిమంజరిలో వేటూరి ప్రభాకరశాస్త్రి రాశారు. మిరపకాయల ఉత్పాదకులు రెడ్ ఇండియన్లు వాటిని శాకాహారంగా ఎలా వండుకునే వారో తెలీదు. దక్షిణాదిలో మనవాళ్లు మాత్రం కొన్ని ప్రయోగాలు చేశారు.
చల్లమిరపకాయలు: ముదిరిన పచ్చిమిరపకాయల్ని చిల్లులు పెట్టి లేదా నిలువుగా చీల్చి పులిసిన మజ్జిగలో 3రోజులు రాత్రి నానబెట్టి పగలు ఎండబెడతారు! చల్ల మిరప కాయలు అనీ అంటారు వీటిని. నూనెలో వేగించి పప్పన్నం, పెరుగన్నంలో నంజుకుంటారు.
కొరివికారం: పండుమిరప పచ్చడి ఇది. మిరపపళ్ళని కొద్దిగా నూనె వేసి వేగించి ఉప్పు, చింత పండు కలిపి పైపైన రుబ్బి నిలవపెట్టు కుంటారు. అవసరమైనప్పుడు కొద్దిగా ఇవతలికి తీసుకుని మెత్తగా రుబ్బి ఇంగువ తాలింపు పెట్టుకుంటారు.
మిరపబద్దలు: లేత పచ్చిమిరప కాయల్ని చివరనుంచి రెండుగా చీల్చి తొడిమ వద్ద పట్టు ఉంచుతారు, నిమ్మకాయ రసంలో ఉప్పు, వాము కలిపి అందులో వీటిని ఒకరోజు నానవేస్తారు. 3-4 రోజులు నిలవుంటాయి. కూర, పప్పుతో నంజుకుంటారు.
గుత్తిమిరప కాయల కూర: నువ్వులు, జీలకర్ర, గసగసాలు, ధనియాలు దోరగా వేయించి మెత్తగా పొడికొట్టి ముద్దగా చేస్తారు, మిరప కాయని మధ్యకు చీల్చి గింజలు తీసేసి అందులో ఈ ముద్దని కూరతారు. తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకు వేగించి అల్లం గుజ్జు, చింతపండు రసం వేసి కొద్దిగా నీళ్లు పోసి, ఈ మిరపకాయల్ని అందులో వేసి ఉడికిస్తారు.
పరిమితంగా తీసుకుంటే మిరప కాయలు జీర్ణశక్తిని కలిగిస్తాయి, కఫాన్ని హరిస్తాయి, వేడినిస్తాయి. ఉత్తేజాన్నిస్తాయి. బద్ధకాన్ని పోగొడతాయి. పరిమితి దాటితే మిరపకారం పురుషత్వాన్ని దెబ్బకొడుతుంది. జీవకణాలు నశిస్తాయి.
మిరపకారం లేకుండా వంటచెయ్యగల పరిస్థితి లేదివ్వాళ. పరిమితంగా వాడుకుంటే చురుకుదనాన్నిస్తాయి. అతిగా తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టవుతుంది.
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
గోలి ఇడ్లీ
కావలసిన పదార్థాలు: బియ్యం పిండి- ఒకటిన్నర కప్పు, శనగ పప్పు- స్పూను, మినప్పప్పు-స్పూను, ఆవాలు- రెండు స్పూన్లు, నెయ్యి-ఒకటిన్నర కప్పు, నెయ్యి-అర స్పూను, ఎండు మిర్చి - ఒకటి, ఇంగువ - కాస్త, కరివేపాకు రెబ్బలు- రెండు, పచ్చి మిర్చి ముక్కలు - అర స్పూను, అల్లం ముక్కలు - అర స్పూను, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు.
తయారుచేసే విధానం: పెద్ద బాణలిలో నీళ్లు, ఉప్పు, నెయ్యి వేసి మరిగించాలి. నీళ్లు బాగా మరుగుతుంటే బియ్యం పిండిని వేసి కలపాలి. ముద్దలా అయ్యాక స్టవ్ స్విమ్‌లో ఉంచి మూతపెట్టాలి. రెండు నిమిషాల తరవాత స్టవ్ కట్టేయాలి. చేతులను తడిచేసుకుని పిండిని చిన్న బంతుల్లా ముద్దలు చేసుకోవాలి. ఈ ముద్దల్ని పది నిమిషాల పాటు ఆవిరిపై ఉడికిస్తే గోలి ఇడ్లీ తయారు. ఈ గోలి ఇడ్లీలకు పోపు పెడితే సరి. పైన కొత్తిమీర తరుగును చల్లాలి.
పాలక్ చాట్
కావలసిన పదార్థాలు: పాలకూర కట్ట - ఒకటి, శనగ పిండి - కప్పు, ఉడికించి, ముద్ద చేసిన ఆలు-ఒకటి, ఉల్లి ముక్కలు-కప్పు, బియ్యం పిండి-పావు కప్పు, కారం-అర స్పూను, సేవ్ - రెండు స్పూన్లు, బూందీ- రెండు స్పూన్లు, సలాడ్ - రెండు స్పూన్లు, చాట్ మసాలా - అర స్పూను, గ్రీన్ చట్నీ - రెండు స్పూన్లు, చింతపండు చట్నీ - రెండు స్పూన్లు, పెరుగు - రెండు స్పూన్లు, కారం - అర స్పూను, వాము- పావు స్పూను, నీళ్లు, ఉప్పు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: ఓ గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో పసుపు, కారం, చాట్ మసాలా, వాము, ఉప్పు వేసి అంతా కలపాలి. తగినంత నీళ్లని కూడా జతచేసి పిండిలా చేసుకోవాలి. ఇందులో పాలక్‌ను అద్ది నూనెలో వేయించాలి. ఓ వెడల్పాటి ప్లేటులో పాలక్ పకోడాలను పెట్టి, దాని పైన ఆలు, గ్రీన్ చట్నీ, చింతపండు చట్నీ, పెరుగు వేయాలి. పైన ఉల్లి, సేవ్, బూందీ, సలాడ్ వేస్తే పాలక్ చాట్ తయారు.