Rice paper: ‘రైస్ పేపర్’ను చుట్టేస్తున్నారు!
ABN , Publish Date - Nov 23 , 2025 | 07:54 AM
మునుపెన్నడూ లేనంతగా ప్రజల్లో నేడు ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. ఏం తిన్నా ఆరోగ్యకరంగానే ఉందా? అని ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. అంతేనా... నగరాల్లో అయితే తక్కువ క్యాలరీలు, జీరో ఫ్యాట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు.
బియ్యంతో చేసే అప్పడాలు మనకు తెలుసు.. పల్చటి కాగితాన్ని తలపించే పూత రేకులూ తెలుసు. అయితే ‘రైస్ పేపర్’ సరికొత్త ట్రెండ్. సమోసా, టాకో, ఫ్రాంకీలనూ కూడా వీటిలో చుట్టేస్తున్నారు. ఇంకా మోమోలు, ప్యాన్‌కేక్‌లూ, డెజర్ట్‌లూ, ఫ్లాట్ నూడుల్సూ ... లిస్టు పెరుగుతోంది. అసలు ఏమిటీ ‘రైస్ పేపర్’?
మునుపెన్నడూ లేనంతగా ప్రజల్లో నేడు ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. ఏం తిన్నా ఆరోగ్యకరంగానే ఉందా? అని ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. అంతేనా... నగరాల్లో అయితే తక్కువ క్యాలరీలు, జీరో ఫ్యాట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పాకశాస్త్ర నిపుణులు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాల ఫలితమే ‘రైస్ పేపర్’ (బియ్యపు కాగితం). ఇది చూడటానికి అచ్చంగా మన పూత రేకులా పలుచగా, పారదర్శకంగా ఉంటుంది. తింటే... అట్టులా మెత్తగా, రుచిగా అనిపిస్తుంది. ఎలాంటి ఆహారపదార్థాలతోనైనా ఇట్టే కలిసిపోతుంది. అందుకే ఎక్కువగా ఆహార పదార్థాల ర్యాపింగ్ కోసం ‘రైస్ పేపర్’ను వినియోగిస్తున్నారు. పారదర్శకంగా, లోపలి పదార్థాలు కనిపిస్తాయి కాబట్టి అలంకరణగా కూడా వాడుతున్నారు.

ఇందులో ఏముంది?
రైస్ పేపర్... వినడానికి కొత్తగానే ఉంటుంది. కానీ బియ్యంతో అప్పడాలు చేయడం మనకు తెలిసిన విద్యే. అలాగే గోదావరి జిల్లాల్లో ఎక్కువగా చేసే పూతరేకుల్లోని రేకులు చక్కెర, బియ్యపుపిండితో చేసినట్టు... రైస్ పేపర్‌ను బియ్యంతో చేస్తారు. రాత్రంతా నానబెట్టిన బియ్యాన్ని రుబ్బుకుని, దానికి కాస్త ఉప్పు వేస్తారు. ఆ రుబ్బును గంజి బట్ట కట్టిన ఇడ్లీ పాత్రమీద పలుచని, గుండ్రటి దోశలా వేసి ఆవిరిపై ఉడికించి బియ్యం కాగితాలను తయారుచేస్తారు. వీటిని ఎండలో ఆరబెట్టి, డబ్బాల్లో వేసి పెడతారు. అవసరమైనప్పుడు తీసి నీళ్లలో కాసేపు నానబెట్టి బయటికి తీస్తే... తిరిగి మెత్తగా మారి ర్యాపర్‌గా వాడుకోవడానికి అనువుగా మారుతుంది.

ఆగ్నేయాసియా దేశాల్లో ప్రతి ఇంట్లో ఇలా బియ్యం కాగితాలని చేసి పెట్టుకుంటుంటారు. వీటికి ఉన్న డిమాండ్ వల్ల అక్కడ కుటీర పరిశ్రమలా పెద్ద స్థాయిలో యంత్రాల మీద కూడా తయారుచేస్తున్నారు. కొన్నిచోట్ల వరి మొక్క ఆకులతో కూడా ఈ బియ్యం కాగితాల్ని తయారుచేస్తున్నారు. ఇందుకోసం జనపనార, మల్బరీ తదితర ఆకుల్ని కూడా వాడుతున్నారు.
అనేక రుచుల్లో...
ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే కాకుండా, మహానగరాల్లోని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో ‘రైస్ పేపర్’ షీట్లను ప్యాకెట్లలో అమ్ముతున్నారు. వీటిని కీరా, క్యారెట్, బ్రకోలీ లాంటి తాజా కూరగాయలు చుట్టడానికి, స్ర్పింగ్ రోల్స్‌లోనూ వినియోగిస్తున్నారు. చేప, మాంసాలనూ ఉడికించడానికి వాడుతున్నారు. డంప్లింగ్స్, సమోసాలు, పానీపూరీ, టాకోలలో మైదాకు బదులుగా రైస్ పేపర్లనే వాడడం విశేషం. శాండ్విచ్‌లు, బర్రీటోలలో కూడా బియ్యం కాగితాలనే ఉపయోగించడం మొదలైంది. ప్రసిద్ధ జపనీస్ వంటకం షుషిల్లో ర్యాపర్లగా రైస్ పేపర్లనే వినియోగిస్తూ పాకశాస్త్ర నిపుణులు చక్కటి ఆరోగ్యానికి సరికొత్త రుచుల దారులు వేస్తున్నారు.

అతిగా తినొద్దు...
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలోని కుకింగ్ షోలలో బియ్యం కాగితాలను వాడుతూ వీటిని ట్రెండీగా మారుస్తున్నారు ఇన్‌ఫ్లూయెన్సర్లు. తేలికగా, పారదర్శకంగా ఉండడంతో అన్నింట్లోనూ వీటి వినియోగం పెరిగింది. ప్రస్తుతం రైస్ పేపర్లు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అన్ని దేశాల ఆహార పదార్థాలలో కలిసిపోయాయి. అయితే పోషకాహార నిపుణులు మాత్రం అతి వినియోగం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. రైస్ పేపర్లలో ప్రధాన పదార్థం తెల్ల బియ్యం. సువాసన కోసం కొందరు బాస్మతీ, జాస్మిన్ రైస్‌లతో కూడా వీటిని తయారుచేస్తున్నారు. ఒకరకంగా ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో విటమిన్లు, మినరల్స్, పీచుపదార్థాలు తక్కువే. కాబట్టి ఇది పూర్తి ఆరోగ్యకరం అని భావించలేమన్నది న్యూట్రిషనిస్టుల అభిప్రాయం. అయినప్పటికీ రైస్ పేపర్‌తో ఆహార పదార్థాలను క్యారీ చేయడం సులభం... పైగా రుచి కూడా బాగుంటుంది కాబట్టి ఈ ట్రెండ్ అన్ని దేశాల్లోనూ కొనసాగుతోంది. మైదా, గోధుమతో చేసే రొట్టెలకు బదులుగా వివిధ ర్యాపర్ల కోసం రైస్‌పేపర్‌గా చుట్టేస్తున్నారు. కొత్త రుచులను ఎంచక్కా ఆస్వాదిస్తున్నారు.
అక్కడ ‘బాన్ త్రాంగ్’
ఆగ్నేయాసియా ప్రాంతం నుంచే ‘రైస్ పేపర్’ ప్రయాణం మొదలైంది. చాలా తేలికగా, పారదర్శకంగా ఉండడంతో ప్రాచీన చైనా, జపాన్‌లలో ఈ తరహా కాగితాన్ని మొదట్లో... ఎక్కువగా సమాచారాన్ని తెలిపేందుకు, చిత్రలేఖనానికి ఉపయోగించేవారట. వియత్నాం, థాయిలాండ్, కాంబోడియా, లావోస్ తదితర దేశాల వంటలలో రైస్ పేపర్‌ను ఉపయోగించడం ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా వియత్నాంలో దీన్ని ఎక్కువగా తయారుచేస్తారు, వాడతారు. రైస్‌పేపర్‌ను అక్కడ ‘బాన్ త్రాంగ్’గా వ్యవహరిస్తారు.
అనేక రకాల రైస్ పేపర్లను ఈ దేశంలో చూడవచ్చు. కొన్నిసార్లు దళసరిగా, ఆకారంలో కూడా తేడాలు ఉంటాయి. మొదట బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి, ఉదయం నీళ్లు పోసి గ్రైండర్‌లో వేసి పిండిగా చేస్తారు. తర్వాత కాస్త నీళ్లు, ఉప్పును కలిపి జారుడు పిండిగా చేసుకుంటారు. వేడి ఇనుప ప్లేట్లు, ఆవిరి బుట్టలపై ఈ పిండిని పలుచగా వేసి వేడిచేస్తారు. పిండి కాగితంలా పైకి లేస్తుంది. పెద్ద స్థాయిలో చేయడానికి రోలింగ్ మెషీన్లనూ వినియోగిస్తున్నారు. వియత్నాంలో పిండిలో నల్ల, తెల్ల నువ్వులు, కారం పొడి, కొబ్బరి పాలు, అరటి పండు గుజ్జులను కలిపి రైస్‌పేపర్ ఫ్లేవర్ మారుస్తూ కొత్త రుచులను అందిస్తున్నారు.

రుచించే అంశాలివి...
- కార్బోహైడేట్లు ఎక్కువ: బియ్యంతో చేస్తారు కాబట్టి ‘రైస్ పేపర్’లో మంచి పోషకాలను ఇచ్చే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే తక్షణ శక్తిని పొందొచ్చు.
- తక్కువ కొవ్వు, క్యాలరీలు: మిగతా స్నాక్స్‌తో పోలిస్తే ‘రైస్ పేపర్’తో చేసిన స్నాక్స్‌లో కొవ్వు పదార్థాలు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు నియంత్రణలో ఉన్నవాళ్లకి ఇది బెస్ట్ ఛాయిస్.
- గ్లుటెన్ ఫ్రీ: రైస్‌పేపర్‌లో గ్లుటెన్ ఉండదు. కాబట్టి ‘గ్లుటెన్ ఇన్‌టాలరెన్స్’ ఉన్నవారికి రైస్ పేపర్‌తో ర్యాప్ చేసిన పదార్థాలు మేలు చేస్తాయి.
- ప్రిజర్వేటివ్స్ లేవు: బియ్యం, ఉప్పు, నీళ్లు తప్పిస్తే ఈ పేపర్ తయారీలో వేరే ఏదీ వాడరు. నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్ కూడా ఉపయోగించరు.
- ఫైబర్ అధికం: జీర్ణవ్యవస్థ సజావుగా జరిగేందుకు పీచుపదార్థాలు ఎంతో అవసరం. బియ్యం కాగితాలలో తగినంత పీచు పదార్థం ఉంటుంది. కాబట్టి మలబద్ధకం ఉన్న వాళ్లకి ఇవి మేలు చేస్తాయి.
- చక్కెర నియంత్రణ: రైస్ పేపర్లలోని మేలు రకం కార్బోహైడ్రేట్ల వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. అందుకే మధుమేహం ఉన్నవారు కూడా తినొచ్చు.
- అన్నింటికీ అనుకూలం: కూరగాయలు, చేపలు, మాంసం, స్వీట్... ఇలా వేటినైనా సులభంగా రైస్ పేపర్లలో ర్యాప్ చేయవచ్చు. ఆయా ఆహారాల పోషక విలువలను పెంచుకోవచ్చు.
- వీగన్ ఫ్రెండ్లీ: ఇవి పూర్తిగా బియ్యంతో చేసినవి కాబట్టి శాకాహారులు మరో ఆలోచన లేకుండా తినొచ్చు.