Share News

పడిదము - పప్పుకట్టు

ABN , Publish Date - Jan 19 , 2025 | 10:05 AM

పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతంలోని ఈ పద్యభాగంలో అప్పడాలు, వడియాలు, తాలింపు కూరలు, పలుచని నులివెచ్చ పడిదెముల గురించి పేర్కొన్నాడు. పడిదెము లేదా పడిదము అంటే ద్రవంగా వండే ఒక పదార్థం అని, బోళము, ఊర్పు అనీ నిఘంటువులు పేర్కొన్నాయి.

పడిదము - పప్పుకట్టు

‘‘ఆప్పడంబులు వడియములుఁ

దాలింపులుఁ

బలుచని నులివెచ్చ పడిదెములును..’’

పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతంలోని ఈ పద్యభాగంలో అప్పడాలు, వడియాలు, తాలింపు కూరలు, పలుచని నులివెచ్చ పడిదెముల గురించి పేర్కొన్నాడు. పడిదెము లేదా పడిదము అంటే ద్రవంగా వండే ఒక పదార్థం అని, బోళము, ఊర్పు అనీ నిఘంటువులు పేర్కొన్నాయి. శృంగార నైషధంలో శ్రీనాథుడు ‘‘వెన్నపడిదంబు బొబ్బిల విద్రిచి విద్రిచి‘‘ - వెన్నపడిదం కలిపిన ముద్దని మునివేళ్లతో పుచ్చుకుని బొబ్బిల అంటే, ద్రవం ఊడిపడేలా విద్రిచివిద్రిచి - విస్తట్లో విదిల్చి విదిల్చి, వలచి భుజియించారట ‘వార యాత్రికులు’ అంటే మగపెళ్ళివారు. ఇప్పటి రోజుల్లో ఉలవచారుని క్రీముతో కలిపి తింటున్నాం కదా... అలా వెన్నతో తినేది వెన్నపడిదం.


పడిదం అంటే సారవంతమైన పప్పు, కాయగూరలు, దుంపకూరలు, ఆకుకూరలు, మాంసం వీటి సారం కలిగి ఉంటుందని ఆయుర్వేద గ్రంథాలు పడిదాన్ని ‘సారం’ అని పేర్కొన్నాయి. ‘‘సారం భోజనసారం సారం సారంగలోచనాధరతః పిబ ఖలు వారం వారం నోచేన్ముధాభవతి సంసారం - ఇది భోజనసారం. సారంగలోచనల అధరాలకంటే సారంగా రుచిని కలిగిస్తుంది. కాబట్టి, వారంవారం అంటే ప్రతీరోజూ దీన్ని తినాలి. తిననివాడి సంసారం నిస్సారం’’ అని!

పెసర లేదా కందిపప్పుని పొట్టు తీసి పైపైన వేగించి, కూరగాయ ముక్కలు, అల్లం, సైంధవలవణం కలిపి నీళ్లు పోసి ఉడికించాలి. సుగంధ ద్రవ్యాల పొడిని తడిపి ముద్ద చేసి (ఖల లేదా కల్కం - గ్రేవీ) కలిపి వండి, ఇంగువ ఇతర తాలింపు గింజలు వేసి నేతి పోపు పెట్టినది పడిదం. ‘పడి’కాపు (పంచను కాచుకుని ఉండే సేవకుడు) లోను, ‘పడి’కట్టు (మెట్టు)లోనూ ‘పడి’దెంలోనూ ఉన్న ‘పడి’ ఒక లాంటివే కావచ్చు. పడిదం శరీరాన్ని నిర్మించి కాపాడుతుందని అర్థం చేసుకుందాం!


ఈ పడిదాన్నే పప్పుచారు లేదా ‘పప్పుకట్టు అని కూడా పిలుస్తారు. ‘కాచు’ అంటే కాయటం (వండటం), కాపాడటం అనే రెండు అర్థాలూ ఉన్నాయి. కాచు అంటే సారం కూడా! చండ్రచెట్టు సారాన్ని ‘కాచు’ అంటారందుకే! ఇందులో చింతపండు రసానికి ప్రాధాన్యత ఉండదు. కాబట్టి, ఇది పులుసు కాదు. ఈ ‘కట్టు’ బల్లకట్టులా ఏటిని దాటిస్తుంది.ఇందులో ప్రొటీన్లు ఇంకా ఇతర పోషకాల కారణంగా శరీరం కట్టుబడికి (నిర్మాణానికి), నెత్తురు, విరేచనాలు కట్టడానికి (ఆగటానికి) దోహద పడ్తుంది. కాబట్టి, ‘కట్టు’ సార్థక నామధేయి.

కట్టు తయారీలో వాడే ద్రవ్యాలను బట్టి వాటి గుణాలు ఉంటాయి, మౌలికంగా కట్టు సారవంతమైనది. చలవచేస్తుంది. తేలికగా అరుగుతుంది. విరేచనాలను బంధిస్తుంది.


పెసరకట్టు: శరీరానికి తేలికదనాన్నిస్తుంది. కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. అన్ని జ్వరాల్లో తినదగినది. రక్తదోషాల్ని హరిస్తుంది.

కందికట్టు: షుగరు, స్థూలకాయాల్ని తగ్గిస్తుంది. చలవనిస్తుంది ఉడుకు విరేచనాల్ని ఆపుతుంది. ఆలస్యంగా అరుగుతుంది.

ఉలవకట్టు: శ్లేష్మాన్ని, అజీర్తిని, కడుపులో నొప్పిని, స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఆలస్యంగా అరిగి దండిగా ఉంటుంది.

నల్ల ఉలవల కట్టు: మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది. కఫాన్ని, వాతాన్ని పోగొడుతుంది. కీళ్లవాతంతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. స్థూలకాయాన్ని, షుగరును తగ్గించటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.


శనగపప్పుకట్టు: కమ్మగా ఉంటుంది. వగరు రుచిని కలిగి ఉంటుంది. కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది. దగ్గు ఆయాసం ఉబ్బసాల మీద పనిచేస్తుంది. శనగపప్పుని భయపడుతూ తినకండి. ఆరోగ్యానికి మంచిదే! బలకరం. నల్లశనగల కట్టు అన్నింటికన్నా మంచిది.

పప్పుకట్టుని రోజూ తింటే దాని రుచి మిమ్మల్ని ఆ‘కట్టు’కుంటుంది. జీర్ణకోశంలో ఇ‘క్కట్టు’ల్ని పోగొడ్తుంది. ఉదయం అల్పాహారానికి, రాత్రిపూట స్వల్పాహారానికి పప్పుకట్టు ఎంతగానో అనువైనది. ఇప్పటి సాంబారుకు ‘పప్పుకట్టు’ పూర్వరూపం.

- డా. జి వి పూర్ణచందు, 94401 72642

Updated Date - Jan 19 , 2025 | 10:05 AM