ఇన్స్టంట్ గారెల గురించి తెలుసా.. పౌడర్ వచ్చేసిందోచ్
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:05 PM
ఒక చిన్న కథ చెప్పనా సరదాగా ... ఇవాళ, నిజంగా జరిగిందే! కబుర్ల కోసం చెపుతాను. పొద్దున్నే, వంటింట్లోని అల్మారాలో కందిపప్పు కోసం, డబ్బాలో పోద్దామని, వెదుకుతూ వుంటే, ఆర్నెల్ల కిందట కొన్న ఒక గారెల పౌడరు ప్యాకెట్ దొరికింది.

- గారెల ప్రహసనం..
ఒక చిన్న కథ చెప్పనా సరదాగా ... ఇవాళ, నిజంగా జరిగిందే! కబుర్ల కోసం చెపుతాను. పొద్దున్నే, వంటింట్లోని అల్మారాలో కందిపప్పు కోసం, డబ్బాలో పోద్దామని, వెదుకుతూ వుంటే, ఆర్నెల్ల కిందట కొన్న ఒక గారెల పౌడరు ప్యాకెట్ దొరికింది. దాన్నెప్పుడు చూసినా,‘‘అబ్బ! అంత నూనె పోసి ఎవడు వొండుతాడుబాబూ! ఆరోగ్యానికి కూడా మంచిది కాదు!’’ అని, నా బద్దకానికి వంక చెప్పుకుంటూ, దాన్ని పక్కన పెట్టేసేవాడిని. దోశలూ, పెసరట్లూ నాలుగు రోజులుగా తిని, బోరు కొట్టి, ‘‘ఇవాళ ఎలాగన్నా గారెలే తినాలి! ఇంకా ఎంతకాలం బతుకు తాంలే!’’ అని గట్టి నిర్ణయం తీసేసుకున్నాను.
ఆ గారెల పొడి ప్యాకెట్‌ని బయటకు లాగాను. దాని మీద వున్న సూచనలు చదివాను. ఒక కప్పు పౌడరుకి ఒక కప్పు నీళ్ళు పోసి కలపమని రాసి వుంది. కావాలంటే, ఉల్లి పాయ, పచ్చి మిరపకాయ ముక్కలూ, మిరి యాల పొడీ కూడా కలపమని రాసి వుంది.
‘‘అబ్బ! సీదా సాదా గారెలు కావాలి గానీ, అవన్నీ ఎవడు పోస్తాడు బాబూ!’’ అనుకుంటూ, మళ్ళీ నా బద్దకానికి వంక చెప్పుకుంటూ, రెండు కప్పుల గారెల పొడిలో రెండు కప్పుల నీళ్ళు పోశాను. చాలా పలచగా తయారయింది. ‘‘అదేంటీ? గారెల పొడి పొట్లం వాడు చెప్పినట్టే పోశానుగా!’’ అని కూడా అనుకున్నాను. కలిపేకొద్దీ, నానే కొద్దీ గట్టి పడుతుందీ, అరచేతి మీద గారెను వేసి, మధ్యలో చిల్లు పెట్టాలని నా ఆశయం!
కొంచెం గట్టి పడినట్టే అనిపించింది.
‘కలపడం అయ్యాక, పది నిముషాల సేపు పక్కన పెట్టు’ అని ఆ పొట్లం వెనకాల రాసి వుంది. అలాగే పక్కన పెట్టాను. ఇంకా గట్టిపడుతుందనే ఆశ కలిగింది, ఎందుకంటే అప్పటికీ అది అట్ల పిండిలాగానే వుంది తప్ప, గారెల పిండిలా లేదు మరి. నీళ్ళు ఎక్కువ పోశానని అర్థమైంది గానీ, వాటిని ఎలా తీసెయ్యాలో తెలవలేదు.
బూరెల మూకుడు పొయ్యి మీద పెట్టాను. దాని నిండా నూనె పోశాను. పొయ్యి అంటించాను.
నూనె నెమ్మదిగా కాగడం మొదలు పెట్టింది. పది నిమిషాలు దాటింది గారెల పిండి కలిపి. ఆ పిండిలో చెయ్యి పెట్టి మళ్ళీకలిపాను. ఇంకా దోశల పిండి లాగానే పలచగా వుంది. ఇక, గారెల ఆశ వొదిలేసుకున్నాను.
‘ఇప్పుడు ఎలాగన్నా ఈ పిండిని గట్టిగా చెయ్యాలి! దాంతో కనీసం పునుగుల్లాగా వేసు కుందాం!’ అని ఒక కొత్త ఆలోచన వొచ్చింది.
నా తెలివికి నాకే ముచ్చటేసింది. ఇంకో అల్మారా లోంచి బియ్యం పిండి సీసా తీశాను. ఎప్పుడో ఆర్నెల్ల కిందట కొన్న పిండి అది. చూడ్డానికి బాగానే వుంది. వాసన చూశాను. అదీ బాగానే వుందనిపించింది. ఆ పిండిని నాలుగు చెంచాలు, నా గారెలపిండిలో కలిపాను. కాస్త గట్టిపడడం మొదలయింది. ఫ్రిజ్‌లో చూశాను. రెండ్రోజుల కిందట పెసరట్టు కోసమని కలుపుకున్న ఉల్లి - పచ్చిమిరప - కొత్తిమీర - జీలకర్ర మిశ్రమం కనపడింది.
అల్లం ముక్కలు కూడా వేసేవాడినే గానీ, ఇంట్లో అల్లం నిండుకుని రోజులయింది. బజారుకి వెళ్ళాలంటే ఒకటే బద్ధకం!
ఎలాగూ కలపమన్నాడు కదా! - అని, మిగిలిన ఆ ఉల్లి ముక్కల మిశ్రమాన్ని కూడా నా గారెల పిండిలో కలిపేశాను. మిరియాల పొడి కలపడం మర్చిపోయాను. వుంది ఇంట్లో గానీ, మర్చిపోయాను.
ఇంతకు ముందుకంటే గట్టిగా తయారైంది గానీ, ఇంకా కాస్త పలచగానే వుంది. పునుగుల్లా వస్తుందని అనిపించలేదు.
మళ్ళీ బియ్యం పిండి కలుపుదామని అల్మారా తీస్తే, దాని పక్కనే శనగపిండి సీసా కనపడింది. వచ్చే పాపం ఎలాగూ వస్తుందని, ఒక చిన్న చెంచాడు శనగపిండి కూడా కలిపేశాను గారెల పిండికి. ఏదో ఒక రుచి రాక పోతుందా? - అని ఆశ.
ఇంకో రెండు చెంచాల బియ్యం పిండి కలిపాను. అప్పటికి ఆ గారెల పిండి గట్టి పడింది కాస్త. చూడ్డానికి అయితే, బొత్తిగా గారెల పిండిలాగా లేదు. ఏదో తెల్లగా, పచ్చగా వుంది ఆ పిండి.
కాగిన నూనెలో చెంచాతో పునుగుల్లా వేశాను. అన్నీ ఒకే షేప్‌లో రాలేదు. రకరకాల షేపులు. చెంచా లోంచి గురుత్వాకర్షణ శక్తివల్ల పిండి ఎలా పడిందో, ఆ పునుగు ఆకారం అలా వచ్చింది. నా చేతిలో ఏమీ లేదన్నమాట!
మొత్తానికి మూడు వాయిల్లో మొత్తం పిండిని పునుగుల్లా వేసేశాను.
ఇంత గోల జరిగాక, అవేమన్నా బావుంటాయా? చచ్చినా బావుండవు! ఆర్నెల్ల కిందటి గారెల పిండి! ఆర్నెల్ల కిందటి బియ్యం పిండి! రెండ్రోజుల కిందటి ఉల్లీ - పచ్చిమిరపా మిశ్రమం! పైపెచ్చు కాస్త శనగ పిండి
కూడా కలిపాను. ఉప్మా రవ్వా, మైదా పిండీ కూడా కాస్త కలిపేవాడినే గానీ, అప్పుడు ఆ ఆలోచన రాలేదు. ఇప్పుడు చింతిస్తున్నాను అప్పుడు ఆ ఆలోచన రానందుకు!
మొత్తానికి, పునుగులో, నా మొహమో ఏవో తయారయ్యాయి పళ్ళెం నిండా! చూడ్డానికి ‘అందం’ గానే వున్నాయి.
రుచి బాగోకపోతే, వంటింట్లో చెత్త బుట్ట ఎలాగూ వుంది ఆరగించడానికి. మా వీధిలో ఊరకుక్కలు లేవు. వుంటే, వాటికి ఆహారంగా వేసేవాడిని. అవి, నాజూకులు పోకుండా, సుబ్బరంగా తినేసేవి.
పెద్ద గ్లాసులో ఫిల్టర్ కాఫీ కలుపుకున్నాను. ఒక పళ్ళెం నిండా ఆరేడు పునుగుల్లాంటివి పెట్టుకున్నాను. మనసును గట్టి చేసుకున్నాను, ‘రుచి ఎలా వున్నా నన్ను నేను తిట్టుకోకూడద’ని. నా కిష్టం అయిన రచయిత్రిని తలుచుకున్నాను ఒకసారి, ఇంకేం తలుచుకోవాలో తెలీక! ధైర్యం చేసి, ఒక పునుగును నోట్లో వేసు కున్నాను. మొహం అంతా ఒకలాగా, ఆ పునుగు నోట్ళో పడక ముందే,పెట్టేసుకున్నాను.
కానీ, ఆశ్చర్యం! అద్భుతం! ఎంత బావున్నాయో ఆ సోకాల్డ్ పునుగులు! మీ ఇష్టం వొచ్చిన పేరు పెట్టుకోండి వాటికి. రుచి అయితే అద్భుతంగా వుంది. మళ్ళీ అలాంటివి చెయ్యలేను కూడా. ఇంకేముందీ! చేసిన పునుగులన్నీ ఆబగా తినేశాను, ఫిల్టర్ కాఫీ కూడా తాగుతూ! బ్రహ్మాండమైన ఉపాహారం దొరికింది ఇవాళ - అని సంబరపడ్డాను.
తినడం పూర్తయ్యాక (కనీసం ఇరవై రెండు పునుగులు తిన్నాను మరి!) పెద్ద దిగులు మొదలయింది! కడుపులో అజీర్తి చేస్తుందని భయం పట్టుకుంది. ఆ భయంతో దిగులు పడుతూ మంచం ఎక్కి, నిట్టూర్చసాగాను.
చూద్దాం, ఏమవుతుందో!
- జె.యు.బి.వి. ప్రసాద్ jubv@yahoo.com