Bread: ఈ బ్రెడ్ రుచే వేరుగా..!
ABN , Publish Date - Nov 09 , 2025 | 08:37 AM
ఐస్‌ల్యాండ్... ఆ పేరు వింటేనే మంచును తాకిన అనుభూతి కలుగుతుంది. ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ దేశానికి వెళ్తే చలికి గడ్డకట్టుకపోవాల్సిందే. అయితే అక్కడ ఉష్ణగుండాలు ఉండడం భౌగోళికంగా ఆశ్చర్యం కలిగించే విషయం. భూ ఉష్ణశక్తిని ఎక్కువగా వినియోగించే దేశాల్లో ఐస్‌లాండ్ ఒకటి. ఈ శీతల దేశానికి టూరిస్టుల సందడి ఎక్కువే.

అక్కడికి వెళ్లేవాళ్లు తప్పకుండా ఆరగించేది ‘రై బ్రెడ్’. మిల్క్, వీట్, వైట్, ఫ్రూట్, బ్రౌన్... ఇలా ఎన్నో రకాలు రొట్టెల గురించి తెలుసు కానీ ‘రై బ్రెడ్’ పేరు కొత్తగా అనిపిస్తోంది కదూ. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌ను తీసుకోవడం తెలిసిందే. సాధారణంగా ఆయా దేశాల సంస్కృతులను బట్టి ఈ రొట్టెల తయారీ ఉంటుంది. రై బ్రెడ్డును భూ ఉష్ణశక్తితో బేక్ చేయడం విశేషం. రొట్టె తయారీకి కావలసిన పదార్థాల మిశ్రమాన్ని ఓ పాత్రలో వేసి... ఉష్ణగుండాల సమీపంలోని వేడి ఇసుకలో పన్నెండు గంటల పాటు ఉంచితే రై బ్రెడ్డు తయారవుతుంది.

ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత సుతిమెత్తగా ఉండడం విశేషం. అయితే కాస్త దళసరిగా, ముదురు కాఫీ రంగులో ఉంటుంది. బటర్‌తో కలిపి దీన్ని ఆరగిస్తారు. ఐస్‌ల్యాండ్‌కు వెళ్లే వారందరూ రై బ్రెడ్ తయారీని దగ్గర నుంచి చూడడానికి ఇష్టపడతారు. అక్కడ ట్రావెల్ ఐటినరీలో ఈ ‘బ్రెడ్ టూర్’ కూడా ఉండడం విశేషం. వణికించే చలిలో వెచ్చవెచ్చని బ్రెడ్ తింటూ టూరిస్టులు సేదతీరతారు. కొన్ని శతాబ్దాలుగా వేడి ఇసుకలో బ్రెడ్‌ను బేక్ చేస్తున్నారు ఐస్‌ల్యాండ్ దేశీయులు.