Share News

తాలింపు నుంచి తండూరి దాకా...

ABN , Publish Date - May 11 , 2025 | 12:52 PM

పాకశాస్త్ర గ్రంథాల్లో వంటకాలకు తాలితం, భృష్టకం, స్విన్నం, శుష్కం, బహురసం, తందూరు, వంటితం, శూల్యం, పుటపాకం ఇలా అనేక పద్ధతులున్నాయి. ఇప్పుడు వాటి పేర్లను ఒకసారి గుర్తుచేసుకుందాం.

తాలింపు నుంచి తండూరి దాకా...

‘‘తాలితం భృష్టకం స్విన్నం శుష్కం

బహురసం స్మృతమ్‌

తాందూరం వంటితం చైవం శూల్యం

చ పుటపాకస్య ..’’

పాకశాస్త్ర గ్రంథాల్లో వంటకాలకు తాలితం, భృష్టకం, స్విన్నం, శుష్కం, బహురసం, తందూరు, వంటితం, శూల్యం, పుటపాకం ఇలా అనేక పద్ధతులున్నాయి. ఇప్పుడు వాటి పేర్లను ఒకసారి గుర్తుచేసుకుందాం.

తాలితం (ఫ్రైయింగ్‌): ఇది మూడు రకాలుగా ఉంటుంది:

షాలో ఫ్రై: కొద్దిగా నూనె వేసి తాలింపు గింజలు వేగించటం. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

డీప్‌ ఫ్రై: సమోసాలు, వడలు, పూరీల్లాంటివి ఎక్కువ నూనెలో వేగించటం. దీనివలన ఫ్రీరాడికల్స్‌, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ ఆ వంటకంలో చేరతాయి. ఆరోగ్యానికి హాని.

పాన్‌ ఫ్రై: అట్లు, దోసెలు వంటివి పెనం మీద కొద్దిగా నూనె వేసి కాల్చడం. నూనె పరిమితంగా వాడితే ఆరోగ్యకరం.

భృష్టకం (డ్రై రోస్టింగ్‌): నెయ్యి/నూనె లేకుండా భాండీలో వేగించటం భృష్టకం.


ఇది రెండు రకాలు:

డ్రై రోస్టింగ్‌: నూనె లేకుండా వేరుశనగలు, జీలకర్ర లాంటి గింజల్ని లేదా అధాన్యాన్ని భాండీలో వేగించటం.

టోస్టింగ్‌: బ్రెడ్‌, ఉల్లిపాయ ముక్కల్లాంటివి కొద్దిగా కాల్చడం. ఇది తేలికగా అరిగేలా చేస్తుంది.

స్విన్నం (బాయిలింగ్‌/స్టీమింగ్‌): తగినన్ని నీళ్లు పోసి తక్కువ ఉష్ణోగ్రత వద్ద వండటం స్విన్నం. ఉదా: గంజివార్చిన అన్నం. ఇది ఆహారాన్ని అరిగేలా చేస్తుంది. స్టీమింగ్‌: ఇడ్లీ, కుడుముల వంటివి నీటి ఆవిరితో వండటం. పోషకాలు పదిలంగా ఉంటాయి

శుష్కం (స్టిర్‌ ఫ్రైయింగ్‌): చాలా కొద్దిగా నూనె వేసి, తరిగిన కూరగాయలు వేసి మూతపెట్టి సన్నమంట మీద ఉమ్మగిలపెట్టడం. ఆరోగ్యకరమైన విధానం ఇది.

బహురసం (సిమ్మరింగ్‌): ఎక్కువ నీళ్లలో ఎక్కువ కూరగాయముక్కలు లేదా మాంసం వేసి ఉడికించిన పులుసు లాంటివి! ఇది ఆరోగ్యకర విధానం. పాలలో బియ్యం వేసి పరమాన్నం కాయటాన్ని ‘పోచింగ్‌’ అంటారు. కూరగాయల ముక్కల్లో చింతపండు రసం పోసి పులుసుకూర ఉడికించటాన్ని ‘స్ట్యూయింగ్‌’ అంటారు.


తందూరం: ఈ పేరు పర్షియన్‌ మూలాల్లోంచి వచ్చిందని చెప్తారు. కానీ, సంస్కృతంలో తండకః అంటే, తులసి కోటలాంటి చిన్న స్తంభాకృతి అని! ఈ ఆకారంలోని పొయ్యిలో మంట మీద నాన్‌, రోటీలను కాల్చే విధానాన్ని తండూరం అని పిలిచి ఉండవచ్చు. ఈ పద్థతిలో వండినవి తేలికగా అరుగుతాయి.

వంటితం (బ్రైజింగ్‌): కొద్దిగా నూనె వేసి సన్నసెగన బెండకాయ వేపుడు, చేమదుంపల వేపుడు లాంటివి వేగించే ప్రక్రియ.

శూల్యం (బార్బెక్యూ): శూలానికి లేదా కడ్డీకి మాంసం ముక్కల్ని గుచ్చి మంట మీద కాల్చటం. ఇది బార్బెక్యూ వంట పద్ధతి. ఆదిమ మానవుడు అనుసరించిన విధానం ఇది! మాంసం తేలికగా అరుగుతుంది. దీన్ని బిబిక్యూ అని, బాబీ అని ముద్దుగా పిలుస్తున్నారిప్పుడు.


పుటపాకం (పిట్‌ బార్బెక్యూ): భూమిలో గుంట తీసి వంటపదార్థాలను కాల్చే విధానం పిత్తలకుండు పద్ధతి.

ఇన్ని పద్ధతులున్న సంస్కృతిలో ఈ వంటకాలన్నింటికీ తగిన పేర్లు ఉన్నాయి. ఈ పదాలు తిరిగి మన వంటింట్లోకి రావాలంటే వాటి గురించిన అవగాహన అవసరం. డీప్‌ ఫ్రై, గ్రిల్లింగ్‌, బేకింగ్‌ అన్నవే కాదు, తాలితం, స్విన్నం, భృష్టకం కూడా మన ఆహార కథను చెబుతున్నాయి!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


ఆలూ టిక్కా పిజ్జా

కావలసిన పదార్థాలు: ఆలూ (ఉడికించి, మెత్తగా చేసింది)- రెండు, మొక్కజొన్న పిండి -పావు స్పూను, మిరియాల పొడి - పావు స్పూను, చిల్లీ ఫ్లేక్స్‌ - స్పూను, పిజ్జా సాస్‌- రెండు స్పూన్లు, ఉల్లి, టమాటా - అర కప్పు, క్యాప్సికమ్‌ - అర కప్పు, స్వీట్‌ కార్న్‌ - పావు కప్పు, ఛీజ్‌ - స్పూను, ఉప్పు, నూనె - తగినంత.

తయారుచేసే విధానం: ఓ పెద్ద గిన్నెలో ఆలూ, మొక్కజొన్న పిండి, అర స్పూను చిల్లీ ఫ్లేక్స్‌, మిరియాల పొడి వేసి అన్నీ బాగా కలపాలి. చేతులకి కాస్త నూనె పూసుకుని మెత్తగా చేసిన ఆలూను ముద్దలుగా చేసుకుని అరచేయి అంత సైజ్‌లో చిన్న రొట్టెలా వత్తుకోవాలి. ఈ రొట్టెలన్నింటినీ నూనెలో అటూఇటూ దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక్కోదాని మీద పిజ్జా సాస్‌ను పూసి, ఉల్లి, క్యాప్సికమ్‌, టమాటా, స్వీట్‌కార్న్‌, చిల్లీ ఫ్లేక్స్‌ వేసి పెనం మీద రెండు నిమిషాలపాటు వేడిచేస్తే ఆలూ టిక్కా పిజ్జా రెడీ.


కీరా - కరివేపాకు జ్యూస్‌

book10.2.jpg

కావలసిన పదార్థాలు: కీరా - ఒకటి, కరివేపాకు - ఎనిమిది ఆకులు, పుదీనా - ఎనిమిది ఆకులు, పచ్చి లేదా ఎండు ఉసిరి- ఒకటి, రాతి ఉప్పు- కొంచెం, నీళ్లు - గ్లాసు, జీలకర్ర - పావు స్పూను.

తయారుచేసే విధానం: కీరాను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఈ ముక్కలతో పాటు అన్ని పదార్థాలను కలిపి స్మూతీ చేసుకోవాలి. గ్లాసు నీళ్లను జతచేసి మిక్సీలో వేసి, వడగడితే కీరా- కరివేపాకు జ్యూస్‌ సిద్ధం. మండే ఎండలలో చక్కని ఉపశమనం ఇది.


ఈ వార్తలు కూడా చదవండి..

రూ.70 లక్షల లంచం డిమాండ్‌

ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..

ముందుగానే నైరుతి రుతుపవనాలు

షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్‌

Read Latest Telangana News and National News

Updated Date - May 11 , 2025 | 12:52 PM