కట్టావి అనే పెసరకట్టు...
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:24 PM
1899 నాటి ‘తెలుగునాడు’ గ్రంథంలో మహాకవి దాసు శ్రీరాములు పద్యం ఇది. ఉడికీ ఉడకని మెతుకులు, అది పప్పో లేక నీళ్లో తేడా తెలియనట్టుగా నీళ్లోడుతున్న పప్పు, కాగి కాగని చారు (రసం), గరిటె నంటుకుని విదిల్చినా జారకుండా గట్టిగా ఉండే ‘కట్టావి పులుసుకూర’ని వడ్డించిందట.

‘‘ఉడికియుడకని మెదుకు నీళ్లోడుపప్పు/
కాఁగికాఁగనిచారును గరిటెనంటి
తొలఁగిజాఱని కట్టావి పులుసుఁగూర/
పతికి వడ్డించు శైవరూపవతియోర్తు’’
1899 నాటి ‘తెలుగునాడు’ గ్రంథంలో మహాకవి దాసు శ్రీరాములు పద్యం ఇది. ఉడికీ ఉడకని మెతుకులు, అది పప్పో లేక నీళ్లో తేడా తెలియనట్టుగా నీళ్లోడుతున్న పప్పు, కాగి కాగని చారు (రసం), గరిటె నంటుకుని విదిల్చినా జారకుండా గట్టిగా ఉండే ‘కట్టావి పులుసుకూర’ని వడ్డించిందట. వంట చేయటంలో ఇదొక రసాభాసం! ఇందులో ‘కట్టావి పులుసుకూర’ అంటే ఏమిటీ?
‘కట్టావి కుట్టారు గోగిరముల్మెక్కి’, ‘ఎసగి కట్టావి క్రియ నావిరెగయఁ’ ఇలా కృష్ణదేవ రాయలు ఆముక్తమాల్యద ప్రబంధంలో‘కట్టావి’ పదాన్ని రెండు సందర్భాల్లో ప్రయోగించాడు. కట్టావి అంటే, కడు+ఆవి =కుక్కర్లో వండినట్టు బాగా వేడి మీద ఉడికించినది అని! పైన పద్యంలో చెప్పిన ఆ ఇల్లాలు అన్నాన్ని, పప్పుని, చారునీ ఉడికీ ఉడక్కుండానూ, పులుసుకూరని మాత్రం అతిగానూ వండింది. దాంతో అది గరిటె మీంచి ఊడిరానంతగా గట్టిపడి పోయింది. అందుకని ‘కట్టావి పులుసుకూర’ అన్నారు దాసు శ్రీరాములు కవి!
వేడివేడిగా ఉన్నదనే అర్థంలో కట్టావిని శ్రీనాథుడు హరవిలాసంలో ‘‘...చినుకలం బుట్టు కట్టావితోడం గూడి పుడమిం బొడము కమ్మ నెత్తావి’’ అన్నాడు. వేసవిలో వేడెక్కిన నేలపైన వానచినుకులు పడి లేచిన ఆవిరి ‘కట్టావి’! మొత్తం మీద కడు వేడి కలిగింది కట్టావి.
ఈ పదం ఇక్కడితో ఆగలేదు. పెసరపప్పు, కందిపప్పు శనగపప్పు, మసూర పప్పులాంటి పప్పు బద్దల్ని బాగా నీళ్లు పోసి, సగానికి పైగా నీళ్లు ఆవిరయ్యేంతదాకా ఉడికించి, సంబారాలు కలిపి, కాచి, తాలింపుపెట్టిన వంటకాన్ని ‘కట్టు’ అన్నారు మనవాళ్లు.
ఆహార చరిత్రకారులు కట్టు కన్నడం వారి వంటకం అన్నారు. నిజానికి తెలుగు కన్నడ సోదరభాషల ఉమ్మడి ఆస్తి కట్టు. తెలుగు వాళ్లు తమ ప్రాచీన వంటకం కట్టునిదాదాపుగా మరిచారు. కన్నడం వారు కొనసాగిస్తున్నారు. అలా అది వారి స్వంతం అయ్యింది.
ఆయుర్వేదంలో యూషం (సూపు) అంటారు. సూపం అనే సంస్కృత పదం లోంచి వచ్చిందిది. పూర్తి స్వదేశీ వంటకం!
ప్రామాణిక ఆయుర్వేద వైద్యగ్రంథం ‘అష్టాంగ హృదయం’లో వాగ్భటుడు ‘మౌద్గస్తు పథ్యస్సంశుద్ధః వ్రణ కంఠాక్షిరోగిణామ్’ పెసరపప్పుతో కాచిన ముద్గయూషం అంటే పెసరకట్టు ఉపయోగాలు వివరించాడు. పెసరపప్పులో ఎక్కువ నీళ్లు పోసి సగానికిపైగా నీళ్లు మరిగేంత దాకా ఉడికించాలి, అందులో సైంధవలవణం, అల్లం, జీలకర్ర, మిరియాలపొడి ఇతర సంభారాలు కలిపి మరికొద్ది సేపు సన్నసెగన కాయాలి, దానిమ్మ గింజల్ని మెత్తగా నూరిన గుజ్జు కలిపి కమ్మగా తాలింపు పెట్టి కొత్తిమీర వగైరాలతో అలకరించిన పెసరకట్టు అనే ‘మూంగ్ దాల్ సూప్’ వ్రణాలు, గాయాలు, కరోనా లాంటి వైరసులు, బాక్టీరియాల బారి నుండి కాపాడే ‘ఇమ్యూనిటీ బూస్టర్’గా పనిచేస్తుందనీ, కన్ను, ముక్కు, చెవి, గొంతు వ్యాధుల్లో బాగా ఉపయోగపడ్తుందనీ పేర్కొన్నాడు.
ఇది తేలికగా అరుగుతుంది. శరీరంలో వేడిని తగ్గించి, నోటికి రుచిని అన్నహితవునీ కలిగిస్తుందని భోజన కుతూహలం గ్రంథం, పేర్కొంది! సైంధవ లవణంతో మాత్రమే వండుకుంటే సమస్త రోగాల్లోనూ హితవుగా ఉంటుందని సూచించింది.
ఈ ‘భోజనకుతూహలం’ పెసరకట్టుని సార ములు (ఎక్స్‌ట్రాక్ట్స్) అనే ప్రకరణంలోపేర్కొంది. దేని సారం? పెసరపప్పు సారం! పెసరపప్పుని మెత్తగా ఉడికించి అన్నంలో తిన్నదానికన్నా కట్టు రూపంలో తీసుకుంటే ఎక్కువ పప్పు తీసుకోగలుగుతాం. ఇది తేలికగా అరిగి, ఉబ్బరం లాంటి సమస్యలు కలగనీయదు.
కట్టు అంటే చింతపండు లేని పప్పుచారు. కూరగాయముక్కల్ని విడిగా ఉడికించి ఈ కట్టులో కలిపి, మిక్సీ పట్టిన చిక్కని సూపు కమ్మగా ఉంటుంది. రోజూ దీన్ని తాగుతుంటే, డైటింగ్ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. పొట్టు పెసరపప్పైతే మరీ మంచిది!
- డా. జి వి పూర్ణచందు,
94401 72642
వెజ్ జైపురి
కావలసిన పదార్థాలు: క్యారెట్, ఆలు, బీన్స్, క్యాబేజీ ముక్కలు- ఒకటిన్నర కప్పు, వెల్లులి, అల్లం ముక్కలు-స్పూను, టమాటా, జీడిపప్పు పేస్టు- కప్పు, పచ్చి మిర్చి-స్పూను, పసుపు-అర స్పూను, ధనియాల పొడి-స్పూను, కారం-స్పూను, గరం మసాలా - స్పూను, జీలకర్ర పొడి - పావు స్పూను, పనీర్ - అర కప్పు, పాపడ్ - మూడు, ఉప్పు, నీళ్లు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: బాణలిలో కాస్త నూనె వేసి క్యారెట్, ఆలుని వేయించాలి. రెండు నిమిషాల తరవాత బీన్స్, క్యాబేజీ వేసి ఉప్పు కలపాలి. కూరగాయలు కరకరలాడుతుంటే బాణలి దించేయాలి. మరో బాణలిలో రెండు స్పూన్ల నూనె వేసి జీలకర్ర, లవంగాలు, అల్లం, ఉల్లినీ చేర్పాలి. ఉల్లి రంగు మారాక పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి కలపాలి. అంతా ఘుమఘుమలాడుతుంటే, టమాటా, జీడిపప్పు పేస్టు చేర్చి అంతా బాగా కలపాలి. వేయించిన కూరగాయలు, పనీర్ ముక్కల్నీ ఇందులో కలపాలి. అంతా దగ్గరై నూనె వేరుపడుతుంటే పాపడ్ ముక్కల్ని వేసి స్టవ్ కట్టేయాలి. ఇష్టమైతే తాజా వెన్నను కూడా చేర్చుకోవచ్చు.
మ్యాగీ పఫ్
కావలసిన పదార్థాలు: మ్యాగీ-ఒక ప్యాకెట్, క్యారెట్, క్యాప్సికమ్, టమాటా, ఉల్లి ముక్కలు-రెండు కప్పులు, బటర్ - స్పూను, వెల్లుల్లి ముక్కలు - స్పూను, స్వీట్ కార్న్ -రెండు స్పూన్లు, కారం- అర స్పూను, టేస్ట్ మేకర్ - ఓ ప్యాకెట్, ఉప్పు -అర స్పూను, మైదా - అర కప్పు, బ్రెడ్ ముక్కలు - పది, బ్రెడ్ పొడి - కప్పు,మొక్క జొన్న పిండి - పావు కప్పు, నీళ్లు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: పాన్‌లో బటర్ వేసి వెల్లుల్లి, ఉల్లిముక్కల్ని వేయించాలి. ఉల్లి రంగు మారాక మిగతా కూరగాయల్ని జతచేయాలి. అన్నీ దగ్గరకి అవుతుంటే టేస్ట్‌మేకర్, కారం, ఉప్పు కలపాలి. కప్పు నీటినీ చేర్చాలి. నీళ్లు ఉడుకుతుంటే మ్యాగీ నూడుల్స్ వేయాలి. రెండు నిమిషాల తరవాత స్టవ్ కట్టేసి మూతపెట్టాలి. ఓ చిన్న గిన్నెలో మైదా, మొక్కజొన్న పిండి, ఉప్పు, కాస్త నీటిని వేసి చపాతీ పిండిలా కలుపుకుని మూతపెట్టి పక్కన ఉంచాలి. బ్రెడ్ చివర్లను కత్తిరించి, చతురస్రంగా ఒక్కో ముక్కను ఒత్తుకుని అందులో స్పూను వెజ్ మ్యాగీ వేసి నాలుగు వైపులా మూసి, వేసి బ్రెడ్ పొడిలో ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ అయ్యాక బాణలి నూనెలో ఒక్కో బ్రెడ్‌ను వేయిస్తే మ్యాగీ పఫ్ రెడీ.
ఈ వార్తలు కూడా చదవండి.
సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు
Read Latest Telangana News and National News