Share News

చింతచిగురు - చింత చెదురు

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:55 PM

వానాకాలపు సొగసును, ముసురుబడిన గగనాన్ని, రైతుల సహజ జీవనాన్ని రాజకవి రాయలవారు ఆముక్తమాల్యదలో ఇలా వర్ణించారు. గురుగు, చెంచలి, తుమ్మి, తమిరిశ, చింతచిగురుతో కూడిన ఐదాకుల కూర గురించి ఇందులో చెప్పారు.

చింతచిగురు - చింత చెదురు

‘‘గురుగుం జెంచలి తుమ్మి లేదగిరిసాకుం

దింత్రిణి పల్లవోత్కరముంగూడ,బొరంటి...’’

వానాకాలపు సొగసును, ముసురుబడిన గగనాన్ని, రైతుల సహజ జీవనాన్ని రాజకవి రాయలవారు ఆముక్తమాల్యదలో ఇలా వర్ణించారు. గురుగు, చెంచలి, తుమ్మి, తమిరిశ, చింతచిగురుతో కూడిన ఐదాకుల కూర గురించి ఇందులో చెప్పారు. వీటిలో చింతచిగురు రుతుచక్రాన్ని అనుసరించే ఆహార సాంప్రదాయంలో భాగం! తలచుకోగానే నోట్లో నీళ్లూరుతాయి కాబట్టి ‘చింత’ అన్నారు!

‘‘తింత్రిణీ పల్లవయుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్నకూటితో మెల్లన యొక్కముద్ద దిగమింగుమ నీ పసకాననయ్యెడిన్‌’’ అని శ్రీనాథుడు జొన్నకూటి మీద అక్కసు వెళ్ల బోశాడు. నిజానికి జొన్నన్నం, జొన్న రొట్టెల్లోకి చింతచిగురు బచ్చలి పప్పు మంచి జోడీ!


‘‘చింతచెట్టు చిగురుచూడు ... చిన్నదాని పొగరుచూడు..’’ అంటూ ఆరుద్ర రాసిన సినిమా పాట నేటికీ ప్రసిద్ధి!

చింతచెట్టు రోడ్డు పక్కన పెరిగే మహా వృక్షమే అయినా, దాని పైకి ఎక్కి చిగురు కోయటమే పెద్ద పని. అందుకే ఇంత ఖరీదు!

చింతచిగురు అమ్మే స్త్రీ కుమారుణ్ణి పొట్టన పెట్టుకున్న తన కొడుకుకి విష్ణుకుండిన ప్రభువు మాధవవర్మ శిక్ష విధించాడు. ఆ ధర్మనిర్ణయంతో బెజవాడ మీద బంగారు వర్షం కురిపించి దుర్గమ్మ కనకదుర్గమ్మ అయ్యిందని ఐతిహ్యం! చింతచిగురు అమ్మకం తెలుగునాట అనాదిగా ఉన్నదనే చారిత్రక సత్యాన్ని ఈ కథ చాటుతోంది!


గాత్రశుద్ధికి, గొంతునొప్పులకు, చింతచిగురు ఉపయోగకారి! అక్బరు ఆస్థాన గాయకుడు తాన్సేన్‌ సమాధిని గ్వాలియర్లో ఓ చింతచెట్టు నీడన నిర్మించారు. చింతచిగురు పప్పు, చింత చిగురు పచ్చడి, గోంగూర లాగానే నిల్వపచ్చడి ఇవన్నీ తెలుగు వంటకాలే!

చింతచిగురు వగరుగా కొద్దిగా పుల్లగా ఉంటుంది. వేసవి కాలంలో దొరుకుతుంది. చెమటను తగ్గించే గుణం దీనికుంది కాబట్టి, వేసవి కాలంలో దీని అవసరం ఎంతైనా ఉంది. ఏ రుతువులో దొరికేవి ఆ రుతువులకు అనుకూలంగా ఉంటాయి. ఇది ప్రకృతి ధర్మం!


ఫిల్లిప్పీన్స్‌ లో చింతచిగురు రసాన్ని మలే రియా జ్వరం తగ్గటానికి తాగిస్తారు. ఈజిప్టులో వేసవి పానీయంగా తాగుతారు. మిగతా కాలంలో కూడా చింతచిగురు రావటానికి తాటాకు మంట వేసి సెగ చూపిస్తే మళ్ళీ చిగురిస్తుంది. తాటాకు చప్పుళ్లకు చింత కాయలు రాలవనే సామెత దీన్నుంచే పుట్టింది.

రక్తధాతు వృద్ధికీ, కాలేయాన్ని శక్తిమంతం చేయటానికీ చింతచిగురు బాగా పనికొస్తుంది. ఒక మట్టిముంతలో గ్లాసు నీళ్లు పోసి గుప్పెడంత చింత చిగురు వేసి తుప్పు పట్టని కొత్త ఇనుప మేకును ఆ నీళ్లలోవేసి బాగా మరిగించి వడగట్టి రోజూ తాగుతుంటే కామెర్లు, ఇతర లివర్‌ వ్యాధులు, రక్త హీనత తగ్గుతాయి. మర్నాడు ఆ మేకుని శుభ్రపరచి తిరిగి వాడుకోవచ్చు!


అపకారం చేసే తార్తారిక్‌ యాసిడ్‌, గ్లూకోజు, ఫ్రక్టోజు లాంటి పంచదార పదార్థాలు కూడా చింతపండులో ఉన్నట్లు చింతచిగురులో ఉండవు కాబట్టి కొలెస్టరాల్‌, షుగర్ల స్థాయి తగ్గటానికి ఈ చింతచిగురు ప్రయోగం తోడ్పడుతుంది.

ఎండబెట్టిన ముదురు చింతాకుని శ్రీకాకుళం ప్రాంతాల్లో ‘చింతగారు’ అంటారు, చింతగారు వేసి కాచిన చారుని సర్వరోగనివారిణిగా


భావిస్తారు. ఇనపగరిటెని ఎర్రగా కాల్చి, అందులో తాలింపు గింజలు నేతితో వేగించి ఈ చింతగారు చారులో చుయ్యి మనేలా తిరగమోత పెట్టి ఆ వేడి మీదే తాగితే బాగా పనిచేస్తుందంటారు. లివర్‌ వ్యాధులకు, జీర్ణకోశ వ్యాధులకు శ్వాసకోశ వ్యాధులకు మంచి ఔషధం ఇది!

చింతచిగురుని కొబ్బరిపాలతో నూరి, సాన మీద తీసిన గంధం, పసుపు, పచ్చకర్పూరం కలిపి పేస్టులా తయారుచేసి ముఖానికి రాసు కుంటే కళాకాంతులు పెరుగుతాయి.మొటిమలు తగ్గుతాయి. దీన్ని తేనెతో కడుపులోకి తీసు కుంటే చర్మవ్యాధుల పైన బాగా పనిచేస్తుంది.

చింత చిగిర్చిన రుతుసూత్రాలు అనేకం ఉన్నాయి. పాత చింతకాయ పచ్చడి అంటారుగా... కొత్తగా చింతచిగురుతో నిలవ పచ్చడి ప్రయత్నించండి! ఉసిరికాయతో సమానగుణ ధర్మాలున్నాయి దీనికి!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


book9.2.jpg

నవరతన్‌ పులావ్‌

కావలసిన పదార్థాలు: అన్నం-రెండు కప్పులు, పనీర్‌ ముక్కలు- పావు కిలో, అల్లం, వెల్లుల్లి పేస్టు-అర స్పూను, నెయ్యి-రెండు స్పూన్లు, గరం మసాలా-అర స్పూను, బాదం, వాల్‌నట్స్‌, జీడిపప్పు- పది, ఎండు ద్రాక్ష - రెండు స్పూన్లు, గుమ్మడి గింజలు-స్పూను, ఖర్జూరాలు-మూడు, పిస్తా పలుకులు-పది, కుంకుమ పువ్వు పాలు-రెండు స్పూన్లు, ఉల్లి, క్యారెట్‌, ఆలు, బీన్స్‌, క్యాప్సికమ్‌, గోబీ, టమాటా ముక్కలు-ముప్పావు కప్పు, లవంగాలు-3, స్వీట్‌ కార్న్‌-రెండు స్పూన్లు, జీరా-అర స్పూను, మిర్యాలపొడి-అర స్పూను, బిర్యానీ ఆకు-ఒకటి, యాలకులు - 3, దాల్చిన చెక్క - ఒకటి,పచ్చి మిర్చి - రెండు, నీళ్లు, ఉప్పు, నూనె - తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా నట్స్‌ అన్నింటినీ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నమూ వండుకోవాలి. ఓ వెడల్పాటి బాణలిలో కాస్త నూనె వేసి అన్ని సుగంధ ద్రవ్యాలను వేయించాలి. ఉల్లి, మిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్టు కూడా చేర్చాలి. రెండు నిమిషాల తరవాత కూరగాయల ముక్కలనూ చేర్చాలి. రెండు స్పూన్ల నీళ్లు, ఉప్పు, గరం మసాలా జతచేసి మూతపెట్టాలి. అయిదు నిమిషాల తరవాత అన్నం, ఉప్పు కలపాలి. వేయించిన నట్స్‌ అన్నింటికీ వేయాలి. కుంకుమ పుప్వు పాలనూ కలపి, మంట తగ్గించి మూతపెట్టాలి. పది నిమిషాల తరవాత మూత తీస్తే నవరతన్‌ పులావ్‌ సిద్ధం.


రామ్‌ లడ్డు

కావలసిన పదార్థాలు: పెసరపప్పు-కప్పు, మినప్పప్పు-అర కప్పు, శనగ పప్పు - పావు కప్పు, అల్లం-చిన్న ముక్క, పచ్చి మిర్చి- రెండు, జీలకర్ర-పావు స్పూను, ఇంగువ- చిటికెడు, కొత్తిమీర తరుగు-స్పూను, బేకింగ్‌ సోడా- చిటికెడు, ఉప్పు, నీళ్లు, నూనె - తగినంత.

తయారుచేసే విధానం: పెసరపప్పు, మినప్పప్పు, శనగ పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టి, నీళ్లని వడకట్టాలి. ఈ పప్పుకు, ఉప్పు, అల్లం, పచ్చి మిర్చి, కొత్తిమీర, బేకింగ్‌సోడా, ఇంగువ జతచేసి మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టాలి. బాణలిలో నూనె కాచి అందులో చిన్న చిన్న ముద్దలుగా ఈ రుబ్బును వేయాలి. ఒక్కో ముద్దను దోరగా వేయించి తీస్తే దిల్లీలో పేరొందిన రామ్‌ లడ్డు రెడీ. కెచప్‌, గ్రీన్‌చట్నీతో ఇవి టేస్టీగా ఉంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ లక్ష దాటేసిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆధార్‌లో సమూల మార్పులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 12:59 PM