Share News

Vantalu: ఆ బర్బర పేరుతో ఒక బూరె వంటకం..

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:23 PM

ఘార అనే సంస్కృత పదానికి ‘చల్లటం’ అని అర్థం. నేతిని చేతిలో పోయించుకుని అన్నం మీద చల్లి అప్పుడు కలుపుకుని తినేవాళ్లు. అభిఘారం అంటే ఇదే! అలా నెయ్యి గానీ, పాలు గాని చల్లుతూ గోధుమ పిండిని తడిపి ముద్దలా చేసి ఉండలు కట్టి, ఒక్కో ఉండనీ బిళ్ళలుగా చేసి నేతిలో వేగించి పంచదార పాకం పట్టిన బూరెలు ఘారాపూపకాలు.

Vantalu: ఆ బర్బర పేరుతో ఒక బూరె వంటకం..

అంగ, వంగ, కళింగ, బంగాళ, నేపాల, ఘూర్జర, టెంకణ, చోళ, సింధు, మరాట, లాట, మత్స్య, విదర్భ, సౌరాష్ట బర్బర, మగధ, ఆంధ్ర ... ఇలా ప్రాచీనకాలంలో భారతదేశంలో అంతర్భాగమైన అనేక రాజ్యాలలో బర్బర ఒకటి. ఈ బర్బర పేరుతో ఒక బూరె వంటకం గురించి క్షేమకుతూహలం పేర్కొంది. ఘారా పూపకం పేరుతో గోధుమ పిండి బూరెల్ని, బర్బరాపూపకం పేరుతో బియ్యప్పిండి బూరెల్ని పేర్కొన్నాడు.

ఘారాపూపకాలు: ఘార అనే సంస్కృత పదానికి ‘చల్లటం’ అని అర్థం. నేతిని చేతిలో పోయించుకుని అన్నం మీద చల్లి అప్పుడు కలుపుకుని తినేవాళ్లు. అభిఘారం అంటే ఇదే! అలా నెయ్యి గానీ, పాలు గాని చల్లుతూ గోధుమ పిండిని తడిపి ముద్దలా చేసి ఉండలు కట్టి, ఒక్కో ఉండనీ బిళ్ళలుగా చేసి నేతిలో వేగించి పంచదార పాకం పట్టిన బూరెలు ఘారాపూపకాలు.

బర్బరాపూపకాలు: బియ్యప్పిండిని పంచదార నీళ్ళతో తడుపుతూ ముద్దగా చేసి ఉండలు కట్టి ఒక్కో ఉండను బిళ్ళలుగా నొక్కి నేతిలో వేగించినవి బర్బరాపూపకాలు లేదా బర్బరలంటారు. తెలుగులో అప్పచ్చి, మూలద్రావిడ భాషలో అప్పం, రుగ్వేద కాలంలో అపూపంగా ప్రసిద్ధి పొందిందని భాషావేత్తలు చెప్తారు. అపూపం అంటే మన అప్పం లేదా అప్పచ్చే!


ఒక విధంగా ఇవి అప్పటికప్పుడు అనుకుని చేసెయ్యగల తీపి అప్పచ్చులే! వీటి కోసం బియ్యాన్నో, గోధుమల్నో నానబెట్టటం, మరకు తీసుకువెళ్లి మరపట్టించటంలాంటి తలనొప్పులేవీ లేని తేలిక వంటకాలివి.

శివపురాణం ప్రకారం బర్బరులు అవర్ణులు. అంటే వర్ణవ్యవస్థకి చెందని వాళ్లు. నాలుగు వర్ణాల్లో ఉన్నవాళ్లే నాగరికులు అనేఅభిప్రాయం ఉన్న రోజుల్లో వీళ్ళని అనాగరికులుగా పరిగణించేవాళ్లు, బార్బేరియన్స్‌ అనే ఆంగ్లపదం వీరినుండే పుట్టి ఉండవచ్చు.

క్రీ.శ. 2వ శతాబ్ది నాటి టోలమీ ‘పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’లో పేర్కొన్న దేశాల పట్టికలో ఆంధ్రతో పాటుగా బర్బరిక కూడా ఉంది.

బహుశా ఆనాటి ప్రధాన రాజకీయ స్రవంతితో కలవని జాతిగా బర్బరుల్ని భావించవచ్చు. వారి వంటకం కాబట్టి దాన్ని వారి పేరుతో బర్బర అని పిలిచి ఉండవచ్చు.


ఈ బర్బరతోనూ, బర్బరులతోనూ సంబంధం లేదుగానీ, ఇక్కడో విషయాంతరం ఉంది. ఇజ్రాయేల్‌, జెరుసలేమ్‌ లాంటి ప్రాంతాలలో క్రైస్తవులు ప్రతి ఏడాది డిసెంబరు 4న సెయింట్‌ బార్బరా దినోత్సవం (ఈద్‌ అల్‌-బుర్బారా) జరుపుకుంటారు. ఆ రోజుతో వారికి క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభం అవుతాయి. బర్బరా అనే పవిత్ర స్త్రీ క్రైస్తవంలోకి మారినందుకు ఆమెపై దాడి జరిగితే ఆమె పంట పొలంలోకి తప్పించుకుందని, ఆమె ముందుకు వెడుతుంటే వెనుక అప్పటికప్పుడు గోధుమ మొక్కలు మొలిచి ఆమెను శత్రువులకు కనిపించకుండా కాపాడాయని ఒక ఐతిహ్యం.

ఆమె పేరుతో సెయింట్‌ బార్బరా ఉత్సవం రోజున బర్బర అనే వంటకాన్ని వాళ్లు పవిత్రా హారంగా వండుకుంటారు. ఇది వారికి శాకాహార వంటకం. గోధుమ విత్తనాలను నానబెట్టి, మృదువుగా ఉడికించి, దాల్చినచెక్క, సోంపు, అనాసపువ్వు వంటి సుగంధద్రవ్యాలు చేర్చి, తీపి కలిపి గుజ్జుగా వండిన హల్వా లాంటి వంటకం బర్బర.


10వ శతాబ్దిలో రాజశేఖరుడుకావ్యమీమాంస అనే విమర్శనా గ్రంథంలో బర్బర లేదా బర్బరి కని ఉత్తర వాయువ్య భారతదేశంలో ఒక భాగంగా పేర్కొన్నారు. సింధూనది పడమర ప్రవాహం దగ్గర బెలూచిస్థాన్‌ ప్రాంతంలో ఈ బర్బర ఉన్నదని భావిస్తారు. గంధం చెట్లు అక్కడ ఎక్కువ. బర్బరిక చందనం ప్రసిద్ధి.

మొత్తం మీద క్షేమ కుతూహలంలో ప్రస్తావించిన ‘బర్బర’ అప్పం భారతదేశంలో క్రీస్తుపూర్వం నాటి ప్రాచీన వంటకం అని భావించాలి. వీటిని ఇప్పటికీ అప్పాలనే పేరుతో మన ఇళ్ళలో చేస్తూనే ఉన్నారు. రూపాయి బిళ్ళంత పరిమాణంలో చిన్నవిగా చేసిన బర్బరఅప్పాల్ని ఆంజనేయస్వామి ప్రసాదంగా నివేదిస్తుంటారు.

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


book9.2.jpgగుమ్మడి - శనగల కర్రీ

కావలసిన పదార్థాలు: తియ్యటి గుమ్మడి ముక్కలు - రెండు కప్పులు, శనగలు (ఉడికించినవి) - కప్పు, టమాటా - ఒకటి, ఉల్లి - ఒకటి, జీలకర్ర - స్పూను, పసుపు - అర స్పూను, కారం - స్పూను, నూనె, ఉప్పు - తగినంత.

తయారుచేసే విధానం: ఓ బాణలిలో కాస్త నూనె వేసి ఉల్లి, టమాటా ముక్కల్ని మగ్గేలా చూడాలి. జీలకర్ర, పసుపు, కారం వేయాలి. రెండు నిమిషాల తరవాత గుమ్మడి, శనగలూ చేర్చాలి. గుమ్మడి మెత్తబడే వరకు ఉడికిస్తే గుమ్మడి - శనగల కర్రీ తయారు.


కేసర్‌ మసాలా ఛాయ్‌

కావలసిన పదార్థాలు: పాలు - రెండు కప్పులు, తేయాకు - నాలుగు స్పూన్లు, కేసరి - పది రేకులు, చక్కెర - ఐదు స్పూన్లు, మిరియాలు - ఆరు, లవంగాలు - 3, యాలకులు - 3, దాల్చిన చెక్క - ఒకటి, అల్లం - అంగుళం, నీళ్లు - రెండు కప్పులు.

తయారుచేసే విధానం: అల్లం, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలను ముందుగా పొడి చేసుకోవాలి. ఓ పాత్రలో నీళ్లను కాచి, తేయాకు, కేసరి, సుగంధ ద్రవ్యాల పొడి వేసి నాలుగు నిమిషాలు ఉడికించిన తరవాత పాలు, చక్కెర కలపాలి. రెండు నిమిషాల తరవాత స్టవ్‌ కట్టేసి, వడగడితే సరి.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయంగా ఎదుర్కోలేకే ఆరోపణలు

నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2025 | 12:47 PM