సుగంధ ద్రవ్యాలతో మజ్జిగ.. బోలెడు లాభాలు..
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:23 PM
చల్లతో అన్నం పైలోకంలో పూర్వీకులు దిగివచ్చినంత కమ్మగా ఉండాలి. సాక్షాత్తూ అమ్మవారు ప్రత్యక్షమై తన చేతుల్తో కలిపి పెట్టినంత మధురంగా ఉండాలి. ‘సందేహం జనయతి సుధాయామతిరసః’ అది తింటే అమృతం కలిసిన అతిరసమా అని సందేహం కలగాలంటాడు పాకశాస్త్ర గ్రంథం క్షేమ కుతూహలంలో క్షేమశర్మ పండితుడు

అజాజీ ధాన్యాకేౖ ర్మరీచరజనీ మేధికణైః
సమం పిష్టం తక్రె క్వధితమమలైః సారకఫలైః
యుతం సింధుత్యేన జ్వలితనావాబాహ్లీకసురభిః
ప్రలేహః సందేహం జనయతి సుధాయామతిరసః
చల్లతో అన్నం పైలోకంలో పూర్వీకులు దిగివచ్చినంత కమ్మగా ఉండాలి. సాక్షాత్తూ అమ్మవారు ప్రత్యక్షమై తన చేతుల్తో కలిపి పెట్టినంత మధురంగా ఉండాలి. ‘సందేహం జనయతి సుధాయామతిరసః’ అది తింటే అమృతం కలిసిన అతిరసమా అని సందేహం కలగాలంటాడు పాకశాస్త్ర గ్రంథం క్షేమ కుతూహలంలో క్షేమశర్మ పండితుడు. ఈ మజ్జిగని ‘అతిరసం మజ్జిగ’ అనవచ్చు కమ్మగా!
ఆహారాన్ని పరిమళ భరితం చేసుకునే సౌలభ్యం రోటీలతో కడుపునింపుకునే వారికన్నా కమ్మగా ఆరు రసాలతో పంచభక్ష్య పరమాన్నాలతో కూడిన అన్నం తినేవారికి ఎక్కువగా ఉంటుంది. అందుకని శాకాహార వంటకాలలో ఎక్కువ ప్రయోగాలు వరిని ప్రధాన ఆహారంగా తీసుకునే దక్షిణాదిలో జరిగాయి.
8వ శతాబ్ది నాటి ఉద్యోతన సూరి అనే ప్రాకృత జైనకవి ఆ కాలపు ఆంధ్రుల గురించి రాస్తూ, ‘పియ మహిళా సంగామే సుందర గత్తేయ భోయణే రోద్దే’ అంటాడు. ఆంధ్రులు అందమైన వాళ్లని, అందాన్ని ఆస్వాదిస్తారని, యుద్ధప్రియులని అంతే దీటుగా భోజన ప్రియులని భావం. భోజన ప్రయోగాల్లో మనల్ని చూసి ఇతరులు అనుకరించాలే గాని, ఇతరుల్ని చూసి మనం అనుకరించే పరిస్థితి ఉండకూడదు.
అల్లం వెల్లుల్లి మసాలాపేస్టు మాత్రమే కాదు, ఇంకా చాలా సుగంధ ద్రవ్యాలు పేగుని శుభ్రపరచే సుగుణ రాశులూ ఉన్నాయి. వాటిని సద్వినియోగ పరచుకోవటం మీద మనం దృష్టి సారించాల్సిన అవసరమూ ఉంది! ఆ వివరాలు చూద్దాం:
జీలకర్ర, ధనియాలు, మిరియాలు ఈ మూడింటీనీ తగుపాళ్లలో భాండీలో విడివిడిగా పైపైన వేగించి మెత్తగా మిక్సీ పట్టండి! మీగడ దట్టంగా కట్టిన గట్టి పెరుగులో మూడురెట్లు నీళ్లు కలిపి, ఈ పొడిని, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు చేర్చి బాగా చిలకండి.
ఒక భాండీలో కొద్దిగా నెయ్యి వేసి, ఇంగువ పొడిని, తాలింపు గింజల్ని, కాసిన్ని మెంతుల్ని వేగించి ఈ మజ్జిగకు తాలింపు పెట్టండి. మజ్జిగని ఇలా సుగంధ ద్రవ్యాలతో పరిమళ భరితం చేసుకుని తాగితే కమ్మగా ఉంటుంది. అన్నంలో కలుపుకుని తాగవచ్చు. మెంతులు వేసినప్పుడు దీన్ని మెంతిచారు అని, కొద్దిగా వాము కలపితే వాముమజ్జిగ అని కూడా పిలుస్తారు.
‘‘ప్రలేహః పాచనో హృద్యో రుచ్యో వహ్నిప్రదో లఘు కపానిలవిబంధఘ్నః కించిత్పిత్తప్రకోపకః’’ ఇది కమ్మగా తయారైన వంటకం (బ్రాత్). అన్నంలో ఆఖరుగా తింటే, ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. మనసుకి ఇంపుగా ఉంటుంది. అన్నం తినాలనే కోరికని, నోటికి రుచిని కలిగించి, జాఠరాగ్నిని పెంపు చేస్తుంది. శరీరానికి తేలికదనాన్నిస్తుంది. కఫాన్ని, వాతాన్ని మలబద్ధతని పోగొడుతుంది. ఊపిరితిత్తుల్లో సమస్యలపైన, దగ్గు, జలుబు, తుమ్ముల్లాంటి ఎలర్జీ వ్యాధుల మీద కూడా పని చేస్తుంది! షుగరువ్యాధి, స్థూలకాయం ఉన్న వారికి మేలు చేస్తుంది. కొద్దిగా వేడి చేస్తుంది. వేడి తత్త్వం ఉన్నవారు ఈ సుగంధాల మజ్జిగని పలుచగా తీసుకోవాలి!
ఇందులో విషదోషాల్ని హరించి, పేగుల్ని బాగుచేసి, ఎముకల్ని పెంపు చేసే క్యాల్షియం లాంటివి ఉన్నాయి. అన్నం తిన్నతర్వాత ఒక గ్లాసు ఈ సుగంధాల మజ్జిగ తాగితే భుక్తాయాసం కలక్కుండా ఉంటుంది.
మజ్జిగ వాసన కొందరికి ఎలర్జీ. పెరుగు గానీ, మజ్జిగ గానీ కలిసిన దేన్ని తినలేరు వీళ్లు. ఈ పరిమళభరిత అతిరసం మజ్జిగను ఇలాంటి వాళ్లు ప్రయత్నించవచ్చు. మజ్జిగ అనేది ప్రోబయాటిక్. పేగులను దృఢపరిచే మంచి బ్యాక్టీరియా పెరుగు/మజ్జిగలోనే ఉంటుంది. మజ్జిగని తీసుకుంటే పేగులకు బలాన్నిచ్చే ప్రోబయాటిక్, ఎముకలకు బలాన్నిచ్చే క్యాల్షియం రెండూ దండిగా శరీరానికి అందుతాయి.
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
సోయా టిక్కీ
కావలసిన పదార్థాలు: సోయా చంక్స్-కప్పు, పసుపు-పావు స్పూను, జీలకర్ర పొడి-అర స్పూను, గరం మసాలా-అర స్పూను, కారం-అర స్పూను, ఆమ్‌చూర్ పొడి-స్పూను, ఉల్లి ముక్కలు - అర కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్టు-రెండు స్పూన్లు, ఉల్లి కాడల ముక్కలు- రెండు స్పూన్లు, వేయించిన శనగ పిండి-అర కప్పు, ఉప్పు, నీళ్లు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: సోయా చంక్స్‌ని ఉప్పు వేసిన వేడి నీళ్లలో పది నిమిషాలు నానబెట్టాలి. ఆ తరవాత చంక్స్ నీటిని పిండేసి, మిక్సీలో తిప్పి మెత్తగా చేసుకోవాలి. ఈ పిండిని పెద్ద ప్లేట్‌లో వేసి ఇందులో పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ఆమ్‌చూర్ పొడి, ఉప్పు వేయాలి. ఇంకా ఉల్లి, మిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్టు, ఉల్లికాడలు, శనగపిండిని కలపాలి. చేతులకు కాస్త నూనె రాసుకుని ఈ పిండిని చిన్న బంతి అంత తీసుకుని టిక్కీలా వత్తి నూనెలో వేయించాలి. ఇలా పిండి అంతా వేయిస్తే సోయా టిక్కీ రెడీ.
గోబీ పెప్పర్ ఫ్రై
కావలసిన పదార్థాలు: గోబీ పూలు-రెండు కప్పులు, మైదా-కప్పు, మొక్కజొన్న పిండి-ముప్పావు కప్పు, పసుపు -అర స్పూను, మిరియాల పొడి - అర స్పూను, జీలకర్ర-అర స్పూను, ఉల్లి ముక్కలు-అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు- కొంచెం, క్యాప్సికం ముక్కలు-అర కప్పు, ధనియాల పొడి-అర స్పూను, టమాటా సాస్ - రెండు స్పూన్లు, మిరియాల పొడి-అర స్పూను, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు- తగినంత.
తయారు చేసే విధానం: ముందుగా గోబీ పూలని ఉప్పు వేసిన నీళ్లలో అయిదు నిమిషాలు నానబెట్టి, వడకట్టి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో మైదా, మొక్కజొన్న పిండి, పసుపు, మిరియాల పొడి వేసి అంతా కలపాలి. కప్పు నీటిని చేర్చి కాస్త జారుగా చేయాలి. ఈ పిండిలో గోబీ పువ్వుల్ని వేయాలి. ఓ కడాయిలో నూనె కాచి గోబీ పువ్వుల్ని అటూ ఇటూ దోరగా కాచి పక్కన పెట్టు కోవాలి. వెడల్పాటి పాన్‌లో కాస్త నూనె వేసి ఆవాలు, జీలకర్రలను చిటపటలా డించాలి. ఇందులోనే ఉల్లిని వేసి దోరగా వేయించాలి. క్యాప్సికం కలపాలి. పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి చేర్చాలి. టమాటా సాస్‌నూ వేసి కలపాలి. రెండు నిమిషాల తరవాత వేయించిన గోబీ పువ్వులను చేర్చి అంతా బాగా కలపాలి. చివరగా కొత్తిమీర తరుగును వేస్తే గోబీ పెప్పర్ ఫ్రై సిద్ధం.