Share News

వెయ్యేళ్లనాటి ఖండ లడ్డూ..

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:56 PM

లోకోపకార గ్రంథంలో రోజువారీ ఆహార ధాన్యంగా బార్లీని వాడుకునే కొన్ని ఉపాయా లను వివరించాడు. బార్లీ ఇంగ్లీషు పదం. మన వాళ్లు యవధాన్యం అనేవారు. బార్లీ, ఓట్స్‌ ఒకే కుటుంబానికి చెందినవి. సమాన గుణధర్మాలు కలిగినా మనవి కాబట్టి, బార్లీ మనకి ఎక్కువ హితవుగా ఉంటుంది.

వెయ్యేళ్లనాటి ఖండ లడ్డూ..

క్రీ.శ. 1025లో, పశ్చిమ చాళుక్య ప్రభువు రెండవ జయసింహ కోరికపై ‘లోకోపకార’ అనే తొలి విశ్వవిజ్ఞానకోశాన్ని చావుండరాయ అనే కవి కన్నడంలో రచించాడు. ఇదే సమయంలో తూర్పు చాళుక్య ప్రభువు రాజరాజనరేంద్రుడి కోరిక మీద పావులూరి మల్లన గణితశాస్త్ర గ్రంథం సారగణిత సంగ్రహం వెలువరించాడు. సరిగ్గా వెయ్యేళ్లక్రితం దక్షిణాదిలో ప్రాంతీయ భాషల్లో వెలువడిన తొలి వైజ్ఞానిక గ్రంథాలివి. లోకోపకారం కోసం పోటీపడ్డ ఇద్దరు ప్రభువుల విజ్ఞానోపాసనకు ఇదే నిదర్శనం!

సంస్కృతంలో అప్పటివరకు నలుడి ‘పాక దర్పణం’ మాత్రమే ప్రామాణిక గ్రంథంగా ఉండగా, లోకోపకారంలోని సూపశాస్త్ర అధ్యాయం అనేక విస్తృతమైన వివరాలను అందించింది. 1950లో హెచ్‌. శేషయ్య కన్నడ టీకతో లోకోపకారాన్ని ప్రచురించగా, 2006లో ఏషియన్‌ అగ్రి ఫౌండేషన్‌ తరఫున వాల్మీకి శ్రీనివాస అయ్యంగార్‌ దీని ఆంగ్ల అనువాదాన్ని తెచ్చారు.

లోకోపకార గ్రంథంలో రోజువారీ ఆహార ధాన్యంగా బార్లీని వాడుకునే కొన్ని ఉపాయా లను వివరించాడు. బార్లీ ఇంగ్లీషు పదం. మన వాళ్లు యవధాన్యం అనేవారు. బార్లీ, ఓట్స్‌ ఒకే కుటుంబానికి చెందినవి. సమాన గుణధర్మాలు కలిగినా మనవి కాబట్టి, బార్లీ మనకి ఎక్కువ హితవుగా ఉంటుంది. బార్లీతో వివిధ వంటకాల గురించి చావుండరాయ వివరిచాడు:


బార్లీ పిండి: పాలను చిక్కగా మరిగించి, కడిగి శుభ్రపరచిన బార్లీని అందులో ఒక రాత్రంతా నాననివ్వాలి. మర్నాడు ఆ బార్లీని ఎండబెట్టి మెత్తగా పిండి పట్టుకుంటే బియ్యప్పిండి గోధుమపిండికి బదులుగా కూర, పులుసుల్లో చిక్కదనం కోసం వాడుకోవచ్చు.

బార్లీ లడ్డూ: ఇలా తయారు చేసిన బార్లీ పిండిలో కుంకుమపువ్వు, ఏలకుల పొడి, చక్కెర కలిపి, నెయ్యి వేసి తయారుచేసిన లడ్డూలు అమితంగా చలవనిస్తాయి. తక్షణ శక్తి దాయకాలు. లివర్ని, మూత్రపిండాల్ని శక్తిమంతం చేస్తాయి.

బార్లీ పాయసం: ఈ బార్లీ పిండిని పాలలో ఉడికించి కుంకుమపువ్వు, ఏలకులపొడి, పచ్చకర్పూరం, వగైరా కలిపి కాచిన పాయసం అమిత బలకరం. చలవచేస్తుంది. వేసవిలో వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది.


బార్లీ హల్వా: పాలలో తగినంత చక్కెర పానకం కలిపి సగం మిగిలేంతదాకా మరిగించి పైన చెప్పిన బార్లీ పిండిని కలిపి ఉడికించాలి. నెయ్యి కొద్దికొద్దిగా పోస్తూ ఈ మొత్తం ముద్దగా గట్టిపడేవరకూ కలుపుతూ ఉడికిస్తే బార్లీ హల్వా సిద్ధం. కుంకుమపువ్వు, ఏలకులపొడి, డ్రై నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ వగైరా కలుపుకోవచ్చు. మైదాతో వండిన హల్వాకన్నా ఎన్నో రెట్లు పోషకవిలువలు కలిగినది. ఆరోగ్యకరమైంది కూడా!

ఖండ లడ్డూ: పైన చెప్పిన బార్లీ హల్వాలో ఖర్జూరం, తియ్యరేగుపండు లేదా ద్రాక్ష లాంటి పండ్ల గుజ్జు కలిపి, కుంకుమ పువ్వు, దాల్చినచెక్క, బిరియానీ ఆకు, పచ్చకర్పూరం లాంటివి రుచికొద్దీ కలుపుకుని ఉండలు కట్టుకొని పంచదార పొడిలో పొర్లిస్తే దాన్ని ఖండలడ్డూ అంటారని లోకోపకార పేర్కొంది.


బార్లీ అప్పాలు: పైన చెప్పిన బార్లీ హల్వాని ఉండలు కట్టి వేళ్లతో గుండ్రంగా, మందంగా వత్తి నేతిలో వేగించినవి బార్లీ అప్పాలు.

ఇంకా... పైన చెప్పిన బార్లీ పిండిని ఉడికిం చిన జావలో ఉప్పు నిమ్మరసం కలిపి తాగితే వడదెబ్బ నుండి బైటపడతారు. గోరువెచ్చని పాలలో ఈ పిండిని తగినంత కలిపి తోడు పెట్టి చిలికిన మజ్జిగ మంచి ప్రోబయాటిక్‌, ప్రీబయాటిక్‌ ఆహారం. ఉదయాన్నే చిలికి తాగితే మంచిది. విరేచనకారి కూడా!

బార్లీలో ప్రొటీన్లు, క్యాల్షియం, ఐరన్‌,ఫాస్ఫరస్‌, జింక్‌ ఉన్నాయి. అధిక ఆహారపీచు (డయటరీ ఫైబర్‌) ఉంది. షుగర్‌, స్థూలకాయం సమస్యలకు బార్లీయే ప్రత్యామ్నాయం. కడుపులో మంట, విరేచనబద్ధత, వడదెబ్బ నివారించడంలో సహాయపడుతుంది. చావుండరాయ సూచించిన విధంగా, పాలలో నానబెట్టి ఎండబెట్టి పొడి చేసే బియ్యం, గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


షార్జా షేక్‌

కావలసిన పదార్థాలు: గడ్డ కట్టిన చల్లని పాలు - రెండు కప్పులు, జీడిపప్పు ముక్కలు - రెండు స్పూన్లు, ఆరటిపండు ముక్కలు - రెండు కప్పులు, చక్కెర - రెండు స్పూన్లు, మాల్ట్‌ పౌడరు - రెండు స్పూన్లు.

book7.2.jpg

తయారుచేసే విధానం: అరటిపండు ముక్కలు, కాస్త జీడిపప్పు పలుకులు, మాల్ట్‌ పౌడర్‌ వేసి మిక్సీలో తిప్పాలి. ఆ తరవాత గడ్డకట్టిన పాలనూ చేర్చి మూడు నిమిషాలు మిక్సీ తిప్పి గ్లాసుల్లో పోసుకుని పైన మిగిలిన మాల్ట్‌ పౌడర్‌, జీడిపప్పు పలుకులతో అలంకరిస్తే షార్జా షేక్‌ రెడీ.


మ్యాంగో మస్తానీ

కావలసిన పదార్థాలు: పెద్ద మామిడిపళ్లు - 3, చల్లని పాలు - ఒకటిన్నర కప్పు, చక్కెర - మూడు స్పూన్లు, పిస్తా పలుకులు - ఆరు, జీడిపప్పు పలుకలు - ఆరు, బాదం పలుకులు - ఆరు, వెనీలా ఐస్‌క్రీమ్‌ - ఏడు స్కూప్‌లు.

తయారుచేసే విధానం: మామిడిపండు ముక్కలు, చక్కెర, పాలను బ్లెండర్‌ జార్‌లో తిప్పుకోవాలి. పొడవాటి గాజు గ్లాసుల్లో ఈ జ్యూస్‌ని వేసి పైన ఒక్కో ఐస్‌క్రీమ్‌ స్పూప్‌, డ్రైఫ్రూట్స్‌, మిగిలిన మామిడి పండు ముక్కలూ వేస్తే మ్యాంగో మస్తానీ తయారు.

Updated Date - Apr 27 , 2025 | 12:56 PM