Share News

Yadadri Thermal Power: జనవరి నుంచి 4 వేల మెగావాట్లు

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:52 AM

యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో అన్ని యూనిట్లను డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని, జనవరి నుంచి 4 వేల మెగావాట్ల (పూర్తి స్థాయిలో) విద్యుదుత్పత్తి చేపడతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Yadadri Thermal Power: జనవరి నుంచి  4 వేల మెగావాట్లు

  • యాదాద్రి ప్లాంటులోని యూనిట్లన్నీ డిసెంబరులోగా పూర్తి

  • బీఆర్‌ఎస్‌ తప్పిదాల వల్లే ఆలస్యం: భట్టి

  • రైల్వే శాఖతో ముందుగానే సమన్వయం చేసుకోండి: ఉత్తమ్‌

  • సమీప ప్రాంతాల అభివృద్ధి: కోమటిరెడ్డి

  • వైటీపీఎ్‌సలో 800 మెగావాట్ల యూనిట్‌-1 జాతికి అంకితం

నల్లగొండ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో అన్ని యూనిట్లను డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని, జనవరి నుంచి 4 వేల మెగావాట్ల (పూర్తి స్థాయిలో) విద్యుదుత్పత్తి చేపడతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మం డలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(వైటీపీఎ్‌స)లో శుక్రవారం 800 మెగావాట్ల సామ ర్థ్యం కలిగిన యూనిట్‌-1ను మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయన జాతికి అంకితం చేశారు. పవర్‌ప్లాంటు ఆవరణలో 65ఎకరాల విస్తీర్ణంలో రూ.970 కోట్లతో నిర్మిస్తోన్న ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షి్‌పకు శంకుస్థాపన చేశారు. అనంతరం జెన్‌కో అధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రు లు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తప్పిదాల వల్లనే యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణం జాప్యమైందన్నారు. పర్యావరణ, అటవీ శాఖల అనుమతులు తీసుకోకుండా ప్లాంటు నిర్మాణం ప్రారంభించడం.. గత ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మండిపడ్డారు.


ప్రజాప్రభుత్వం కొలువుదీరినతర్వాత కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించామని, ఒక్కో యూనిట్‌ను ప్రారంభిస్తూ వస్తున్నామని వివరించారు. ప్లాంటు నిర్మాణానికి భూములిచ్చిన, ఇళ్లు కోల్పోయిన వారి త్యాగాలను గుర్తుంచుకుంటామని, ఈ నెల 15వ తేదీలోగా వారికి ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా ఈలోపే ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. భూనిర్వాసితులకు పరిహారాలివ్వకుండా, ఉద్యోగ-ఉపాధి కల్పన చేపట్టకుండా గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ప్లాంటులో పూర్తి స్థాయి విద్యుదుత్పత్తి జరిగే నాటి కన్నా ముందే రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని, బొగ్గు సరఫరాకు ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని జెన్‌కో అధికారులకు మంత్రి ఉత్తమ్‌ సూచించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే విష్ణుపురం దాకా డబుల్‌ రైల్వే లైన్‌ మంజూరైనా.. ఇప్పటికీ పూర్తి కాలేదని గుర్తు చేశారు. 93కిలోమీటర్ల డబుల్‌ లైన్‌కు సరిపడా నిధులు కేంద్రం నుంచి రాకపోవడం వల్లే జాప్యం జరుగుతోందన్నారు. కాగా, ప్లాంట్‌ సమీపంలోని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. త్వరలోనే ఇక్కడ ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మిస్తామని, అత్యాధునిక వసతులతో ఆస్పత్రులు, అంబులెన్స్‌ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 03:52 AM