Share News

Teenmaar Mallanna: మహిళను కించపరిస్తే కమిషన్‌ స్పందించదా?

ABN , Publish Date - Jul 15 , 2025 | 06:00 AM

గౌరవప్రదమైన హోదాలో ఉన్న మహిళపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై ఫిర్యాదు చేయడానికి వస్తే మహిళా కమిషన్‌ స్పందించదా..

Teenmaar Mallanna: మహిళను కించపరిస్తే కమిషన్‌ స్పందించదా?

  • కమిషన్‌ కార్యాలయం ఎదుట జాగృతి మహిళల నిరసన

  • వారి ఫిర్యాదును స్వీకరించిన కమిషన్‌ సభ్యులు

  • మల్లన్న క్షమాపణలు చెప్పాలి.. జాగృతి ఎస్టీ సెల్‌ డిమాండ్‌

హైదరాబాద్‌, రాంనగర్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): గౌరవప్రదమైన హోదాలో ఉన్న మహిళపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై ఫిర్యాదు చేయడానికి వస్తే మహిళా కమిషన్‌ స్పందించదా? ఇదేం పద్ధతి? అంటూ జాగృతి మహిళానేతలు ప్రశ్నించారు. కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్‌ మల్లన్నపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సోమవారం మహిళాకమిషన్‌ కార్యాలయంలో వారు ఫిర్యాదుచేశారు. కాగా, ముందస్తు సమాచారం ఇచ్చినా చైర్‌పర్సన్‌ అందుబాటులో లేకపోవడం తగదని అసహనం వ్యక్తంచేశారు. కార్యదర్శి సైతం ఫిర్యాదులేఖను తీసుకునేందుకు అంగీకరించకపోవడంతో అక్కడే భైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. అయినా కమిషన్‌ చైర్‌పర్సన్‌ అందుబాటులోకి రాకపోవడంతో ఫిర్యాదు పత్రాన్ని కమిషన్‌ సభ్యులు సుధంలక్ష్మి, రేవతిరావు, ఉమ, అప్రోజ్‌ షహీనాకు అందజేశారు. కాగా, కవితపై తీన్మార్‌ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి ఎస్టీ సెల్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు కల్యాణ్‌నాయక్‌ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి చౌరస్తాలో మల్లన్న చిత్రపటానికి చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. మరో వైపు, తెలంగాణ జాగృతి శ్రేణులు విద్యార్థిసంఘాలు, పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. సోమవారం ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్‌ విగ్రహంవద్ద, ఎల్‌బీనగర్‌లోని జ్యోతిరావుఫూలే విగ్రహంవద్ద ఆందోళన నిర్వహించారు. మల్లన్న శాసనమండలి సభ్యత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఓయూ జేఏసీ చైర్మన్‌ ఎల్చాల దత్తాత్రేయ, కందులమధు, కొప్పుల అర్జున్‌, రామకృష్ణ ఆధ్వర్యంలో ఓయూలో ఆందోళన నిర్వహించి పోలీస్‌ ేస్టషన్‌లో ఫిర్యాదుచేశారు. తెలుగు యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు, జేఎ్‌సటీయూ పరిధిలోని విద్యార్థి సంఘాల నాయకులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.


ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో.. మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి పేరు

  • సిట్‌ విచారణలో వెల్లడించిన బీఎస్పీ నేత వట్టే జానయ్య

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త పేరు బయటకు వస్తోంది. మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి పేరు ఈ కేసులో తాజాగా బహిర్గతమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్న క్రమంలోనే బీఎస్పీ నేత వట్టే జానయ్య సోమవారం అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పలు అంశాలపై జానయ్య నుంచి దర్యాప్తు అధికారులు లిఖితపూర్వకంగా వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సిట్‌ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌తో అరాచకాలకు పాల్పడిందని విమర్శించారు. ‘‘2022 నుంచి మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో నా ఫోన్‌ను ట్యాప్‌ చేయించారు. నాపై 25 కేసులు పెట్టి, 65 రోజులు అజ్ఞాతంలో ఉండేలా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నా ఓటమికి ఫోన్‌ ట్యాపింగే కారణం. నేను బీఆర్‌ఎ్‌సలో ఉన్నపుడే జగదీశ్‌ రెడ్డి నా ఫోన్‌ను ట్యాపింగ్‌ చేయించారు. బీసీ నాయకుల ప్రభావాన్ని అణిచివేయాలనే జగదీశ్‌రెడ్డి ఈ చర్యకు పాల్పడ్డాడు’’ అని జానయ్య ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాపింగ్‌కు గురయ్యాయన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో గెలిచిన జగదీశ్‌ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు. గతంలో బీఎస్పీ చీఫ్‌గా ఉన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌(ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నేత)కు విషయం చెప్పినా.. పట్టించుకోలేదన్నారు. తనపై అక్రమ కేసులు బనాయించి, జగదీశ్‌రెడ్డి ఎన్నికల్లో గెలుపొందారని, ఇలా ట్యాపింగ్‌తో గెలిచిన 30 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి

నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '

తిరుపతి రైల్వే‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 06:00 AM