Share News

Team Sivangi Launched: ప్రజా రక్షణకు ఆడ సింహాలు

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:43 AM

‘టీం సివంగి’ పేరుతో మహిళా కమాండోలు ప్రారంభం అయింది, వీరు సాయుధ శిక్షణ పొందిన తర్వాత ప్రజాసేవలో పాలు పడుతున్నారు.మహిళా కమాండోలు తమ సాహసోపేత కార్యకలాపాలతో ప్రజలను రక్షిస్తున్నారు.

Team Sivangi Launched: ప్రజా రక్షణకు ఆడ సింహాలు

నిర్మల్‌ జిల్లాలో ‘టీం సివంగి’ ప్రారంభం.. సేవలను ప్రారంభించిన మంత్రి సీతక్క

  • రాష్ట్రంలోనే తొలిసారి మహిళా కమాండోలు

  • అన్ని జిల్లాల్లో టీం సివంగి: మంత్రి సీతక్క

  • 8ఎస్పీ జానకి షర్మిలకు అభినందనలు

నిర్మల్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): సాయుధ బలగాల్లోనూ మహిళలు దూసుకుపోతున్నారు. నిత్యం చేతుల్లో ఆయుధాలను ధరించి, ప్రజాభద్రత, వీవీఐపీల భద్రత, అల్లర్ల సమయంలో మూకలను అడ్డుకునే బాధ్యతలు ఏఆర్‌ విభాగం ప్రధాన విధులు. గత దశాబ్దన్నర కాలంగా ఏఆర్‌ విభాగాల్లోనూ మహిళల రిక్రూట్‌మెంట్లు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నియామకాల్లో మహిళలకు 33% కోటాను ప్రకటించాక.. ఏటా కొత్త రిక్రూటీల సంఖ్య పెరుగుతోంది. సివిల్‌ పోలీసు విధుల్లో భాగంగా క్రైమ్‌, లా అండ్‌ ఆర్డర్‌ విధుల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నా.. ఏఆర్‌ విభాగానికి వచ్చేసరికి సెంట్రీ డ్యూటీలు, బందోబస్తులకే పరిమితమవుతున్నారు. దీంతో.. ఏఆర్‌ అంటే అప్రాధాన్య విభాగమనే భావన నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ఏఆర్‌ మహిళా కానిస్టేబుళ్లకు కమాండో శిక్షణనిచ్చి.. వారిని ‘టీం సివంగి’ పేరుతో ఆడ సింహాల్లా తయారు చేశారు. నిర్మల్‌ ఎస్పీ డాక్టర్‌ జానకి షర్మిల. శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క ‘టీం సివంగి’ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఇదివరకే ‘నారీశక్తి’ పేరుతో మహిళా పోలీసులు(సివిల్‌) అన్ని విభాగాల్లో పనిచేసేలా తర్ఫీదునిచ్చిన నిర్మల్‌ జిల్లా.. ఇప్పుడు మరో ముందడుగు వేసిందంటూ మంత్రి అభినందించారు.


45 రోజుల ప్రత్యేక శిక్షణ

ఏఆర్‌ కానిస్టేబుళ్లకు సివిల్‌, స్పెషల్‌ పోలీసు సర్వీసుల మాదిరిగానే ఏడాది శిక్షణ ఉంటుంది. ముఖ్యంగా ఏఆర్‌ విభాగంలో పనిచేసేవారికి షార్ట్‌వెపన్‌తోపాటు.. ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్సాస్‌, ఏకే-47 వంటి ఆయుధాల్లో ప్రత్యేక శిక్షణనిస్తారు. ఇంతటి కఠోర శిక్షణను పూర్తిచేసుకున్నాక కూడా మహిళా ఏఆర్‌ కానిస్టేబుళ్లను సెంట్రీ విధులు, బందోబస్తులకే వినియోగించడం.. వారిలో అసంతృప్తి నెలకొనడం గుర్తించిన జానకి షర్మిల.. కమాండో తరహా శిక్షణకు శ్రీకారం చుట్టారు. పురుషులతో సమానంగా కూంబింగ్‌, రెస్క్యూ ఆపరేషన్లలో వారికి 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. వర్టికల్‌ రోప్‌ క్లైంబింగ్‌, యుద్ధతంత్రాలు, పేలుడు పదార్థాలను గుర్తించి, నిర్వీర్యం చేయడం, నిఘా వంటి అంశాల్లో తర్ఫీదునిచ్చారు. ఒకవిధంగా చెప్పాలంటే.. గ్రేహౌండ్స్‌ స్థాయిలో మహిళా కమాండోలు ప్రత్యేక శిక్షణ పొందారు. ‘‘ఏఆర్‌లో పనిచేసే చాలా మంది మహిళా పోలీసులు రొటీన్‌ డ్యూటీలతో విసిగిపోయి.. ఉన్నత కొలువుల కోసం సన్నద్ధమవుతుండడాన్ని గమనించాను. కొందరు పోటీ పరీక్షలను సాధించి, ఉద్యోగం మారారు. ఇందుకు కారణాలను అన్వేషించాను. ఈ క్రమంలోనే.. పురుషులతో సమాన విధులుంటే వృత్తి పట్ల మరింత ఆసక్తి ఉంటుందని భావించాను. టీం సివంగికి శ్రీకారం చుట్టాను’’ అని జానకి షర్మిల ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. హైదరాబాద్‌లో క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌(క్యూఆర్‌టీ) మాదిరిగా.. నిర్మల్‌ జిల్లాలో ‘టీం సివంగి’ పనిచేస్తుందని ఆమె వివరించారు.


fddsz.jpg

మంత్రి సీతక్క అభినందనలు

వినూత్న ఆలోచనతో ఏర్పాటైన ‘టీం సివంగి’ విన్యాసాలను వీక్షించిన మంత్రి సీతక్క జిల్లా ఎస్పీ జానకి షర్మిలను అభినందించారు. నిర్మల్‌ జిల్లా పోలీసుల స్ఫూర్తితో ‘టీం సివంగి’ని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. ‘‘ఇటీవల తునికాకు సేకరణకు మామడ అడవులకు వెళ్లి, తప్పిపోయిన నలుగురు మహిళలను టీం సివంగి కాపాడింది. అడవుల్లో సాహసోపేతంగా గాలింపు చేపట్టి, వారిని రక్షించింది’’ అని వివరించారు. నిర్మల్‌ జిల్లాలో మహిళా శక్తిని ప్రపంచానికి చాటేలా చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా ఉన్నాయన్నారు.


ఇవి కూడా చదవండి..

Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు..


Read Latest
Telangana News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 04:45 AM