Khammam: వేధింపులతో రైల్వే ఎస్సై భార్య ఆత్మహత్య
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:58 AM
భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో పాటు అదనపు కట్నం కోసం భర్త ఖమ్మం రైల్వే ఎస్సై బానోత్ రాణాప్రతాప్ ఆయన కుటుంబ సభ్యులు వేధించడంతో భార్య బానోత్ రాజేశ్వరి (34) ఆత్మహత్య చేసుకుంది.

ఎస్సైతో పాటు ఆయన తండ్రికి రిమాండ్
జూలూరుపాడు/ఖమ్మం క్రైం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో పాటు అదనపు కట్నం కోసం భర్త ఖమ్మం రైల్వే ఎస్సై బానోత్ రాణాప్రతాప్ ఆయన కుటుంబ సభ్యులు వేధించడంతో భార్య బానోత్ రాజేశ్వరి (34) ఆత్మహత్య చేసుకుంది. కొత్తగూడెం పట్టణానికి చెందిన రాజేశ్వరికి, ఖమ్మం జిల్లా రాములు తండాకు చెందిన ఎస్సై బానోత్ రాణాప్రతా్‌పకు 2018లో వివాహమైంది. వారికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొద్దికాలం తర్వాత రాజేశ్వరికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ భర్త రాణాప్రతాప్, అత్తమామలు పుష్పరాణి, చంద్రంతో పాటు బావ మహబూబాబాద్ వీఆర్ ఎస్సై బానోత్ మహేశ్ వేధించడం ప్రారంభించారు.
తాము చెప్పినట్లు వినకుంటే చచ్చిపోమని బెదిరించేవారు. వారి వేధింపులు భరించలేక రాజేశ్వరి ఈ నెల 25న జూలూరుపాడులో పురుగు మందు తాగి.. పుట్టింటి వారికి సమాచారమిచ్చింది. వారు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆమె తండ్రి కేళోత్ సోమ్లా ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్సైని, ఆయన తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు జూలూరుపాడు ఎస్సై రవి తెలిపారు.