Maoist Party Leadership: కొత్త దళపతి ఎవరు
ABN , Publish Date - May 22 , 2025 | 05:42 AM
సీపీఐ మావోయిస్టుల కొత్త ప్రధాన కార్యదర్శి ఎవరు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వేణుగోపాల్, రాజన్‌లలో ఒకరు లేదా గణపతికే మళ్లీ బాధ్యతలు ఇవ్వవచ్చని చర్చ సాగుతోంది.

వేణుగోపాల్, రాజన్‌లలో ఒకరికి చాన్సు
ప్రజాసంఘాల నేతల మనోగతం
మళ్లీ గణపతికే ఇవ్వొచ్చంటున్న ఇంకో వర్గం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (బస్వరాజ్, బీఆర్) ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో తదుపరి సారథి ఎవరన్న ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. కేంద్ర కమిటీలోని 17 మంది సభ్యుల్లో ఎవరు దళిపతి కానున్నారు..? బెంగాల్‌కు చెందిన రాజనా..? లేక తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాల్‌కు అవకాశం దక్కుతుందా అన్న చర్చ జరుగుతోంది. వేణుగోపాల్ ప్రస్తుతం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. దండకారణ్యంలో కీలక బాధ్యతలు చూస్తున్నారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగానూ వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరిలోనే ఒకరికి అగ్ర పదవి లభించే అవకాశం ఉందని ప్రజాసంఘాల నేతలు చెబుతున్నారు. తిప్పిరి తిరుపతి, బాలకృష్ణ వంటి నేతలు కూడా కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. అయితే తాజా పరిస్థితుల్లో మాజీ దళపతి గణపతికే పార్టీ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉందని ఓ వర్గం నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రం బాధ్యతల్లో ఉన్నారు. 70 ఏళ్ల వయస్కుడైన ఆయనకు క్లిష్ట సమయంలో మరోసారి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది. 2004లో సీపీఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటుకు ముందు గణపతి పీపుల్స్‌వార్‌కు కేంద్ర కమిటీ కార్యదర్శిగా 15 ఏళ్లపాటు పనిచేశారు. పీపుల్స్‌వార్-ఎంసీసీ విలీనమై మావోయిస్టు పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2004 నుంచి 2018 వరకు ఆయన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
ఆ సమయంలో బస్వరాజ్ మిలిటరీ కమిషన్ చీఫ్‌గా ఉన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో గణపతి బాధ్యతలు వదులుకోవడంతో 2018లో బస్వరాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జిగానూ ఆయనే ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లో ఆయన మరణించడంతో రెండు పదవులు ఖాళీ అయినట్లయింది. అసలే ఆ పార్టీ తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఎప్పుడు, ఎవరు పారామిలిటరీ డ్రోన్ కెమెరాలకు చిక్కుతారు.. ఎవరు, ఎప్పుడు ఎన్‌కౌంటర్లో మరణించారన్న వార్త వస్తుంది అన్న భయం పార్టీతోపాటు ప్రజాసంఘాల్లోనూ నెలకొంది. ఈ నేపఽథ్యంలో అగ్ర పదవిని అనుభవజ్ఞుడైన గణపతికే తిరిగి కట్టబెడతారా.. లేక కొత్తగా మరొకరిని ఎంపిక చేస్తారా అన్నది త్వరలో తేలనుంది.