Sim Cards Misuse: సిమ్ ఒకరిది.. సోకు ఒకరిది...
ABN , Publish Date - Jul 18 , 2025 | 09:43 AM
Sim Cards Misuse: గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సిమ్ కార్డులను తమ వ్యక్తిగతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

వరంగల్ కార్పొరేషన్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ వరంగల్ (Warangal) నగర పాలక సంస్థ (GWMC) ఉద్యోగుల సౌకర్యార్థం జారీ చేసిన సిమ్ కార్డులు (Sim Cards) దుర్వినియోగం అవుతున్నాయా? అంటే ఔననే అనిపిస్తోంది. ఇక్కడ పనిచేసి సంవత్సరం క్రితం ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులతో పాటు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాల మునిసిపల్ కార్పొరేషన్లకు బదిలీపై వెళ్లిన ఉద్యోగులు సైతం నగర పాలక సంస్థ జారీ చేసిన సిమ్ కార్డులు వాడుతున్నారు. కొందరు సిమ్లను వ్యక్తిగత పనుల కోసం వాడుతుండగా.. మరి కొందరు చీకటి పనులకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. కాగా, దుర్వినియోగం అవుతున్న బల్దియా సిమ్లపై మేయర్, కమిషనర్ తో పాటు సంబంధిత పరిపాలనా విభాగం, ఐటీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల బల్దియా ఆదాయానికి గండి పడుతోంది. ఫిలితంగా నెలకు రూ. 5 లక్షల వరకు అదనంగా ప్రైవేటు సంస్థకు రీచార్జీల పేరుతో చెల్లించాల్సి వస్తుందని ఉద్యోగులు మండిపడుతున్నారు.
326 సిమ్ కార్డుల జారీ..
మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బందికి నగర ప్రజలకు మధ్య పాలనపరమైన సమస్యలు, కాలనీలలో ఎదురయ్యే ఇబ్బందులపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సిమ్ కార్డులు అందించింది. 2012లో ఎయిర్టెల్ సంస్థ టెండరు ద్వారా నెట్వర్క్ దక్కించుకుని కమిషనర్ నుంచి కింద స్థాయి ఉద్యోగితో పాటు 66 మంది కార్పొరేటర్లకు 97019, 99600 సిరీస్ లలో సిమ్లు జారీ చేసింది. మొత్తంగా 326 సిమ్లు ఇప్పటివరకు నిరంతరంగా పనిచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఐతే గ్రేటర్ అధికారులు, కార్పొరేటర్లు వారి వద్ద ఉన్న పర్సనల్ ఫోన్ నెంబర్ తో పాటు జీడబ్ల్యూఎంసీ జారీ చేసిన మరో సిమ్ కార్డును వాడుతున్నారు. ఈ సిమ్ లకు కావలసిన రీచార్జ్లను నెల నెల క్రమం తప్ప కుండా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ నుంచి డబ్బులు చెల్లిస్తారు. అధికారుల స్థాయిని బట్టి ప్యాకేజీలు రూపొందించి బల్దియా బడ్జెట్ ను అప్పనంగా అప్పగిస్తున్నారు. రూ.300కు నెల మొత్తంగా టాక్ టైంతో పాటు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ అందించే ఈ రోజుల్లో బల్దియా సిమ్ కార్డులకు కొందరికి ఒక్కరికి నెలకు రూ.1000, 2500 ఇలా రీచార్జీ చెల్లించడం ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి..
హంద్రీ - నీవా కాల్వలకు నీరు విడుదల
జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఫైర్