Regonda Panchayat Polls: ఊళ్లో కోతులను తరిమాకే ఓట్లగండి.. రేగొండ ప్రజల బహిరంగ పోస్టర్
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:31 PM
తెలంగాణాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రోజుకో రీతిలో ఎత్తుగడలు వేస్తూ సర్పంచ్ అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. భూపాలపల్లి జిల్లాలో వెలసిన ఓ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమిటా పోస్టర్? అందులో ఏముందంటే.?
భూపాలపల్లి జిల్లా, డిసెంబర్ 03: సాధారణంగా సర్పంచ్ అభ్యర్థులు ఓట్లు అడగడానికి వస్తే.. ఎవరైనా తమ ఊరిని అభివృద్ధి చేయాలని అడుగుతారు. విద్యుత్, నీటి కొరత వంటి సమస్యలను పరిష్కారం చేయాలని కోరతారు. అయితే.. రేగొండ మండల ప్రజలు మాత్రం ఓ విచిత్ర కోరిక కోరారు. ఆ ఊర్లో వానరాల బెడద అధికమవడంతో.. ఫస్ట్ వాటిని తరిమేయాలని సర్పంచ్ అభ్యర్థులను వేడుకుంటున్నారు. కోతులను ఊరి నుంచి దాటించాకే ఓట్ల ప్రచారం కోసం రండి.. లేదంటే ఓట్లు అడగవద్దని బహిరంగంగా పోస్టర్ కూడా వేశారు. ఆ పోస్టర్లో ఇంకా ఏముందంటే...
'మా ఓటును అమ్మేది లేదు.. కోతులను తరిమి ఓట్లు అడిగేందుకు రండి. ప్రలోభాలకు లొంగి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయొద్దు. వజ్రాయుధం లాంటి ఓటుతో గ్రామీణాభివృద్ధికి బాటలు వేద్దాం. ఊరంతా వానరాల దాడుల్లో గాయాలైన బాధితులే. పత్తి, వరి, మిరప పంటలు.. కోతుల చేష్టలతో ఇంటికి చేరడం లేదు. రేగొండ మండల కేంద్రమైన మా గ్రామంలో పెద్ద సార్లు, పెద్ద పెద్ద లీడర్లు తిరుగుతున్నా.. మా గోడును పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. ఎన్నికల వేళ మా ఇల్లు తొక్కే నాయకుల్లారా.. కోతులను తరిమి ఎన్నికకు ముందే అభివృద్ధికి శ్రీకారం చుట్టి.. మీ చిత్తశుద్ధిని చాటుకోండి.' అని స్థానిక ఇన్‌స్పైర్ యూత్ అసోసియేషన్ తరఫున ఓ పోస్టర్‌లో రాసిపెట్టి అందరికీ కనిపించేలా వీధిలో గోడకు అతికించారు.
రేగొండలో గోడకు అతికించిన పోస్టర్
ప్రస్తుతం.. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని బట్టి ఆ ఊరి ప్రజలు కోతుల ద్వారా ఎంతగా ఇబ్బందులకు గురవుతున్నారో అర్థమవుతోందని నెట్టింట చర్చించుకుంటున్నారు. వారి న్యాయబద్ధమైన కోరికను నెరవేర్చి సర్పంచ్ అభ్యర్థులు చిత్తశుద్ధి చాటుకోవాలని పలువురు కోరుతున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడతకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. 193 మండలాల్లోని 4,332 గ్రామ పంచాయతీలు; 38,342 వార్డులకు సంబంధించిన నామినేషన్లను స్వీకరించారు. రెండో విడత నామినేషన్లను బుధవారం పరిశీలిస్తారు. డిసెంబర్ 6న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు పోటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈనెల 14న జరగనున్నాయి. ఆరోజు మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇవీ చదవండి: