Mahabubabad Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. బ్రతికుండగానే మార్చురీలో..
ABN , Publish Date - Oct 30 , 2025 | 06:11 PM
ఆధార్ కార్డు లేకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయరా? మరీ ఇంత దారుణమా? రెండు రోజులు ఆస్పత్రి ఆవరణలోనే పడిగాపులుకాసినా..
మహబూబాబాద్: ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య ఘటనపై ప్రజలు మండిపడుతున్నారు. అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని.. ఆధార్ కార్డు లేదనే నెపంతో సిబ్బంది ఆసుపత్రిలో చేర్చుకోకపోవడం అమానుషంగా మారింది. అతడి ఆరోగ్య పరిస్థితి ఏంటని, ఆ సిబ్బంది కనీసం కనికరించి చికిత్స చేయడానికి కూడా ముందుకు రాలేదు. ఆస్పత్రి ఆవరణలోనే బాధితుడు రెండు రోజులు పడిగాపులుకాసినా పట్టించుకోలేదు. అయితే, అతడు ఏ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉండటంతో, అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఏంటి అని ఏ మాత్రం తెలుసుకోకుండా మృతి చెందాడనే అనుమానంతో అతడి బాడీని మార్చురీకి పంపించారు.
అయితే, ఉదయం మార్చురీ గదిని శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్లు రోగి కదలికలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆస్పత్రిలో చేర్పించి అతడికి చికిత్స చేయిస్తున్నారు. రోగి చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రవిగా అధికారులు గుర్తించారు. అయితే, ఈ ఘటన వెలుగులోకి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఆసుపత్రిలో చికిత్స చేయరా? మరి అలాంటప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి అని పేరు పెట్టడం ఎందుకు? అని విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై స్పందించాలని, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డైవర్షన్ కోసమే వైసీపీ కుట్ర: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
టెక్నాలజీ సాయంతో తుపాన్ నష్టాన్ని తగ్గించాం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News