KCR In Elkathurthy Meeting: తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ
ABN , Publish Date - Apr 27 , 2025 | 09:10 PM
KCR In Elkathurthy Meeting: ఎల్కతుర్తి వేదికగా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి రావడం కోసం ఎన్నో హామీలు ఇచ్చిన ఆ పార్టీ.. అధికారం అందుకోగానే.. వాటిని గాలికి వదిలేసిందంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరంగల్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆనాడు కాంగ్రెస్ వాళ్లు పదవులు కోసం నాటకాలాడారని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చి ఏడాదైంది.. మాయరోగం వచ్చినట్లయిందని వ్యంగ్యంగా అన్నారు. గోల్‌మాల్ చేయడంలో కాంగ్రెస్‌ను మించినోడు లేడని తెలిపారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినోడు లేడని పేర్కొన్నారు. ఉన్న గాంధీలు.. లేని గాంధీలు.. డూప్లికేటు గాంధీలు వచ్చి హామీలు ఇచ్చారని ఎద్దేవా చేశారు.
పెన్షన్లు ఇద్దరికి ఇస్తామని హామీ ఇచ్చి ఏం చేశారు?.. దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామన్నారు.. ఇచ్చారా?.. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు.. ఇచ్చారా?.. విద్యార్థులకు రూ.5 లక్షల గ్యారెంటీ కార్డు ఇస్తామన్నారు.. ఇచ్చారా?.. ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్నారు.. ఇచ్చారా?.. 420 అబద్ధపు హామీలు ఇచ్చారు.. కల్యాణలక్ష్మి రూ.లక్ష సహా తులం బంగారం ఇస్తామన్నారు.. ఇచ్చారా? సిగ్గు లేకుండా ప్రజలకు బాండ్ పేపర్ రాసి ఇచ్చారన్నారు. తెలంగాణలోని అన్ని దేవుళ్లపై ఒట్టు వేశారు.. ఏమైనా చేశారా?..మహిళలకు ఉచిత బస్సు.. జుట్లు పట్టుకుని కొట్టుకునేందుకు పని కొచ్చిందంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేసీఆర్ తనదైన ప్రశ్నలను సంధించారు. బీఆర్ఎస్‌పై అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతూ.. చేయాల్సిన పనులు చేయట్లేదని ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు బోల్తా పడ్డారన్నారు.
బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆనాడు తెలంగాణ పదం ఎత్తకుండా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేశామని చెప్పారు. తెలంగాణ ఇవ్వకుండా 14 ఏళ్ల పాటు వేధించారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేందుకు కేంద్రమంత్రి పదవికి సైతం తాను రాజీనామా చేశానని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో మంత్రి పదవులకు సైతం రాజీనామాలు చేశామన్నారు. దేశంలో ఉన్న అనేక పార్టీలను సైతం కూడగట్టామని తెలిపారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ గొంతు పట్టుకున్నామని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ దిగి వచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత.. రాష్ట్రాన్ని బాగు చేసేందుకు నడుం బిగించామని.. అందులోభాగం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కొత్తగా కట్టుకున్నామని.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలు సైతం చేపట్టామని వివరించారు. రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నామని గుర్తు చేశారు. దేశంలోనే ఎక్కడా లేని రైతుబంధు అమలు చేశామన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ రాదన్నారు.. కానీ ప్రత్యేక రాష్ట్రంలో అద్భుతంగా ఉచిత కరెంట్ అందించామని కేసీఆర్ పేర్కొన్నారు.
అద్భుతమైన తెలంగాణను నిర్మించుకుంటూ వచ్చామని.. తెలంగాణ రాక ముందు రైతులను పట్టించుకునే నాథుడే లేడన్నారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతుల దగ్గర ధాన్యం సేకరించామని చెప్పారు. ఎవరు అడగకపోయినా తెలంగాణ చెరువుల్లో చేపలు పెంచామన్నారు. లక్షలాది గొర్రెలు పంపిణీ చేశామని చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా పారిశ్రామిక రంగం అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు. ఐటీ రంగంలో 7 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయని.. అలాగే రాష్ట్రంలో తెలంగాణలో 3 నుంచి 33 మెడికల్ కాలేజీకు పెంచామని వివరించారు. ఇాలా బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు.
ఈ బహిరంగ సభలో పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఘనంగా నివాళులు ఆర్పించింది. కశ్మీర్‌లో ముష్కరులు మన దేశ ప్రజలపై దాడి చేశారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడిలో అమాయకులు చనిపోయారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News