Share News

Gadwal: ఇథనాల్‌ కర్మాగారంపై జనాగ్రహం

ABN , Publish Date - Jun 05 , 2025 | 03:01 AM

ఇథనాల్‌ కర్మాగారాన్ని నిర్మించవద్దంటూ సమీప గ్రామాల ప్రజలు దీక్షకు దిగడంతో నాయకులు, అధికారులు దాన్ని రద్దు చేస్తామని చెప్పి వారితో దీక్ష విరమింపజేశారు.

Gadwal: ఇథనాల్‌ కర్మాగారంపై జనాగ్రహం

  • పనుల పునఃప్రారంభంతో 3 గ్రామాల ప్రజల మూకుమ్మడి దాడి

  • కంపెనీ సిబ్బందితో వాగ్వాదానికి దిగి తరిమికొట్టిన నిరసనకారులు

  • ఒక గుడారం, కంటైనర్‌కు నిప్పు

  • ఓ యంత్రం, జీపు ధ్వంసం

  • గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఘటన

రాజోలి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఇథనాల్‌ కర్మాగారాన్ని నిర్మించవద్దంటూ సమీప గ్రామాల ప్రజలు దీక్షకు దిగడంతో నాయకులు, అధికారులు దాన్ని రద్దు చేస్తామని చెప్పి వారితో దీక్ష విరమింపజేశారు. తాజాగా మళ్లీ కర్మాగార నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రయత్నించడంతో స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. మాట తప్పి, మళ్లీ ఇథనాల్‌ కర్మాగార నిర్మాణాన్ని చేపడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్ని నిలిపివేయాలంటూ అక్కడున్న సిబ్బందిని హెచ్చరించారు. వారి నివాస స్థావరాలకు నిప్పంటించారు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడలో చోటుచేసుకుంది. గ్రామ శివారులో నిర్మిస్తున్న గాయత్రి రెన్యువబుల్‌ ఫ్యూయల్‌, ఆలివ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 10 నెలల క్రితం చేపట్టిన ఇథనాల్‌ కర్మాగార నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ సమీప గ్రామాల ప్రజలు గతంలోనే ఆందోళనకు దిగారు. కర్మాగారాన్ని రద్దు చేయాలని వినతి పత్రాలు అందజేశారు. తుంగభద్ర నది సమీపంలో ఈ కర్మాగారాన్ని నిర్మించడం వల్ల తాగునీరు కలుషితమవుతుందని, పంటలు, ప్రజల ఆరోగ్యం నాశనం అవుతాయని తెలిపారు.


కర్మాగారం నిర్మాణ స్థలంలో దీక్షలు చేపట్టి, పనులను నిలిపివేశారు. అధికారులు, నాయకులు ఆ ఫ్యాక్టరీని రద్దు చేస్తామని చెప్పి, వారి దీక్షను విరమింపజేశారు. తాజాగా మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సామగ్రి, సిబ్బంది రావడంతో మంగళవారం రహదారిపై ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, నసనూర్‌ గ్రామాల ప్రజలు దాదాపు 1000 మంది అక్కడికి చేరుకున్నారు. కర్మాగార పనులు చేపట్టిన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం సిబ్బందిని అక్కడి నుంచి తరిమికొట్టారు. వారి గుడారాలను, కంటైనర్‌ను ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. అక్కడే ఉన్న యంత్రం, వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. జీపును బోల్తా పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పెద్ద ధన్వాడకు చెందిన క్యాసార ం కృష్ణ, మరియమ్మకు గాయాలయ్యాయి. వారిని గద్వాల ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం కంపెనీకి చెందిన సామగ్రి, వాహనాలను అక్కడి నుంచి పంపించివేశారు.


ఇవీ చదవండి:

రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 03:01 AM