Share News

Venkaiah Naidu: ‘హింస’ డైలాగ్‌లను నేతలు సమర్థించడం విచారకరం

ABN , Publish Date - Jul 07 , 2025 | 01:40 AM

హింసను ప్రోత్సహించే కొన్ని సినిమా డైలాగులను బాహాటంగానే కార్యకర్తలు చెబుతుండడం, కొందరు నాయకులు వారిని సమర్థిస్తుండడం విచారకరమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

Venkaiah Naidu: ‘హింస’ డైలాగ్‌లను నేతలు సమర్థించడం విచారకరం

  • నాయకులు ఎలా ఉన్నారో ప్రజలే గమనించాలి

  • పుస్తక ఆవిష్కరణలో వెంకయ్య నాయుడు

హైదరాబాద్‌ సిటీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): హింసను ప్రోత్సహించే కొన్ని సినిమా డైలాగులను బాహాటంగానే కార్యకర్తలు చెబుతుండడం, కొందరు నాయకులు వారిని సమర్థిస్తుండడం విచారకరమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. నాయకులు ఎలా ఉన్నారో ప్రజలు గమనించాలని, ఎలాంటి వారి వెంట తిరుగుతున్నామో కార్యకర్తలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవుపలికారు. ఆదివారం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ‘నిరుపమాన దేశభక్తులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి’ పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యోద్యమం కోసం తమ యావదాస్తిని, జీవితాలను అంకితం చేసిన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులు మహనీయులని కొనియాడారు.


ఆ దంపతుల జీవితం ఆదర్శనీయమని.. వారి జీవితాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత రాజకీయాలు సాగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. నాయకత్వమంటే అధికారం, అజమాయిషీ చలాయించడం కాదని.. బాధ్యతతో వ్యవహరించడమని చెప్పారు. నాయకుడికి క్యారెక్టర్‌ (గుణం), కెపాసిటీ (సామర్థ్యం), క్యాలిబర్‌ (యోగ్యత), కాండక్ట్‌ (నడత) అనే నాలుగు ‘సీ’లతో కూడిన ఉత్తమ లక్షణాలు ఉండాలని హితవు పలికారు. క్యాష్‌ (డబ్బు), కమ్యూనిటీ (వర్గం), క్యాస్ట్‌ (కులం), క్రిమినాలిటి (నేరచరిత్ర) అనే నాలుగు ‘సీ’లను కలిగిన వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమంలో పుస్తక రచయితలు గాదం గోపాలస్వామి, తిప్పిరిశెట్టి వెంకట రంగనాయకులుతో పాటు పసలకృష్ణమూర్తి మనుమరాలు వీణ, ఏపీ ఎమ్మెల్సీ మండలి బుద్ధప్రసాద్‌, ఐఏఎస్‌ రాజమౌళి పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 01:40 AM