Share News

Uttam Kumar Reddy: గోదావరిలో మిగులు జలాల్లేవు

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:26 AM

గోదావరిలో మిగులు/వరద జలాలు లేవని.. ఒకవేళ ఉంటే గనక ఆ నీటిపై నదిని పంచుకునే అన్ని రాష్ట్రాలకు సమానవాటా ఉంటుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

Uttam Kumar Reddy: గోదావరిలో మిగులు జలాల్లేవు

  • ఉంటే అన్ని రాష్ట్రాలకు సమాన వాటా

  • సముద్రంలోకి వెళ్లే నీళ్లన్నీ తమవే అనుకుంటే ఎలా?: ఉత్తమ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): గోదావరిలో మిగులు/వరద జలాలు లేవని.. ఒకవేళ ఉంటే గనక ఆ నీటిపై నదిని పంచుకునే అన్ని రాష్ట్రాలకు సమానవాటా ఉంటుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. సముద్రంలోకి వృఽధాగా వెళ్లే వరద జలాలనే తాము బనకచర్ల కోసం వాడుకుంటామని, అందులో తప్పేముంది? అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్‌ తప్పుబట్టారు. సముద్రంలోకి వెళ్లే నీళ్లన్నీ తమవే అనుకోవడం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 1980లో గోదావరి ట్రైబ్యునల్‌ నీటి కేటాయింపులు చేసిందని, ఆ ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా పోలవరం విస్తరణను ఏపీ ప్రతిపాదిస్తోందని ఆక్షేపించారు. పోలవరం-బనకచర్ల లింక్‌కు వ్యతిరేకంగా నిర్మాణాత్మక పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్లపై చట్టపరంగానే ముందుకెళతామని కేంద్ర జలశక్తి శాఖ సమాచారం ఇచ్చిందన్నారు. ఇప్పటికే కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ), గోదావరి/కృష్ణా నది యాజమాన్య బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లు తిరస్కరించాయని తెలిపారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో మీడియాతో ఉత్తమ్‌ ఇష్టాగోష్టిగా మాట్లాడారు.


గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయని, అయితే నికర జలాలపై కట్టుకునే ప్రాజెక్టులపైనే ఏపీ అభ్యంతరాలు చెబుతూ.. వరద జలాలపై ప్రాజెక్టులు కట్టుకుంటామని అంటోందని.. ఇదేం తీరు? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా తొలి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో గోదావరిలో 3 వేల టీఎంసీల నీళ్లు ఏటా సముద్రంలో కలుస్తున్నాయని ప్రస్తావించిందని.. ఆ నీటిని వినియోగించుకోవడానికి ప్రణాళికలు చేసుకోవాలని తెరమీదికి తెచ్చిందే ఆ పార్టీ అని ఆక్షేపించారు. రాయలసీమకు నీళ్లిచ్చి.. రతనాల సీమను చేస్తామని ప్రకటించింది ఎవరు? అని నిలదీశారు. గోదావరి నదిపై తుమ్మిడిహెట్టి, ఇచ్చంపల్లి, సమ్మక్కసాగర్‌ అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం తెలంగాణకు సహకారం అందించాలన్నారు. గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలని, ఆ ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల నీటితో పనులు చేసుకునేలా కేంద్రం సహాయం అందించాలని కోరారు. కాగా నీటిపారుదల శాఖలో 30 ఏళ్లలో తొలిసారి శాశ్వత ప్రాతిపదికన ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించామని మంత్రి ఉత్తమ్‌ ప్రకటించారు. ఏఈఈ నుంచి ఈఎన్‌సీ దాకా తానే చొరవ తీసుకొని ప్రమోషన్లు ఇచ్చామన్నారు.


ఎన్‌వోసీ కోసం ఛత్తీగఢ్‌కు..

సమ్మక్కసాగర్‌ బ్యారేజీకి ఎన్‌వోసీ ఇవ్వాలంటూ ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వాన్ని మంత్రి ఉత్తమ్‌ కోరారు. శనివారం ప్రాజెక్టుపై చర్చ జరుగుతున్న క్రమంలో ఆ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి కేదార్‌ నాథ్‌ కశ్యప్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. సమ్మక్కసాగర్‌ వల్ల నీటి ముంపుపై ఐఐటీ-ఖరగ్‌పూర్‌ నివేదిక వచ్చినందున తక్షణ మే ముంపు ప్రాంతాల పరిహారంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 04:26 AM