Share News

Uttam Kumar Reddy: నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:56 AM

కేసీఆర్‌.. నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు.. పదేళ్ల మీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాళా తీయించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేశారు.

Uttam Kumar Reddy: నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు

తెలంగాణను అప్పులపాలు చేసింది మీరే.. మీ పాలనలోనే కాళేశ్వరం.. కూలేశ్వరమైంది

  • కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ ధ్వజం

  • సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేదా ?

  • అది నోరా... మోరీనా: మంత్రి కోమటిరెడ్డి

  • మా పథకాలను చూసి దుఃఖం వస్తోందా?

  • కేసీఆర్‌పై పొంగులేటి వ్యంగాస్త్రాలు

  • వంద మంది కేసీఆర్‌లున్నా రాష్ట్రం వచ్చేది కాదు: పొన్నం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ‘‘కేసీఆర్‌.. నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు.. పదేళ్ల మీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాళా తీయించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేశారు. ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులతో మీరు కట్టిన కాళేశ్వరం... మీ హయాంలోనే కూలేశ్వరమైంది. అవినీతి, కమీషన్ల కక్కుర్తి, అసమర్ధతే కాళేశ్వరం కూలడానికి కారణమనడంలో సందేహం లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. పెద్దపెద్ద మాటలు మాట్లాడటం విడ్డూరం’’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రూ.1.81లక్షల కోట్లను నీటిపారుదలపై ఖర్చు చేసి ఒక్క ఎకరాకూ నీరివ్వలేదని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల నీటి కేటాయింపులుంటే.. విభజన తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ సంతకం చేసింది కేసీఆరేనని దుయ్యబట్టారు.


తాము అధికారంలోకి వచ్చాక ఈ ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించామని తెలిపారు. పేదలకు ఉపయోగపడాలనే సంకల్పంతో రాష్ట్రంలో 3 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. నాలుగేళ్లలో రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. సోనియాగాంధీయే లేకపోతే తెలంగాణ ఏర్పాటయ్యేదా? కేసీఆర్‌ నీది నోరా... డ్రైనేజీ మోరీనా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. 14 మంది కుటుంబ సభ్యులతో సహా ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ కాళ్లు మొక్కింది మర్చిపోయి.. కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణకు విలన్‌ అని మాట్లాడడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తాను, ఉత్తమ్‌, రాజగోపాల్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి తలుచుకుంటే వారంలోనే వరంగల్‌ కంటే నాలుగు రెట్ల పెద్ద సభను నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ నేతల కడుపు మండుతోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం బీఆర్‌ఎస్‌ మాత్రమే ఉద్యమం చేయలేదని, సకల జనులతోపాటు కాంగ్రెస్‌ ఎంపీలుగా తామూ ముందుండి పోరాడామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారికి కనీసం కేసీఆర్‌ వద్ద మాట్లాడే సత్తా కూడా లేదని దుయ్యబట్టారు. మంత్రులు ఉత్తమ్‌, వెంకట్‌రెడ్డి...సీఎం స్థాయి వ్యక్తులని, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.


చింతమడకలో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం

‘కేసీఆర్‌ సొంత గ్రామమైన చింతమడకలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఉన్న ఇళ్లను పడగొట్టింది. ఇప్పుడు ఆ గ్రామంలో మొండిగోడలు మిగిలాయి. వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం’ అని మంతి పొంగులేని శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా శాఖారంలో మంత్రి మాట్లాడారు. తమ పాలనలో భూ సమస్యల పరిష్కారం కోసం తెచ్చిన భూ భారతి చట్టం, పేదలకు సన్న బియ్యం పంపిణీ, 200యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, మహిళలకు ఉచిత బస్సు పథకం, పేదలకు రూ.10లక్షల దాకా ఆరోగ్యశ్రీ... ఇవన్నీ చూసి కేసీఆర్‌కు దుఃఖం వస్తున్నట్టుందని ఎద్దేవా చేశారు. వంద మంది కేసీఆర్‌లు వచ్చినా తెలంగాణ వచ్చేది కాదని, సోనియాగాంధీ దయాగుణం వల్లే అది సాధ్యమైందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.


హనుమకొండ జిల్లాలోని ముల్కనూర్‌లో సోనియాగాంధీ చిత్రపటానికి మంత్రి పొన్నం క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్సే విలన్‌ అనే మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పాలమూరు ప్రాజెక్టు 80శాతం పూర్తయిందని కేసీఆర్‌ ప్రగల్భాలు పలికారని, కనీసం 20శాతం పూర్తయిందని నిరూపించినా.. తన పదవికి రాజీనామా చేస్తానని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అబద్ధాల కోరు, నియంత.. కేసీఆర్‌ అని దుయ్యబట్టారు.


ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 29 , 2025 | 04:56 AM