Share News

Sand Mining: ఇసుక తవ్వకాలపై నిఘా కరవు

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:37 AM

ఇసుక తవ్వకాలపై అధికారుల పర్యవేక్షణ కరవైంది. అనుమతులు ఇచ్చేటప్పుడు చూపించే శ్రద్ధ ఆ తర్వాత ఉండడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఇసుక రీచ్‌లలో నిర్ణీత లోతుకు మించి తవ్వకాలు జరపడంతో వాటిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి.

Sand Mining: ఇసుక తవ్వకాలపై నిఘా కరవు

  • తరిగిపోతున్న భూగర్భ జలాలు

  • పట్టించుకోని భూగర్భ జల వనరుల శాఖ

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : ఇసుక తవ్వకాలపై అధికారుల పర్యవేక్షణ కరవైంది. అనుమతులు ఇచ్చేటప్పుడు చూపించే శ్రద్ధ ఆ తర్వాత ఉండడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఇసుక రీచ్‌లలో నిర్ణీత లోతుకు మించి తవ్వకాలు జరపడంతో వాటిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు తరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తన ముందుకు వచ్చిన ఓ ఫిర్యాదు ఆధారంగా ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంలోనే కాకుండా తవ్వకాలు అయ్యాక పరిశీలించడం పైనా దృష్టి సారించాలని భూగర్భ జల వనరుల శాఖ, గనుల శాఖలకు సమాచార హక్కు కమిషనర్‌ పీవీ శ్రీనివాస్‌ సోమవారం సలహా ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక రీచ్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయి. వాటిలో ఎన్ని మీటర్ల లోతు వరకు ఇసుక ఉంది.. అక్కడ భూగర్భ జలాలకు ఇబ్బందులు కలగకుండా ఎన్ని మీటర్ల లోతు వరకు తవ్వుకోవచ్చు.. అన్నది నిర్ణయించేందుకు వాల్టా చట్టం నిబంధనల ప్రకారం భూగర్భ జల వనరుల శాఖ, గనుల శాఖలు సంయుక్తంగా సర్వే జరుపుతున్నాయి.


ఆ సర్వే ఆధారంగానే ఇసుక తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తారు. అనుమతులు ఇచ్చిన తర్వాత ఇసుక క్వారీలను పరిశీలించే బాధ్యత కేవలం గనుల శాఖదేనని.. జల వనరుల శాఖ ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటుంది. భూగర్భ జలాల విషయంలో గనుల శాఖ అధికారులకు సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఎంత లోతు తవ్వినా.. భూగర్భ జలాలకు నష్టం కలుగుతున్నా పట్టించుకునేవారే లేకపోయారు. దీంతో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. కొన్నిచోట్ల తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇసుక తవ్వకాల వల్ల తమ ప్రాంతాల్లో భూగర్భజలాలు పడిపోయాయని సమాచార హక్కు చట్టం కమిషనర్‌కు ఫిర్యాదులు కూడా అందాయి.

Updated Date - Jun 24 , 2025 | 03:37 AM