Share News

Vikarabad: సర్పన్‌పల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:17 AM

ఎలాంటి అనుమతులు లేకుండా, లైఫ్‌ జాకెట్లు వంటి కనీస భద్రతా చర్యలు పాటించకుండా ఓ రిసార్ట్‌ నిర్వాహకులు చేపట్టిన బోటు షికారు రెండు ప్రాణాలను బలి తీసుకుంది.

Vikarabad: సర్పన్‌పల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా

  • నీట మునిగి ఇద్దరు మహిళల మృతి

  • ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు చిన్నారులు

  • వారిని కాపాడేందుకు నీళ్లలోకి దిగిన వ్యక్తి పరిస్థితి విషమం

  • అంతా బిహార్‌కు చెందిన పర్యాటకులు

  • వికారాబాద్‌లోని ది వైల్డర్‌నెస్‌ రిసార్ట్స్‌లో ఘటన

  • అనుమతులు, భద్రతా చర్యలు లేకుండా బోటింగ్‌

వికారాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి అనుమతులు లేకుండా, లైఫ్‌ జాకెట్లు వంటి కనీస భద్రతా చర్యలు పాటించకుండా ఓ రిసార్ట్‌ నిర్వాహకులు చేపట్టిన బోటు షికారు రెండు ప్రాణాలను బలి తీసుకుంది. కళ్ల ముందే అయిన వారిని కోల్పోయిన నాలుగు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. వికారాబాద్‌లోని సర్పన్‌పల్లి ప్రాజెక్టులో శనివారం సాయంత్రం పడవ బోల్తా పడిన ఘటనలో బిహార్‌కు చెందిన రీతాకుమారి(55), పూనమ్‌సింగ్‌(53) అనే మహిళలు మరణించారు. ఆ మహిళలు, ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు నీళ్లలోకి దిగిన అలోక్‌కుమార్‌ అనే వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వికారాబాద్‌ మండలం గోధుమగూడ సమీపంలోని ది వైల్డర్‌నెస్‌ రిసార్ట్స్‌లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నారు. బిహార్‌లోని పట్నాకు చెందిన విజయ్‌-రీతాకుమారి దంపతులు, అజిత్‌ కుమార్‌- పూనమ్‌ సింగ్‌ దంపతులు హైదరాబాద్‌, మియాపూర్‌లో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వచ్చారు. బిహార్‌ నుంచి వచ్చిన వారు సహా నాలుగు కుటుంబాల వారు పర్యాటక ప్రదేశమైన అనంతగిరి సందర్శనకు వచ్చి నైట్‌ క్యాంపింగ్‌ కోసం శనివారం మధ్యాహ్నం వైల్డర్‌నెస్‌ రిసార్ట్స్‌కు వచ్చారు.


అయితే, రీతాకుమారి, పూనమ్‌సింగ్‌, తమ బృందంలోని ఇద్దరు చిన్నారులు రిసార్ట్స్‌లో ఉన్న సర్పన్‌పల్లి చెరువులో బోటు షికారుకు వెళ్లారు. అలోక్‌ కుమార్‌ సహా ఆ బృందంలోని మిగిలిన వారంతా చెరువు గట్టునే ఉన్నారు. బోటు చెరువులోకి వెళ్లిన కాసేపటికి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో డ్రైవర్‌ పడవను వెనక్కి మళ్లించేందుకు యత్నించగా.. పడవ అదుపు తప్పి బోల్తా పడింది. రీతాకుమారి, పూనమ్‌ సింగ్‌, ఇద్దరు పిల్లలు నీళ్లలో పడిపోవడంతో వారిని రక్షించేందుకు ఒడ్డున ఉన్న అలోక్‌ కుమార్‌, స్థానికులు చెరువులోకి దూకారు. కానీ, నీట మునిగిన రీతాకుమారి, పూనమ్‌సింగ్‌ ప్రాణాలు కోల్పోగా, పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. వారి కోసం చెరువులోకి దిగిన అలోక్‌ కుమార్‌ అనుకోకుండా నీట మునిగి ఆస్పత్రి పాలయ్యాడు. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, వైల్డర్‌నెస్‌ రిసార్ట్స్‌కు ఎలాంటి అనుమతులు లేకపోగా సర్పన్‌పల్లి ప్రాజెక్టులో అక్రమ నిర్మాణాలు చేపట్టి కాలం చెల్లిన బోట్లతో బోటింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ రిసార్ట్స్‌ అక్రమాలపై 2024 డిసెంబర్‌ 19న ఓ కథనం ద్వారా ‘ఆంధ్రజ్యోతి’ హెచ్చరించినా అధికారులు తగిన చర్యలు తీసుకోలేదు. ఆ నిర్లక్ష్య వైఖరే నేడు రెండు ప్రాణాలను బలిగొంది.

Updated Date - Jul 06 , 2025 | 04:17 AM