Share News

Palamuru: అమ్మో పులి...!

ABN , Publish Date - Jul 14 , 2025 | 05:14 AM

పాలమూరు నగర ప్రజలను చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఒకే చిరుత కనిపించగా, ఆదివారం ఒకేసారి రెండు కనిపించడం.. అవి కూడా నివాస గృహాల సమీపంలోకి రావడంతో బెంబేలెత్తిపోతున్నారు.

Palamuru: అమ్మో పులి...!

  • నివాస గృహాల సమీపంలోకి చిరుతలు

  • హడలెత్తిపోతున్న పాలమూరు వీరన్నపేట వాసులు

  • పట్టుకునేందుకు అధికారుల ప్రయత్నాలు విఫలం

మహబూబ్‌నగర్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): పాలమూరు నగర ప్రజలను చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఒకే చిరుత కనిపించగా, ఆదివారం ఒకేసారి రెండు కనిపించడం.. అవి కూడా నివాస గృహాల సమీపంలోకి రావడంతో బెంబేలెత్తిపోతున్నారు. పాలమూరులోని వీరన్నపేట పక్కనే ఉన్న సక్కనిరాయి గుట్టపై ఓ చిరుత రెండ్రోజుల పాటు ప్రజలకు కనిపించింది. అధికారులు దాన్ని పట్టుకునేందుకు అడవిలో బోను, సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. ఒక చిరుతతోనే జనం భయపడుతుండగా ఆదివారం రెండు చిరుతలు టీడీగుట్ట అటవీప్రాంతం నుంచి ఇళ్ళ సమీపం వరకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జనం అలికిడితో అవి వెనుదిరిగి కొండపైకి వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్ళగా పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించారు.


చిరుతల ఆనవాళ్లేమీ కనిపించలేదని వారు తెలిపారు. రెండు చిరుతలను తాము చూసినట్లు స్థానికులు చెబుతుండగా, అటవీశాఖ అధికారులు మాత్రం ఒకే చిరుత ఉందని, చిరుత పిల్లలు కూడా లేవని చెబుతున్నారు. కాగా, చిరుత ఆచూకీ కోసం అడవిలో బోను ఏర్పాటు చేయడంతో పాటు 5 సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమేరాల ఫుటేజీలో ఎలాంటి దృశ్యాలు నమోదు కాలేదు. డ్రోన్‌ విజువల్స్‌ సేకరించినా చిరుతల సంచారం కనిపించలేదు. అయితే అడవికి సమీపంలో ఉండే వీరన్నపేట, టీడీగుట్ట ప్రాంతాల ప్రజలు మాత్రం భయపడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందవద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. పులి కనిపించినప్పుడు అధికారులు వచ్చి హడావిడి చేస్తున్నారని, ఆ తర్వాత పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jul 14 , 2025 | 05:14 AM