Farmers Suicide: ఇద్దరు రైతుల ఆత్మహత్య..
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:05 AM
పంట నష్టం, అప్పుల బాధతో జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

కాటారం, రాజాపేట ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): పంట నష్టం, అప్పుల బాధతో జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది కురిసిన అకాల వర్షాలు, తెగుళ్లతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన దుర్గం రాజయ్య (55) పత్తిపంట దెబ్బతిన్నది. వరిపొలం కూడా నీళ్లు అందక కొంతమేర ఎండిపోయింది. పంట కోసం చేసిన రూ.1.20 లక్షల అప్పు తీర్చలేననే బాధతో రాజయ్య గురువారం రాత్రి గడ్డిమందు తాగాడు. అస్వస్తతకు గురైన రాజయ్యను కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కొండ్రేటి చెరువు గ్రామానికి చెందిన యువరైతు కర్రె మహేశ్ (28) తనకున్న ఎకరంన్నర పొలంలో వ్యవసాయం చేయడంతో పాటు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సాగునీటి కోసం రూ.4 లక్షలు అప్పుచేసి బోర్లు వేయించాడు. ఇంటి నిర్మాణం కోసం 10 లక్షలు అప్పు చేశాడు. పంట దిగుబడి రాకపోవడం, ఆటో కూడా సరిగా నడవకపోవడంతో అప్పు తీర్చలేననే బాధతో గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు.