Share News

Hyderabad: ఇద్దరు బంగ్లాదేశీయుల అరెస్టు

ABN , Publish Date - Apr 24 , 2025 | 05:14 AM

హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 4 సంవత్సరాలుగా అక్రమంగా భారతదేశంలో ఉన్న ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. నకిలీ పత్రాలు జారీ చేసిన మునిసిపల్‌ ఉద్యోగితో సహా మరొక గ్యాంగ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు

Hyderabad: ఇద్దరు బంగ్లాదేశీయుల అరెస్టు

  • నాలుగేళ్లపాటు కోల్‌కతాలో నివాసం

  • వారిలో ఒకరికి మలక్‌పేట మహిళతో వివాహం.. 8 నెలల క్రితం హైదరాబాద్‌కు

  • ఆటకట్టించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ/చాదర్‌ఘాట్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కొన్నేళ్లుగా దేశంలోని వేర్వేరు ప్రాంతా ల్లో అక్రమంగా ఉంటున్న ఇద్దరు బంగ్లాదేశీయులను హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్‌, మలక్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. వీరికి నకిలీ సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డుల జారీలో సహకరించిన మునిసిపల్‌ ఉద్యోగితోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందిన మహ్మద్‌ హసీబుల్‌ (25), రోమన్‌ సాహ(21) నాలుగేళ్ల క్రితం అక్రమ రవాణాదారులకు రూ. 25వేలు చెల్లించి గుట్టుగా బంగ్లాదేశ్‌ నుంచి పశ్చిమబెంగాల్‌కు అక్రమంగా వచ్చారు. కోల్‌కతాలోని సౌత్‌హారాలో ఉంటూ హాసిబుల్‌ తన పేరును జోవన్‌ చౌదరిగా మార్చుకొ కరాటే శిక్షకుడిగా పని చేశాడు. మరో యువకుడు రోమన్‌ తన పేరును రహన్‌గా మార్చుకొని కూలీగా పని చేశాడు. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో పరిచయమైన మలక్‌పేట మహిళతో ప్రేమాయణం సాగించిన హసీబుల్‌.. 8 నెలల క్రితం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ వెంటనే హైదరాబాద్‌కు మకాం మార్చాడు.


ఆన్‌లైన్‌ ఫుడ్‌ యాప్‌ల్లో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉండే పాన్‌షా్‌ప యజమాని మహ్మద్‌ ముఖీద్‌తో పరిచయం పెంచుకున్న హసీబుల్‌.. తనకు స్థానికత విషయంలో ఇబ్బది రాకుండా నకిలీ పత్రాలు కావాలని కోరాడు. ముఖీద్‌ స్నేహితులైన చాదర్‌ఘాట్‌ నివాసి తేముర సాయి కిరణ్‌ (50), చంచల్‌గూడ నివాసి గడ్డమీది రజినీకాంత్‌ (46) ఓ ముఠాగా ఏర్పడ్డారు. నార్సింగి మున్సిపాలిటీలో శానిటేషన్‌ సెక్షన్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ దుడ్డు సుధీర్‌కుమార్‌ (27) ద్వారా నకిలీ బర్త్‌ సర్టిఫికెట్‌ పొందారు. దాని ఆధారంగా నకిలీ ఆధార్‌కార్డు, నకిలీ ఓటర్‌ ఐడీకి దరఖాస్తు చేసుకున్నాడు. మరోవైపు కోల్‌కతాలో ఉన్న హబీబుల్‌ స్నేహితుడు రోమన్‌ సాహ కూడా గతనెలలో హైదరాబాద్‌కు వచ్చాడు. హబీబుల్‌తో పాటే మలక్‌పేటలో ఉంటున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి నకిలీ ఆధార్‌ కార్డులు, బంగ్లాదేశ్‌ పాస్‌పోర్టు జిరాక్స్‌, ఏడు సెల్‌ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. కాగా, నకిలీ సర్టిఫికెట్‌ జారీ చేసి అరెస్టయిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ సుధీర్‌కుమార్‌ జారీ చేసిన సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తున్నట్లు నార్సింగ్‌ మునిసిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Apr 24 , 2025 | 05:14 AM