Thummla Nageshwar Rao: ఎస్‌ఏఆర్ డేటాతో పంటల వివరాల నమోదు
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:09 AM
రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాల నమోదులో ఎస్‌ఏఆర్ డేటాను వినియోగించాలి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి: తుమ్మల
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాల నమోదులో ఎస్‌ఏఆర్ డేటాను వినియోగించాలి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఎస్‌ఏఆర్ డేటా వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టుపై మంత్రి తుమ్మల సచివాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణం అంచనా వేయటం ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయడానికి వీలుంటుందన్నారు.
మరోవైపు.. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వీసీ, అధికారులతోనూ మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. సహకార సంఘాల ద్వారా విత్తనోత్పత్తి అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ఆయన సూచించారు. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్, మంథని మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాలను నియమించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.