Seethakka: ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాల కల్పన.. దేశ చరిత్రలోనే ఓ మైలురాయి
ABN , Publish Date - May 27 , 2025 | 03:53 AM
ట్రాన్స్‌జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఉద్యోగం కల్పించడం దేశ చరిత్రలోనే ఓ మైలురాయి అని గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు.

ట్రాఫిక్ అసిస్టెంట్లుగా రాణిస్తున్నారు
సీపీతో కలిసి మంత్రి సీతక్క సమావేశం
హైదరాబాద్ సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఉద్యోగం కల్పించడం దేశ చరిత్రలోనే ఓ మైలురాయి అని గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. తెలంగాణను రోల్‌మోడల్‌గా తీసుకున్న ఇతర రాష్ట్రాలు కూడా ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నాయని ఆమె తెలిపారు. సిటీ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమితులైన ట్రాన్స్‌జెండర్ల పనితీరు, ప్రవర్తనపై ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని కోరిన నేపథ్యంలో సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు తమను తాము నిరూపించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారని, పోలీస్ శాఖలోనే కాకుండా ఇతర శాఖల్లో కూడా వారిని నియమించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్ వర్గాన్ని చేర్చుకోవాలని నిర్ణయించిన రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ట్రాన్స్‌జెండర్ వర్గానికి అంగవైకల్యం కోటా కింద ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. జిల్లాలో ఇప్పటికే మైత్రీ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం, ట్రాన్స్‌జెండర్ వర్గానికి సమాన అవకాశాలు కల్పించి, సమాజంలో భాగం చేయడమేనని పునరుద్ఘాటించారు.
గత బీఆర్‌ఎస్ సర్కారు తీరు వల్లే సమస్యలు
గత ప్రభుత్వ విధానాల వల్లే గ్రామ పంచాయతీ కార్యదర్శులు సవాలక్ష సమస్యలను ఎదుర్కొంటున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. 2019లో పంచాయతీ కార్యదర్శుల నియామకంలో గందరగోళం సృష్టించారని పేర్కొన్నారు. ఇప్పుడు గ్రామ కార్యదర్శులు కోరినట్లు నియామకమైన తొలి రోజు నుంచి వారి సర్వీసును పరిగణనలోకి తీసుకోవడానికి అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
Also Read:
సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..
సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..
For More Health News and Telugu News..