Nirmal: శుభలేఖలు ఇచ్చేందుకెళ్తూ అనంతలోకాలకు..
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:42 AM
మరో నాలుగు రోజుల్లో ఆ యువకుడి పెళ్లి.. ఎంతో సంతోషంగా బంధుమిత్రులకు శుభలేఖలు ఇచ్చేందుకు వెళుతున్న అతన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది.

బైక్ అదుపు తప్పి వరుడు, అతని బంధువు మృతి
నాలుగు రోజుల్లో పెళ్లి అనగా విషాదం
ఖానాపూర్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మరో నాలుగు రోజుల్లో ఆ యువకుడి పెళ్లి.. ఎంతో సంతోషంగా బంధుమిత్రులకు శుభలేఖలు ఇచ్చేందుకు వెళుతున్న అతన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. అతనితో పాటు బంధువైన మరో యువకుడు కూడా మృత్యువాత పడ్డాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ శివారులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధన్‌పల్లి గ్రామానికి చెందిన చొప్పదండి లక్ష్మణ్ (25)కు ఈ నెల 18న వివాహం నిశ్చయమైంది.
నిర్మల్ జిల్లాలోని తన బంధుమిత్రులకు శుభలేఖలు పంచేందుకు వరుసకు బావమరిది అయిన జశ్వంత్ (19)ను తోడు తీసుకొని ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. జశ్వంత్‌ది మంచిర్యాల జిల్లా మురిమడుగు గ్రామం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ శివారు డబుల్ బెడ్‌రూమ్ కాలనీ సమీపంలోని కల్వర్టు వద్ద వారి ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. సుమారు పది అడుగుల ఎత్తు నుంచి ద్విచక్ర వాహనంతో సహా ఎగిరి కల్వర్టు కింద పడడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనతో ఇరువురి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.