Share News

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ డీఎస్పీల మృతి

ABN , Publish Date - Jul 27 , 2025 | 03:51 AM

యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ డీఎస్పీల మృతి

  • ఏఎస్పీ, కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

  • సడన్‌ బ్రేక్‌ వేసిన ముందు వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన కారు

  • రోడ్డు క్రాసింగ్‌లో డివైడర్‌ను ఢీకొట్టి... అవతలివైపు దూసుకెళ్లి పడిన వైనం

  • దాన్ని ఢీకొట్టిన కాంక్రీటు మిక్సర్‌ లారీ

  • అమరావతి నుంచి హైదరాబాద్‌ వస్తుండగా చౌటుప్పల్‌ వద్ద ప్రమాదం

చౌటుప్పల్‌ రూరల్‌/మన్సూరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్‌ మండలం ఖైతాపురం స్టేజి వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు డీఎస్పీలు మరణించగా, మరో ఏఎస్పీ, కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ (ఎస్‌ఎ్‌సజీ) డీఎస్పీ జల్లు శాంతారావు (56), ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎ్‌సడబ్ల్యూ) డీఎస్పీ మాకా చక్రధర్‌రావు (52), ఐఎ్‌సడబ్ల్యూ ఏఎస్పీ కేడీఎం దుర్గాప్రసాద్‌... విధుల్లో భాగంగా శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అమరావతి కార్యాలయం నుంచి డ్రైవర్‌గా ఓ కానిస్టేబుల్‌ను తీసుకుని కారులో హైదరాబాద్‌లోని కార్యాలయానికి బయలుదేరారు. నార్కట్‌పల్లి వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారుకు మరమ్మతు వచ్చింది. దీంతో హైదరాబాద్‌ నుంచి మరో స్కార్పియో వాహనం తెప్పించుకొని డ్రైవర్‌గా హెడ్‌కానిస్టేబుల్‌ రెడ్డిచర్ల నర్సింగరావును తీసుకుని బయలుదేరారు. తెల్లవారుజామున 4.45 నిమిషాలకు కారు ఖైతాపురం స్టేజి వద్దకు రాగానే ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం సడన్‌ బ్రేక్‌ వేసింది. దాన్ని తప్పించబోయిన పోలీసుల కారు... క్రాసింగ్‌ వద్ద డివైడర్‌ ముందు భాగాన్ని బలంగా ఢీకొట్టి కొద్దిదూరం దూసుకెళ్లి విజయవాడ వైపు వెళ్లే రోడ్డులో పడిపోయింది. దాన్ని అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి చౌటుప్పల్‌కు వస్తున్న కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ ఢీకొట్టింది. కారు నుజ్జవగా మధ్య సీటులో కూర్చున్న డీఎస్పీలు చక్రధరరావు, శాంతారావుకు అక్కడికక్కడే మరణించారు. ముందు సీటులో కూర్చున్న ఏఎస్పీ దుర్గాప్రసాద్‌, డ్రైవర్‌ నర్సింగరావు సీటు బెల్ట్‌ పెట్టుకోవడం, బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.


గతంలో హైదరాబాద్‌లో పనిచేశారు!

ప్రమాదంలో మరణించిన డీఎస్పీ శాంతారావుది ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం డోలా గ్రామం. మరో డీఎస్పీ చక్రధర్‌రావుది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. వీరిద్దరి కుటుంబాలు హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నాయి. శాంతారావుకు భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. చక్రధరరావుకు భార్య శ్రీదేవి, ఇద్దరు కుమార్తెలు హాసిని ప్రియ, డింపుల్‌ ఉన్నారు. ప్రియ తొమ్మిదో తరగతి, డింపుల్‌ ఒకటో తరగతి చదువుతున్నారు.


హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో

ఖైతాపురం క్రాసింగ్‌ అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. హెచ్చరిక బోర్డులు, లైట్లు లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు డివైడర్‌ పక్క నుంచి వాహనం వెళ్తే అంతే సంగతులు. డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత పోలీసుల వాహనం 50 మీటర్ల దూరం దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వాహనం 70 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు సమాచారం. సీటు బెల్టు పెట్టుకోకపోవడం కూడా ఇద్దరు డీఎస్పీల మృతికి కారణంగా తెలుస్తోంది.


ఈవార్తలు కూడా చదవండి..

పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 03:51 AM