Share News

Gulf: కోట్లకు పడగెత్తి కటిక దారిద్య్రంతో కన్నుమూసి..

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:11 AM

కాలం కన్నెర్రజేస్తే ఓడలు బండ్లయ్యేందుకు.. రాజులు బంట్లయ్యేందుకు ఎంతో సమయం పట్టదు. గల్ఫ్‌లో తెలంగాణకు చెందినఆ ఇద్దరు కుబేరులు రాత్రికి రాత్రే బికారులై కటిక దారిద్య్రం అనుభవించి చనిపోయారు.

Gulf: కోట్లకు పడగెత్తి కటిక దారిద్య్రంతో కన్నుమూసి..

  • గల్ఫ్‌లో ఇద్దరు తెలంగాణ ప్రవాసీయుల విషాదాంతం!

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాలం కన్నెర్రజేస్తే ఓడలు బండ్లయ్యేందుకు.. రాజులు బంట్లయ్యేందుకు ఎంతో సమయం పట్టదు. గల్ఫ్‌లో తెలంగాణకు చెందినఆ ఇద్దరు కుబేరులు రాత్రికి రాత్రే బికారులై కటిక దారిద్య్రం అనుభవించి చనిపోయారు. స్వర్గాన్ని తలపించేలా కళ్లు చెదిరే భవంతులు.. చిటికేస్తే కూర్చున్నచోటుకే వచ్చివాలే సకల సదుపాయాలు.. ఇంట్లోంచి కాలు బయటపెడితే విలాసవంతమైన కార్లు.. అన్నీ కళ్లుమూసి తెరిచేలోపు మాయమైపోయి... చేతిలో చిల్లిగవ్వ లేనిస్థితిలో.. పిడికెడు మెతుకులు దొరకని దయనీయస్థితిలో పాడుబడ్డ ఇళ్లలో దుర్భరంగా బతుకీడుస్తూ చనిపోయారు. వారిలో ఒకరు.. హైదరాబాద్‌కు చెం దిన గప్ఫార్‌ సేట్‌ అయితే మరొకరు సిద్దిపేట జిల్లాకు చెందిన గాథర మోం డయ్య! ఈ ఇద్దరూ ఒకప్పుడు సౌదీలో అక్రమ పద్ధతిలో ఇబ్బడిముబ్బడిగా డబ్బు సంపాదించి.. విపరీతంగా కూడబెట్టారు.


గఫ్పార్‌ సేట్‌కు నోట్ల కట్టలు పెట్టే స్థలం లేక సంచుల్లో కుక్కి గోదాంలో ఆ సంచుల్ని పేర్చేవాడు. ఈ డబ్బంతా గఫ్ఫార్‌ సేట్‌ చట్టవిరుద్ధంగా థాయ్‌లాండ్‌ లాటరీలు నిర్వహించి సంపాదించిందే!. తర్వాత మనీలాండరింగ్‌ కేసుల్లో ఇరుక్కున్నాడు. చివరికి ఇంటి అద్దెను, కరెంటు బిల్లులూ చెల్లించే స్థోమత లేక శిథిలమైపోయిన ఓ భవంతిలో గడిపాడు. స్వదేశానికి వెళ్లేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి, ఇటీవల అల్‌ ఖోబర్‌లో మృతిచెందాడు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన మోండయ్య చట్టవిరుద్ధమైన పద్ధతిలో భవన నిర్మాణ కాంట్రాక్టు, వీసా దందాలతో విపరీతంగా డబ్బు సంపాదించాడు. ఇతనూ మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొని.. 17ఏళ్లుగా స్వదేశానికి వెళ్లేందుకు యత్నాలు చేసీ చేసీ ఇటీవల రియాద్‌లో గుండెపోటుతో మృతిచెందాడు.

Updated Date - Apr 10 , 2025 | 05:11 AM