Road Accident: బైక్‌ను ఢీకొన్న కారు.. డ్యాంలో పడ్డ యువకుడు
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:49 AM
గద్వాల జిల్లాలోని ధరూరు మండలం రేవులపల్లి వద్దగల జూరాల ప్రాజెక్టుపై ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకులపైకి కారు దూసుకురావడంతో ఇద్దరిలో ఓ యువకుడు ఎగిరి డ్యాంలో పడి గల్లంతయ్యాడు.

జూరాల ప్రాజెక్టు మీద ఘటన
స్నేహితులతో కలిసి డ్యాం వద్దకు మహేశ్
బైక్‌పై తిరిగి వెళ్తుండగా ఢీకొన్న కారు
డ్యాంలో పడ్డ మహేశ్.. ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు
ధరూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లాలోని ధరూరు మండలం రేవులపల్లి వద్దగల జూరాల ప్రాజెక్టుపై ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకులపైకి కారు దూసుకురావడంతో ఇద్దరిలో ఓ యువకుడు ఎగిరి డ్యాంలో పడి గల్లంతయ్యాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాలోని మానవపాడు మండలం ఏ-బూడిదపాడు గ్రామానికి చెందిన మహేశ్ (25), సతీశ్, వీరేశ్‌తో పాటు తిమ్మాజిపల్లికి చెందిన జానకిరాములు స్నేహితులు. ఆదివారం కావడంతో సరదాగా జూరాల జలాశయం చూసేందుకు రెండు బైక్‌ల మీద వచ్చారు. రాత్రి 7.30కు గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఓ బైక్‌ను జానకిరాముడు నడుపుతుండగా మహేశ్ వెనుక కూర్చున్నాడు. మరో ఇద్దరు స్నేహితులు వెనకాలే మరో బైక్‌పై వారిని అనుసరిస్తున్నారు.
ఆ సమయంలో ప్రాజెక్టు 48వ గేటు వద్ద ఎదురుగా వస్తున్న కారు జానకిరాములు, మహేశ్ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేశ్ బైక్ పైనుంచి ఎగిరి డ్యాంలో పడిపోయాడు. జానకిరాములుకు తీవ్రగాయాలయ్యాయి. వెనుక వస్తున్న మరో ఇద్దరు యువకులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు ధరూర్ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఎస్సై కొండా శ్రీహరికి సమాచారమిచ్చారు. హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకున్న పోలీసులు గాయపడిన జానకిరాములును ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి వరకు మహేశ్ ఆచూకీ లభ్యంకాలేదు. సోమవారం ఉదయం డ్యాంలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు ఆచూకీ లభ్యం కాలేదని ఎస్సై తెలిపారు. కారు డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కారు డ్రైవర్‌ను ఆదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News