Konda Murali: ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:17 AM
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేసిన మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది.

కొండా మురళికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ పిలుపు
నేడు గాంధీభవన్‌లో హాజరుకు ఆదేశం
వరంగల్/హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సొంత పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేసిన మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది. శనివారం గాంధీభవన్‌లో సమావేశం కానున్న ఎంపీ మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ.. ఉదయం 11 గంటలకు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా కొండా మురళిని ఆదేశించింది. ఈ నెల 19న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకా్‌షరెడ్డిలపై కొండా మురళి తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడం తెలిసిందే.
దీనిపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఈ నెల 23న ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తోపాటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, వీరి ఫిర్యాదుపై శుక్రవారం పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌తో మల్లు రవి చర్చించినట్లు తెలిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పార్టీకి మంచిదికాదనే అభిప్రాయానికి వారు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు తొలుత ముురళి నుంచి సంజాయిషీ తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు కొండా సురేఖ అనుచరులు కూడా ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసినట్లు, సురేఖ మంత్రి పదవి పోతుందంటూ ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేశారని చెప్పినట్లు సమాచారం.