Share News

Konda Murali: వారంలోగా వివరణ ఇవ్వాలి

ABN , Publish Date - Jun 29 , 2025 | 03:42 AM

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నేతల పరస్పర ఫిర్యాదులపై విచారణ చేపట్టిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వారం రోజుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ఆదేశించింది.

Konda Murali: వారంలోగా వివరణ ఇవ్వాలి

క్రమశిక్షణ కమిటీ అడిగిన ప్రశ్నలపైనే ఇవ్వండి.. కొండా మురళిని ఆదేశించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ

  • 150కి పైగా వాహనాల్లో భారీ అనుచరగణంతో గాంధీభవన్‌కు మురళి

  • క్రమశిక్షణ కమిటీకి 6 పేజీల లేఖ.. కడియం సహా ఇతర నేతలపై ఆరోపణలు

హైదరాబాద్‌, వరంగల్‌, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నేతల పరస్పర ఫిర్యాదులపై విచారణ చేపట్టిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వారం రోజుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ఆదేశించింది. శనివారం గాంధీభవన్‌లో మల్లురవి అధ్యక్షతన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ప్రధానంగా వరంగల్‌ జిల్లాలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులపై మురళి చేసిన వ్యాఖ్యలపై ఆయన్ను కమిటీ వివరణ కోరింది. అదేరోజు మురళి 150కి పైగా వాహనాల్లో భారీ అనుచరగణంతో గాంధీభవన్‌కు చేరుకొని ఆరుపేజీల లేఖను కమిటీ చైర్మన్‌ మల్లురవికి అందజేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఎమ్మెల్యేలతో తనకు ఉన్న విభేదాలు, సఖ్యతపై లేఖలో మురళి వివరించారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, నాయిని రాజేందర్‌ రెడ్డి పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని లేఖలో ఆరోపిస్తూ గతంలో వారిపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అయితే క్రమశిక్షణ కమిటీ అడిగిన అంశాలపైనే తాము వివరణ కోరుతున్నట్లు మురళికి చైర్మన్‌ మల్లురవి స్పష్టం చేసినట్లు తెలిసింది. జిల్లాకు చెంది న ముఖ్యనాయకులపై చేసిన ఆరోపణలకు వారం రోజుల వ్యవధిలో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల ని మురళిని ఆయన ఆదేశించారు. అనంతరం మల్లురవి మాట్లాడుతూ.. మురళి తాను చెప్పదలచుకున్న అంశాలను లేఖ రూపంలో అందజేశారని వెల్లడించారు. తాము అడిగిన విషయాలపై వారం రోజుల్లో రాతపూర్వకంగా ఆయన వివరణ పంపితే తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎలాంటి ఒత్తిడులకు లొంగే ప్రసక్తి లేదన్నారు.


పార్టీ మారితే విలువలు పాటించాలి: మురళి

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా ఉన్న తాను ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రె్‌సలోకి వచ్చానని కొండా మురళి చెప్పారు. కడియం శ్రీహరి కూడా తన మాదిరిగానే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరారని, అయితే ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అనేది ఆయనే నిర్ణయించుకోవాలన్నారు. పార్టీ మారేటప్పుడు నాయకులు విలువలు పాటించాలని సూచించారు. కడియం పార్టీలోకి వచ్చాకే సమస్యలు మొదలయ్యాయని ఆరోపించారు. కొండా సురేఖకు, సీతక్కకు గ్యాప్‌ ఏర్పడిందని కడియం ప్రచారం చేశారన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉండి, తన సతీమణి కొండా సురేఖపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని, ఎమ్మెల్సీ సారయ్యలతో కలిసి పొంగులేటి తమ వరంగల్‌ తూర్పు నియోకవర్గంలో తిరుగుతున్నారని, అయినప్పటికీ వారికి తాము ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని తెలిపారు. రాహూల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయటమే తన లక్ష్యమని, సీఎం రేవంత్‌రెడ్డి అంటే అభిమానమని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..

మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్

Updated Date - Jun 29 , 2025 | 03:42 AM