Share News

Tourist Services: ఇక ఆన్‌లైన్‌లోనే పర్యాటక సంస్థ సేవలు

ABN , Publish Date - Jul 07 , 2025 | 01:47 AM

రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక సంస్థ అందించే అన్ని సేవలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నారు. తద్వారా పర్యాటకుల విలువైన సమయం వృథా కాకుండా ఏర్పాట్లు చేయనున్నారు.

Tourist Services: ఇక ఆన్‌లైన్‌లోనే పర్యాటక సంస్థ సేవలు

  • ముందే హోటళ్లు, బస్సులు, బోటింగ్‌ బుక్‌ చేసుకోవచ్చు

  • రిజర్వేషన్‌ కేంద్రానికి వెళ్లే పని లేకుండా ఏర్పాట్లు

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక సంస్థ అందించే అన్ని సేవలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నారు. తద్వారా పర్యాటకుల విలువైన సమయం వృథా కాకుండా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ కేంద్రంగా పని చేస్తున్న పర్యాటక సంస్థ రిజర్వేషన్‌ కేంద్రాన్ని పూర్తిస్థాయి కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంగా విస్తరించి అధికారులు పర్యవేక్షిస్తారు. ఇది దేశ, విదేశీ పర్యాటకులకు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. పర్యాటక సంస్థ సమాచార కేంద్రాలను ఆధునికీకరించనున్నారు. సంస్థలో ఉన్న సుమారు 30 ఏసీ, నాన్‌ఏసీ, క్యారవాన్‌లు, మినీ బస్సులు రాజధాని నుంచి తిరుపతి, శిరిడీ, భద్రాచలం తదితర ప్రాంతాలకు, సిటీ టూర్‌కు ప్యాకేజీల కింద నడుస్తున్నాయి. ఆయా బస్సుల్లో వెళ్లేందుకు పర్యాటకులు నేరుగా రిజర్వేషన్‌ కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇక నుంచి ఆ అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే వాటి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఈ బస్సులకు జీపీఎస్‌ ఏర్పాటు చేయనున్నారు. దీంతో అవి గమ్యస్థానాలకి చేరడానికి ఎంత సమయం పడుతుందో పర్యాటకులు కచ్చితంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.


అలాగే పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో నడిచే హోటళ్లలో అందుబాటులో ఉన్న గదులు, వసతులను ఆన్‌లైన్‌లోనే ముందుగా బుక్‌ చేసుకోవచ్చని పర్యాటక సంస్థ అధికారులు తెలిపారు. బోట్‌ రైడ్‌లు సైతం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. సెలవులు, ఇతర పండుగ రోజుల్లో రద్దీ పెరిగి పలు పర్యాటక కేంద్రాల్లో బోట్‌ రైడ్ల కోసం వరుసల్లో నిలబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇక నుంచి ఆ సమస్య ఉండదు. లుంబినీ పార్క్‌, హుస్సేన్‌సాగర్‌తో పాటు లక్నవరం, దుర్గంచెరువు, మీర్‌ఆలం చెరువు, కరీంనగర్‌ ఎల్‌ఎండీ, రామప్ప చెరువు, సోమశిల, నాగార్జునసాగర్‌, సింగూరు, ధర్మపురి, కోటిలింగాల, కొత్తగూడెం కిన్నెర సాని తదితర ప్రాంతాల్లోని జలాశయాల్లో పర్యాటకుల కోసం 130కి పైగా బోట్లను నడుపుతున్నారు. కాగా, ఇప్పటి వరకు పర్యాటక సంస్థలో వివిధ విభాగాలకు అధిపతులుగా వ్యవహరించిన రిటైర్డ్‌ అధికారుల సేవలను నిలిపివేశారు. మార్కెటింగ్‌, రవాణా, వాటర్‌ఫ్లీట్‌, సౌండ్‌ అండ్‌ లైట్‌, ఇంజనీరింగ్‌, హోటళ్లు తదితర విభాగాల్లో జనరల్‌ మేనేజర్లుగా వ్యవహరించిన రిటైర్డ్‌ అధికారులకు ఉద్వాసన పలికి రెగ్యులర్‌ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ పర్యాటక సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వల్లూరి క్రాంతి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.


Also Read:

కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..

మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 01:47 AM