Share News

Thummala Nageswara Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిది అవివేకం

ABN , Publish Date - Jul 28 , 2025 | 03:28 AM

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రానికి 9.80లక్షల టన్నుల యూరియానే కేంద్రం కేటాయించగా.. 12లక్షల టన్నులు సరఫరా చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.

Thummala Nageswara Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిది అవివేకం

  • రాష్ట్రానికి యూరియా కేటాయింపులు 9.80 లక్షల టన్నులే

  • 12 లక్షల టన్నులు వచ్చిందని చెప్పడం విడ్డూరం

  • ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు: తుమ్మల

హైదరాబాద్‌/కొత్తగూడెం, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రానికి 9.80లక్షల టన్నుల యూరియానే కేంద్రం కేటాయించగా.. 12లక్షల టన్నులు సరఫరా చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అవివేకానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి.. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదారి పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి కావాల్సినంత యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు నెలాఖరులోగా 3 లక్షల టన్నుల యూరియాను కేటాయించాలని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు గతంలోనే లేఖ రాశామని గుర్తు చేశారు.


రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులకు సైతం యూరియా పరిస్థితి, రైతుల ఇబ్బందులను వివరించామని, వారు సమస్యను పరిష్కరించకపోగా రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీలు సైతం మౌన వ్రతం పాటిస్తున్నారని మండిపడ్డారు. కొత్తగూడెం కలెక్టరేట్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేటాయించిన మేరకైనా యూరియా సరఫరా చేయాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా.. కేంద్రం తీరు మారలేదన్నారు. జూలై ఆఖరు నాటికి తెలంగాణకు 6.6లక్షల టన్నులు రావాల్సి ఉండగా.. 4.23లక్షల మెట్రిక్‌ టన్నులనే సరఫరా చేసిందని వెల్లడించారు. రాష్ట్రంలో 1.16కోట్ల ఎకరాల్లో పంటలు సాగువుతున్నాయని.. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలకు యూరియా అత్యంత అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగం యూరియా కోసం తిప్పలు పడుతుంటే.. చేయని పనులు చేసినట్టుగా బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం బాధాకరమని అన్నారు.

Updated Date - Jul 28 , 2025 | 03:28 AM