Share News

Thummala Nagashwara Rao; యూరియాపై పార్లమెంట్‌లో తప్పుడు లెక్కలు

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:14 AM

తెలంగాణకు యూరియా సరఫరా అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా తప్పుడు లెక్కలు చెప్పడం శోచనీయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Thummala Nagashwara Rao; యూరియాపై పార్లమెంట్‌లో తప్పుడు లెక్కలు

  • ఖరీఫ్‌కు రాష్ట్రానికి కేటాయించింది 9.80 లక్షల టన్నులే

  • సభలో 20.20 లక్షల టన్నులని చెప్పారు

  • కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌కు రాష్ట్ర మంత్రి తుమ్మల లేఖ

హైదరాబాద్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు యూరియా సరఫరా అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా తప్పుడు లెక్కలు చెప్పడం శోచనీయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయించి, పార్లమెంట్‌లో మాత్రం 20.20 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని చెప్పడంపై తుమ్మల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తప్పుడు లెక్కల వల్ల రాష్ట్ర రైతులు అయోమయానికి గురయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో యూరియా పరిస్థితిపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌కు మంత్రి తుమ్మల శనివారం ఓ లేఖ రాశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల విభాగం రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల వివరాలతో కూడిన లేఖను దానికి జతపరిచారు. 2025 ఖరీఫ్‌ కోసం రాష్ట్రానికి కేవలం 9.80 లక్షల టన్నులు మాత్రమే కేటాయించారని, దానిలో కూడా నెలవారీ సరఫరా చేయాల్సిన దాని కంటే తక్కువ సరఫరా చేస్తున్నారని తుమ్మల పేర్కొన్నారు. ఫలితంగా రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని వివరించారు. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు 6.60 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా కేంద్రం 4.36 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసిందని తెలిపారు. కేటాయింపుల ప్రకారం జూలై వరకు సరఫరా కానీ 2.24 లక్షల టన్నుల యూరియాతోపాటు ఆగస్టు నెల కేటాయింపులు త్వరగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు.


చంద్రబాబు అరెస్టును మొదట ఖండించింది నేనే: తుమ్మల

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్‌ చేసినప్పుడు తొలుత స్పందించింది, అరెస్టును ఖండించింది తానేనని మంత్రి తుమ్మల అన్నారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తి, ఆశీస్సులతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఎక్కడా ఎప్పుడూ కమ్మ జాతి గౌరవం తగ్గకుండా నిస్వార్థంగా పనిచేశానని చెప్పారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా బండి రమేశ్‌, ఉపాధ్యక్షుడిగా పృథ్వీ చౌదరి ఎన్నికైన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని కమ్మ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభకు తుమ్మల హాజరై మాట్లాడారు. సమాజ సేవ కోసం కమ్మ సంఘాలు అనునిత్యం పనిచేస్తున్నాయని అభినందించారు. త్వరలో కమ్మ సంఘాల సమాఖ్య సమావేశం నిర్వహించాలని, దానికి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పిలవాలని సూచించారు. 1985లో ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా 60 మంది కమ్మ ప్రజాప్రతినిదులు ఉన్నా అమీర్‌పేట కమ్మ సంఘం భవనం శంకుస్థాపనకు ఎవరూ రాలేదని, తానొక్కడినే నిర్భయంగా వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 05:14 AM