Share News

Adilabad: రైతును బెదిరించి రూ.30 వేలు వసూలు

ABN , Publish Date - Jul 01 , 2025 | 04:16 AM

రైతును బెదిరించి రూ.30 వేలు వసూలు చేసిన ముగ్గురు విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం సుర్జాపూర్‌ గ్రామానికి చెందిన టగరే కాసాన్‌ దాస్‌ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు.

Adilabad: రైతును బెదిరించి రూ.30 వేలు వసూలు

  • నేరడిగొండలో ముగ్గురు విలేకరుల అరెస్టు

నేరడిగొండ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : రైతును బెదిరించి రూ.30 వేలు వసూలు చేసిన ముగ్గురు విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం సుర్జాపూర్‌ గ్రామానికి చెందిన టగరే కాసాన్‌ దాస్‌ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు. మే నెలలో అతడి చేనులో పండిన జొన్న పంటను సమీపంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆరబెట్టాడు. దీన్ని గమనించిన నేరడిగొండకు చెందిన విలేకరులు గాజుల దేవేందర్‌, షేక్‌ ఫసీయుద్దీన్‌, గాజుల శ్రీకాంత్‌ మే 18న రైతును బెదిరించారు.


పాఠశాల ఆవరణలో పంటను ఆరబెట్టినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయిస్తామని భయపెట్టారు. విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో భయపడిన రైతు రూ.30వేలు ఇచ్చాడు. ఆ తర్వాత జరిగిన ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jul 01 , 2025 | 04:16 AM