Mahabubabad; ఎదురెదురుగా రెండు లారీలు ఢీ
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:42 AM
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్టేజీ తండా సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు 563 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

మంటలు చెలరేగి ముగ్గురి సజీవ దహనం
మానుకోట జిల్లా మరిపెడ మండలంలో ఘటన
మరిపెడ రూరల్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్టేజీ తండా సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు 563 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో మంటలు చెలరేగి ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ సజీవ దహనమయ్యారు. విజయవాడ నుంచి చేపల దాణాతో బయలుదేరిన లారీ గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్తోంది. కరీంనగర్ నుంచి గ్రానైట్ లోడుతో మరో లారీ ఏపీలోని కాకినాడకు వెళ్తోంది. ఈ రెండు లారీలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్టేజీ తండా సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఎదురెదురుగా అతి వేగంగా ఢీకొన్నాయి.
దీంతో చేపల దాణాతో వెళ్లే లారీ డీజిల్ ట్యాంక్‌కు గ్రానైట్ రాయి తగిలి పగలడంతో రెండు లారీల క్యాబిన్లలో మంటలు చేలరేగాయి. చేపల దాణా లారీ డ్రైవరు రాజస్థాన్ రాష్ట్రం జోద్‌పూర్‌కు చెందిన సర్వణ్‌రాం(21), క్లీనర్ భర్కత్‌ఖాన్(24), గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి పరిధిలోని రాంనాథ్ తండాకు చెందిన గుగులోతు గణేష్(30) ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. ముగ్గురి శరీరాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న మరిపెడ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. లారీ క్యాబిన్లలో చిక్కుకుని సజీవ దహనమైన వారి మృతదేహాలను రెండు జేసీబీల సహాయంతో వెలికి తీసి, స్టేజీ తండా వద్దనే పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.