ఆర్ అండ్ బీలో తేలిన హ్యామ్ రోడ్లు
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:18 AM
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ పరిధిలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో అభివృద్ధి చేయద ల్చిన రోడ్ల గుర్తింపు ఒక కొలిక్కి వచ్చింది. తొలిదశలో 5,189 కిలోమీటర్ల పరిధిలో రహదారులను అభివృద్ధి చేయాలని శాఖ అధికారులు గుర్తించారు.

తొలిదశలో 5,189 కి.మీల గుర్తింపు..
సీఎం రాష్ట్రానికి వచ్చాక క్యాబినెట్ ఆమోదంతో నిర్మాణ పనులు: కోమటిరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ పరిధిలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో అభివృద్ధి చేయద ల్చిన రోడ్ల గుర్తింపు ఒక కొలిక్కి వచ్చింది. తొలిదశలో 5,189 కిలోమీటర్ల పరిధిలో రహదారులను అభివృద్ధి చేయాలని శాఖ అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వివరించారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి కోమటిరెడ్డి.. హ్యామ్ రోడ్లు, రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరభాగం, జాతీయ ప్రాజెక్టులపై శాఖ ముఖ్య అధికారులు వికా్‌సరాజ్, హరిచందనలతో కలిసి సమీక్ష నిర్వహించారు. హ్యామ్ రోడ్ల గుర్తింపు, ఎంపికపై చర్చించారు.
తొలిదశలో ఎంపికైన హ్యామ్ రోడ్ల పూర్తి స్థాయి నిర్మాణ అంచనాలను సిద్ధం చేసి ఇవ్వాలని మంత్రి కన్సల్టెంట్లను ఆదేశించారు. విదేశీ పర్యటన నుంచి సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి వచ్చిన అనంతరం హ్యామ్ రోడ్లపై సమీక్ష నిర్వహించి, రోడ్ల అభివృద్ధికి క్యాబినెట్ ఆమోదం తీసుకున్న తర్వాత పనులను ప్రారంభిస్తామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం రహదారి కోసం భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించే ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని జాతీయ రహదారుల ప్రాఽధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులకు సూచించారు. జాతీయ రహదారి ప్రణాళిక-2025-26కు ప్రతిపాదనలను త్వరగా సిద్ధం చేయాలన్నారు. గుంతలు లేని, సురక్షిత రహదారులను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు.