Share News

Land Survey: ప్రతి ఊరికీ ఓ పరిపాలన అధికారి

ABN , Publish Date - Apr 22 , 2025 | 03:03 AM

రాష్ట్రంలో రైతుల భూములను సర్వే చేయడానికి ఆరు వేల మంది సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Land Survey: ప్రతి ఊరికీ ఓ పరిపాలన అధికారి

మే నుంచి విధుల్లోకి 10,695 మంది.. జూన్‌ 2 నుంచి గ్రామాలకు తహసీల్దార్‌ స్థాయి అధికారులు

  • భూ సమస్యలపై దరఖాస్తు స్వీకరిస్తారు

  • రూపాయి చెల్లించకుండా సమస్యలు పరిష్కరించుకోవచ్చు

  • భూమి రిజిస్ట్రేషన్‌ సమయంలోనే సర్వే మ్యాప్‌ ఏర్పాటు

  • ధరణి పేరుతో బీఆర్‌ఎస్‌ భూ కబ్జాలు.. అన్నింటినీ వెలికి తీస్తాం: పొంగులేటి

  • భూ పట్టాలు, పాస్‌ పుస్తకాలు ఇవ్వలేదని సాగర్‌ ముంపు రైతుల ఆవేదన

  • ఆర్నెల్లైనా అవగాహన రాలేదా.. అంటూ ఆర్డీవోపై మంత్రి ఆగ్రహం

దేవరకొండ/ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతుల భూములను సర్వే చేయడానికి ఆరు వేల మంది సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భూముల సర్వే కోసం లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తామన్నారు. అలాగే ప్రతి ఊరికి ఒక గ్రామ పరిపాలనాధికారి చొప్పున 10,695 మందిని వచ్చే నెల మొదటి వారం నుంచిపంపించనున్నామని వెల్లడించారు. సోమవారం నల్లగొండ జిల్లా చందంపేట, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ధరణితో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఆ బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందని చెప్పారు. ‘భూ భారతి’తో సాగులో ఉన్న ప్రతి రైతుకూ న్యాయం జరుగుతుందన్నారు. గిరిజన ప్రాంతమైన చందంపేట మండలంలో భూ సమస్యలను పరిష్కరించేందుకే కొత్త చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, పైలెట్‌ మండలంగా ఏర్పాటు చేసి భూసమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జూన్‌ 2 నుంచి ప్రతి గ్రామానికి తహసీల్దార్‌ స్థాయి అధికారులు వచ్చి భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకుంటారని మంత్రి చెప్పారు. రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రతి మనిషికి ఆధార్‌ లాగే భూదార్‌ కార్డు ఇచ్చి ఖాతా నంబరును ఇస్తామని తెలిపారు. గతంలో భూములు అమ్మినా, కొన్నా మ్యాపింగ్‌ లేదని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్‌ సమయంలోనే సర్వే మ్యాప్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చట్టంలో నిబంధన పెట్టామని చెప్పారు. 9.26 లక్షల సాదా బైనామా దరఖాస్తులు ఉన్నాయని, వాటిలో న్యాయమైన వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. గతంలో పట్టాలిచ్చిన డీ లిమిటేషన్‌ అటవీ భూములను పరిశీలించి, సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పారు.


ఆరు నెలలైనా అవగాహన రాలేదా?

ఆర్డీవోగా వచ్చి ఆరు నెలలైనా అవగాహన రాలేదా.. అంటూ దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. చందంపేట మండలం కంభాలపల్లి, పొగిళ్ల, తెల్లదేవరపల్లి గ్రామాలకు చెందిన సాగర్‌ ముంపు భూ నిర్వాసితులు శంకర్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్‌, రమావత్‌ రత్తి మాట్లాడుతూ..కొన్నేళ్ల క్రితం భూమి పట్టాలు ఇచ్చినా, హక్కులు కల్పించలేదని, పాస్‌ పుస్తకాలు ఇవ్వలేదని చెప్పారు. ఫలితంగా రైతుబంధు రాలేదని, రుణమాఫీ కాలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వారికి సమాధానం చెప్పాలని మంత్రి ఆర్డీవోని కోరారు. ఆ సమస్యలు తన దృష్టికి రాలేదని, తెలుసుకొని పరిష్కరిస్తానని ఆర్డీవో తెలిపారు. ఆర్డీవోగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారని మంత్రి ప్రశ్నించగా.. ఆరు నెలలైందని చెప్పారు. 6 నెలలైనా అవగాహన రాలేదా? అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చందంపేటను పైలెట్‌ మండలంగా ప్రకటించి, మండలంలో నెలకొన్న భూసమస్యలన్నీ పరిష్కరించాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌ కోరారు.


ధరణి పేరుతో బీఆర్‌ఎస్‌ భూ కబ్జాలు

గత ప్రభుత్వం ధరణిని అడ్డుపెట్టుకొని రంగారెడ్డి జిల్లాలో వందలాది ఎకరాలను కబ్జా చేసినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించి, ఆ భూములను వెలికి తీస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కేసీఆర్‌ కుటుంబంలో నలుగురి కోసమే ధరణి చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. ఇందుకు భిన్నంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలు, రైతుల కోసం తమ ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిందని చెప్పారు. పార్ట్‌-బీలో ఉన్న 18 లక్షల ఎకరాలకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. గతంలో అక్రమంగా పాస్‌ పుస్తకాలు పొందితే, వాటిని రద్దు చేసే అధికారం ఈ చట్టంలో ఉందని తెలిపారు. చట్టంలో కౌలుదారు కాలాన్ని పొందుపరుస్తున్నామని, వారికి కూడా న్యాయం జరిగేట్లు చూస్తామని అన్నారు. గ్రామాల్లో పేదలకు స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కోరగా.. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Revanth Reddy: ఆ అధికారిని రిటైరయ్యాక కొనసాగించండి

BRS MLC Kavitha: పేరుకే ముగ్గురు మంత్రులు అభివృద్ధి శూన్యం

Cybercrime: సైబర్‌ నేరగాళ్లకు కమీషన్‌పై ఖాతాల అందజేత

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 22 , 2025 | 03:03 AM