Share News

Ponguleti: దొరల కోసమే ధరణి

ABN , Publish Date - Apr 19 , 2025 | 03:58 AM

గతంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల కోసమే కేసీఆర్‌ ధరణి చట్టాన్ని తీసుకొచ్చారని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. భూమితో సంబంధంలేని, గులాబీ చొక్కా వేసుకున్న వారికి పట్టాలు ఇచ్చి, రైతుబంధు పథకంతో లబ్ధి కలిగించారని ఆరోపించారు.

Ponguleti: దొరల కోసమే ధరణి

  • అందుకే దానిని బంగాళాఖాతంలో విసిరేశాం

  • పేదోడి చుట్టమైన భూభారతి చట్టాన్ని తెచ్చాం

  • ప్రతి రైతుకూ భూధార్‌ నంబర్‌: మంత్రి పొంగులేటి

  • ములుగు, ఆదిలాబాద్‌ జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు

  • హాజరైన మంత్రులు సీతక్క, సురేఖ, ఎమ్మెల్యేలు

ములుగు/ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): గతంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల కోసమే కేసీఆర్‌ ధరణి చట్టాన్ని తీసుకొచ్చారని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. భూమితో సంబంధంలేని, గులాబీ చొక్కా వేసుకున్న వారికి పట్టాలు ఇచ్చి, రైతుబంధు పథకంతో లబ్ధి కలిగించారని ఆరోపించారు. ఖాస్తులో ఉన్న రైతులకు మాత్రం పట్టాలివ్వకుండా మోసం చేశారని, దాంతో వారి బతుకులు రోడ్డున పడ్డాయని తెలిపారు. ధరణి చట్టం పేదోడికి శత్రువుగా మారిందని, అందుకే తమ ప్రభుత్వం దానిని బంగాళాఖాతంలోకి విసిరేసి.. సామాన్య ప్రజలకు చుట్టంలా ఉండే భూభారతి చట్టాన్ని తెచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం-2025పై శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండల కేంద్రంలో, ఆదిలాబాద్‌ జిల్లా బోరజ్‌ మండలంలో పూసాయి గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులకు మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం 18 లక్షల ఎకరాలను పార్టు బీలో పెండింగ్‌లో పెట్టిందని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు భూ సమస్యల కోసం ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఎదురైందని తెలిపారు. తమ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయంలో తప్పు జరిగితే దానిని సరిదిద్దుకుంటామని, గత ప్రభుత్వంలో మాత్రం దొర ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గేదే లేదన్నట్లు వ్యవహరించేవారని దుయ్యబట్టారు. భూభారతి సమస్యల పరిష్కారానికి త్వరలో టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. గిరిజన, గిరిజనేతరులుండే ప్రాంతాల్లో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఓ కమిటీని నియమిస్తామని ప్రకటించారు.


గ్రామాలకు రెవెన్యూ అధికారులు..

భూ సమస్యల విషయంలో రైతులు ఇకపై అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి అన్నారు. జూన్‌ 2 నుంచి రెవెన్యూ అధికారులే గ్రామాలకు వస్తారని, దరఖాస్తులను పూర్తి చేసి ఇస్తే వెంటనే సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 9.26 లక్షల సాదా బైనామా దరఖాస్తులు రాగా.. వాటికి పరిష్కారం చూపలేదని విమర్శించారు. భూ భారతిలో వీటికి పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ప్రతి మనిషికీ ఆధార్‌కార్డు ఉన్నట్లుగానే ప్రతి రైతుకూ భూధార్‌ నంబర్‌ను కేటాయిస్తామన్నారు. త్వరలోనే 6వేల మంది సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి లైసెన్సులు అందజేస్తామని, మరో వెయ్యి మందికి సర్వేయర్లను కొత్తగా నియమిస్తామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. భూమితోనే మానవుని మనుగడ కొనసాగుతుందని, రైతులకు భూమితో తల్లీబిడ్డల అనుబంధం ఉంటుందని అన్నారు. కానీ, గత ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను దగా చేసిందని ఆరోపించారు. ధరణి బాధలు తొలగిపోయి భూభారతితో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. మళ్లీ తప్పులు జరగకుండా అధికారులు పని చేయాలని, క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తరువాతే రిజిస్ర్టేషన్‌లు చేయాలని సూచించారు. గత ప్రభుత్వం అధికారులను దొంగలను చేసిందని మండిపడ్డారు. కాగా, రైతుల కళ్లలో నీళ్లు చూడలేకనే సీఎం రేవంత్‌రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు బలరాంనాయక్‌, గోడం నగేష్‌, ఎమ్మెల్యేలు, ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ(ఫైనాన్స్‌) రామకృష్ణారావు, రెవెన్యూ సెక్రటరీ బుద్ధ ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇందిరమ్మ ఇళ్లపై తప్పుడు సమాచారం.. బిల్‌ కలెక్టర్‌ సస్పెన్షన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంతో ఓ బిల్‌ కలెక్టర్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో 18 మంది లబ్ధిదారులు బేస్‌మెంట్‌ దశను నిర్మించకముందే.. నిర్మించారంటూ తప్పుడు సమాచారాన్ని బిల్‌ కలెక్టర్‌ జగదీశ్‌ ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీనిపై జగదీశ్‌కు ఉన్నతాధికారులు మెమో జారీ చేయగా .. తాను పొరపాటున ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశానని సంజాయిషీ ఇచ్చారు. విధి నిర్వహణలో అలసత్వంగా వ్యవహరించినందుకు జగదీశ్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో అవకతవకలకు పాల్పడినా, అలసత్వం వహించినా ఉపేక్షించేదిలేదని స్పష్టంచేశారు. ఈ మేరకు సమాచార శాఖ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: ఫోర్త్‌ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి

Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా

Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 19 , 2025 | 03:58 AM