Share News

బడిలో తెలుగుభాష.. ఇక నిక్కచ్చిగా అమలు

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:23 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది.

బడిలో తెలుగుభాష..  ఇక నిక్కచ్చిగా అమలు

  • 1-10 వరకు అన్ని సిలబ్‌సల స్కూళ్లలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాల్సిందే

  • సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌సఈ, ఐబీ సిలబస్‌ బడుల యాజమాన్యాలతో భేటీలో ప్రభుత్వం స్పష్టీకరణ

  • 9, 10 తరగతులకు సరళమైన తెలుగు పుస్తకం.. సింగిడి స్థానంలో వెన్నెల అమలుకు మెమో జారీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. అన్ని బోర్డుల స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి మొదలు 10వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశించింది. విద్యార్థులకు తెలుగు భాషపై పరీక్షలను కూడా నిర్వహించాలని తెలిపింది. విద్యార్థులు తెలుగు భాషను అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాలలను ఆదేశించింది. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టాలని సూచించింది. విద్యార్థులకు సరళమైన విధానంలో బోధించడం, వారిలో అభిరుచిని పెంపొందించడానికి వీలుగా 9, 10 తరగతుల పాఠ్యాంశంగా ‘వెన్నెల’ అనే తెలుగు వాచకం పుస్తకాన్ని తీసుకొచ్చింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూపొందించిన ‘సింగిడి’ పుస్తకం స్థానంలో సరళమైన భాషలో ఈ ‘వెన్నెల’ పుస్తకాన్ని రూపొందించింది. దీనివినియోగానికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి డా.యోగితా రాణా మంగళవారం మెమో జారీ చేశారు.


ఈ పుస్తకం ఆధారంగా సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌సఈ, ఐబీ బోర్డుల యాజమాన్యాలు 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చట్టం తెచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగంలో గల జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ఎయిడెడ్‌ పాఠశాలలతో పాటు ప్రైవేటు రంగంలోని సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌సఈ, ఐబీ బోర్డుల అజమాయిషీ కింద గల పాఠశాలల్లో 9, 10 తరగతులకు తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలని చట్టంలో పొందుపర్చింది. ఈ చట్టం 2018 మార్చి 30 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. కానీ... వివిధ కారణా ల వల్ల గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దీనిని సక్రమంగా అమ లు చేయలేదని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. తమ హయాంలో తెలుగు భాషను తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే సీబీఎస్‌ఈ, ఐసీఎ్‌సఈ, ఐబీ సిలబస్‌ బోధించే పాఠశాలల యాజమాన్యాలతో అధికారులు తాజాగా సమావేశాన్ని నిర్వహించారు. చాలావరకు సీబీఎస్సీ పాఠశాలలు తెలుగును అమలు చేస్తున్నాయి. ఇతర సిలబస్‌ స్కూళ్లలోనూ వందశాతం అమలు లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి 9 తరగతి విద్యార్థులకు, 2026-27 నుంచి 10 తరగతి విద్యార్థులకు ‘వెన్నెల’ తెలుగు వాచకాన్ని బోధించాలని, దీని ఆధారంగా పరీక్షను కూడా నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజా మెమో ద్వారా పాఠశాల యాజమాన్యాలను ఆదేశించింది.

Updated Date - Feb 26 , 2025 | 04:23 AM