Hyderabad Metro: బ్యాంకు రుణాలు రూ.21,047 కోట్లు..!
ABN , Publish Date - Jun 23 , 2025 | 05:02 AM
హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టుకు సంబంధించి కనీసం 50 శాతం పనులైనా పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మెట్రో రెండో దశకు అంతర్జాతీయ బ్యాంకుల నుంచి నిధులు
‘జైకా’తో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపులు
హైదరాబాద్ సిటీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టుకు సంబంధించి కనీసం 50 శాతం పనులైనా పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిధుల్లో తమ వాటాను ఇవ్వడంతోపాటు కేంద్రం, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకొచ్చే రుణాల కోసం కసరత్తు చేస్తోంది. మెట్రో రెండో దశ పనులను పార్ట్-ఏ, పార్ట్-బీ కింద 8 కారిడార్లను ప్రతిపాదించి రూ.43,848 కోట్లు నిధులు కేటాయించారు. ఈ నిధుల్లో సింహభాగాన్ని అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణంగా సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొత్తం రూ.43,848 కోట్లలో 48శాతం అంటే రూ.21,047.04 కోట్ల ను అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాలుగా సేకరించనున్నారు.
రెండు నెలల క్రితం జపాన్ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అక్కడి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ప్రతినిధులతో సమావేశమై నిధుల అంశంపై చర్చించారు. కేంద్రం ప్రభుత్వం డీపీఆర్‌కు అనుమతి ఇచ్చిన వెంటనే సాయం చేయాలని కోరారు. మరోపక్క, మెట్రో రెండో దశ పార్ట్-ఏలో ప్రతిపాదించిన 5 కారిడార్లకు కేంద్రం నుంచి అనుమతి పొందేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కాగా, పార్ట్-ఏ, పార్ట్-బీ కింద చేపట్టనున్న పనులకు అవసరమైన నిధుల్లో 4శాతం.. అనగా రూ.1,753 కోట్లను పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) కింద సేకరించాలని అనుకుంటున్నారు. ప్రాజెక్టుకు అవసరమయ్యే మొత్తం నిధుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను మినహాయిస్తే.. బ్యాంకులు, పీపీపీ కింద రూ.22,800 కోట్లు వరకు సేకరించనున్నారు.