TG EAPCET: నేటి నుంచి ఎప్‌సెట్
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:25 AM
ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన టీజీ ఎప్‌సెట్-2025 ప్రవేశ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

నేడు, రేపు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు
మే 2నుంచి 4వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు
హైదరాబాద్ సిటీ/హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన టీజీ ఎప్‌సెట్-2025 ప్రవేశ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళ, బుధవారాల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు, మే నెల 2నుంచి 4 వరకు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. ఇంజనీరింగ్ పరీక్షలను ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహించనుండగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు మంగళవారం రెండు సెషన్లలో, బుధవారం ఒక(ఉదయం) సెషన్‌లో మాత్రమే జరగనున్నాయి. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం లేటైనా అభ్యర్థులను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం పరీక్షల నిర్వహణకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 112 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇంజనీరింగ్ పరీక్షల నిమిత్తం 124 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎప్‌సెట్ పరీక్షా కేంద్రాలు ఉన్న రూట్లలో అభ్యర్థుల సౌలభ్యం కోసం అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
అగ్రికల్చర్ విభాగానికి 59ఏళ్ల అభ్యర్థి దరఖాస్తు
ఎప్‌సెట్‌కు మొత్తం 3,06,894 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి 86,523మంది దరఖాస్తు చేయగా, ఇంజనీరింగ్ విభాగం కోసం 2,20,117మంది, రెండు పరీక్షల కోసం మరో 254మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. మరోవైపు ఎప్‌సెట్ రాసేందుకు గరిష్ఠ వయో పరిమితి లేనందున.. అగ్రికల్చర్ పరీక్షకు గరిష్ఠంగా 59ఏళ్ల అభ్యర్థి, ఇంజనీరింగ్ పరీక్షకు 57ఏళ్ల అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. మరోవైపు కనిష్ఠ వయస్సు 17ఏళ్లు కాగా, అంతకన్నా తక్కువ వయస్సున్న ఇద్దరు అభ్యర్థులు ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.