భూపాలపల్లి జిల్లాలో.. పోడు భూముల ఘర్షణ
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:25 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోడు భూముల లొల్లి రాజుకుంది. భూపాలపల్లి మండల పరిధి ఆజంనగర్‌లోని పోడు భూముల వద్దకు ఫారెస్టు అధికారులు గురువారం ట్రెంచ్‌లు కొట్టేందుకు యంత్రాలతో వెళ్లగా గ్రామస్థులు అడ్డుకున్నారు.

కాకతీయఖని, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోడు భూముల లొల్లి రాజుకుంది. భూపాలపల్లి మండల పరిధి ఆజంనగర్‌లోని పోడు భూముల వద్దకు ఫారెస్టు అధికారులు గురువారం ట్రెంచ్‌లు కొట్టేందుకు యంత్రాలతో వెళ్లగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఫారెస్టు అధికారులు, గ్రామస్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. అటవీ శాఖ అధికారులు, గ్రామస్థులు పరస్పరం పోలీ్‌సస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. సుమారు 150 మంది అటవీశాఖ సిబ్బంది గ్రామానికి వచ్చారని, తాము వారి విధులను అడ్డుకోలేదని, జేసీబీలను పోడుభూముల్లోకి వెళ్లకుండా అడ్డుపడ్డామని స్థానికులు చెబుతున్నారు.
ఈ క్రమంలో అటవీ అధికారులు తమను దుర్భాషలాడుతూ దాడికి దిగారని, బూటుకాళ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో పట్టం శారద అనే మహిళ స్పృహ కోల్పోయిందని చెప్పారు. ఆమెను చికిత్స నిమిత్తం భూపాలపల్లి ఆస్పత్రిలో చేర్పించామని వివరించారు. లంచం ఇవ్వలేదనే అక్కసుతో కందకాలు తవ్వేందుకు అధికారులు వచ్చారని ఆరోపించారు. అయితే.. గ్రామస్థులే తమపై దాడి చేశారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పరస్పర ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు.. 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. సామాన్యులపై అధికారుల దాడిని ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.