Share News

Adilabad: పోలీసులపై ముల్తానీల రాళ్ల దాడి

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:37 AM

అటవీ భూముల్లో మొక్కలు నాటడానికి అటవీ అధికారులు, పోలీసులు వెళ్లగా.. తమ భూముల్లో మొక్కలు నాటొద్దంటూ ముల్తానీలు(పోడు రైతులు) వారిపై రాళ్ల దాడి చేశారు.

Adilabad: పోలీసులపై ముల్తానీల రాళ్ల దాడి

  • పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ అధికారులు

  • పంట భూముల జోలికి రావద్దంటూ ముల్తానీ మహిళల తిరుగుబాటు

  • ఇచ్చోడ ఎస్సై సహా 8 మందికి గాయాలు

  • ఆదిలాబాద్‌ జిల్లా సిరిచెల్మలో ఘటన

ఇచ్చోడ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): అటవీ భూముల్లో మొక్కలు నాటడానికి అటవీ అధికారులు, పోలీసులు వెళ్లగా.. తమ భూముల్లో మొక్కలు నాటొద్దంటూ ముల్తానీలు(పోడు రైతులు) వారిపై రాళ్ల దాడి చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ అటవీ పరిధిలోని కేశవపట్నం గ్రామంలో గత రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం జరిగిన దాడిలో ఇచ్చోడ ఎస్‌ఐ సహా 8 మంది పోలీసులకు గాయాలయ్యావగా.. వారి వాహనం ధ్వంసం అయ్యింది. వెంటనే వారిని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రతీ ఏటా ఈ అటవీ ప్రాంతంలో అధికారులు మొక్కలు నాటుతుంటారు. అందులో భాగంగానే శనివారం సిరిచెల్మ అటవీ పరిధిలోని 172, 174 కంపార్ట్‌మెంట్లలో మొక్కలు నాటేందుకు అధికారులు.. వారి భద్రత కోసం పోలీసులు వెళ్లారు.


అక్కడి భూములు సాగు చేస్తున్న ముల్తానీలు.. నాటిన మొక్కలను పీకేసి ఆ భూములు తమవేనని, తమ భూముల్లో మొక్కలు నాటవద్దని అఽధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ జోలికి వస్తే ఇక్కడే కొడవళ్లతో ఆత్మహత్యలు చేసుకుంటామని.. అక్కడున్న మహిళా రైతులు బెదిరించడంతో అఽధికారులు వెళ్లిపోయారు. తిరిగి ఆదివారం ఉదయం అధికారులు, పోలీసులు పకడ్బందీగా గ్రామానికి వెళ్లగా.. గ్రామస్థులంతా ఏకమై పోలీసులపై దాడి చేశారు. దీంతో కేశవపట్నంలో భారీగా పోలీసులను మోహరించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఇచ్చోడ పోలీసు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. పోడు భూముల సమస్యపై అటవీ అధికారులతో చర్చలను కొనసాగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్‌

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 04:37 AM